Monday, September 27, 2010

నా వంట తంటాలు

ఈ పోస్టు రాయడానికి కూర్చుని ఒకసారి అలా ఆగ్రిగేటర్ లో చూడగానే
కల్పన గారి
టపా కనపడింది. నా లాంటి వారు కూడా ఉంటారు లే, హమ్మయ్య అనుకుని ధైర్యం గా టపా మొదలెట్టాను.

నేను ఎనిమిదో తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడో ఓ సారి అనుకోకుండా అమ్మ ఊరెళ్ళాల్సివచ్చింది. అక్క కూడా లేదు ఊరిలో.నాన్నగారేమో నేను క్యారేజీ తెప్పిస్తానమ్మ అన్నారు. అక్కర్లేదు నాన్నగారూ,నేను చేస్తా అన్నాను.

పొద్దున్నే నేను ఇచ్చిన కాఫీ నీళ్ళు మాత్రం తాగి ఆఫీసుకి వెళ్ళారు.వెళ్ళాకా ఆలోచించడం మొదలెట్టా. ఏమి చెయ్యాలి అని.ఇంట్లో ఏమో బెండకాయలు,ఆకుకూర,క్యాబేజీ కనిపించాయి. అన్నింట్లోకీ వీజీ బెండకాయే అనిపించింది.

అంతకు ముందు రోజే అమ్మ ఆలూ ని కుక్కర్ లో ఉడికించడం చూసి,బెండకాయలు కూడా శుభ్రం గా కడిగి కట్ చేసి కుక్కర్ లో పెట్టా ఒక 3-4 విజిల్స్ వచ్చేవరకు.తక్కువ విజిల్స్ అయితే ఉడకదేమో అని భయం మరి.


కుక్కర్ తీసి చూద్దును కదా,స్కూలో ఝండాలంటించుకునే మైదా పిండి కి ప్రతిసౄష్టి కనపడింది. ఏమీ కాదు,నూనె లో వేయిస్తే ఈ తడి పోతుంది అనుకుని ,స్టవ్ మీద మూకుడూ పెట్టాను. నూనే ఎంత వెయ్యాలి అని డవుటు.

మరలా అమ్మ ఆలూ ఫ్రై కోసం పెట్టిన నూనె గుర్తుకు తెచ్చుకుని,ఎందుకయినా మంచిదని కొంచెం ఎక్కువ అనగా మూకుడి సగం వరకు నూనె పోసాను. నూనె కాగాకా, దానిలో పోపు వేసా.పోపు కూడా ఆషా మాషీ పోపు కాదండోయ్,అమ్మ దాచిపెట్టిన "వనిత" పుస్తకాలలో చదివిన వంటలలో అన్నీ సమ పాళ్ళలో వెయ్యమన్నది గుర్తొచ్చి ఆవాలు,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు,ఎందు మిర్చి,ఇంగువ వైగైరా పోపుల పెట్టె లో కనపడిన వన్నీ తలా ఒక స్పూను వేసా.

ఇప్పుడు నా ఝండా పిండి ని అలా దూరం గా నిలబడి దానిలోకి వేసాను.కాసేపయ్యాకా చూసినా కానీ అమ్మ చేసే బెండకాయ కూర రూపు కనపడలేదు. ఇంతలో నాన్నగారొచ్చారు లంచ్ కి.వంటింట్లోకొచ్చి చిల్లుల గరిటె తో ఆ పదార్ధ్హాన్ని నూనే లేకుండా ఒక గిన్నెలో తీసి జావ లాంటి అన్నంతో మారు మాట్లాడకుండా తినేసారు. ఎలా ఉంది నాన్నగారూ వంట,అని అడిగా. అమ్మ కంటే బాగా చేసావు నాన్న అన్న మాట విని,కూర ఖాళీ చేయబోయిన దాన్నల్లా ఆగి కొంచం అమ్మ కోసం ఉంచా.


సాయంత్రం అమ్మ రాగానే అమ్మ కి చూపించేసరికి......
బెండకాయలెందుకు ఉడకబెట్టావే అంది. నువ్వు అలూ పెడతావుగా అందుకే అన్నాను.నిన్ను ఫాలో అయ్యగా,ఇంకా తప్పేంటి అన్న ధీమాతో. వంటింట్లోకెళ్ళీ మరి ఈ నూనె ఏమిటి అని అడిగింది.నువ్వు ఆలూ వేయించేటప్పుడు వేసే అంతటి నూనే వేసాను అన్నాను.

అర్ధమయ్యిందనుకుంటా మీకు...అలూ ఉడక బెట్టినట్లు బెండకాయ కుక్కర్లో పెట్టాను,పోనీ ఉడికిస్తే ఉడికించా తక్కువ నూనె వెయ్య్ద్దూ పోపులో,ఆలూ ఫ్రై గుర్తు తెచ్చుకుని సగం నూనె పోసేసా అన్నమట. అదన్నమాట,ఆలూ ఇన్స్పిరేషన్ తో నా మొదటి కూర ఎక్స్పీరియన్స్.

మరలా ఎప్పుడూ మా అమ్మ నన్ను వదిలి ఊరెళ్ళకపోవడంతో,నాన్నగారికి మా అమ్మ కంటే మంచి వంట తినే భాగ్యం లేకపోయింది.

ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఎప్పుడూ వంట నేర్చుకున్న పాపాన పోలేదు. ఆ తరువాత హాస్టలు. హాస్టలు నుండి ఇంటికి వెళ్ళినప్పుడేమో మహరాణీ భోగం,హాయిగా అమ్మ చేస్తే తిని పెట్టడం. ఏరోజయినా కూర చెయ్యకుండా పప్పు,పచ్చడి తో సరిపెడితే రంకెలెయ్యడం. ఎప్పుడయినా వంటింట్లో కి వెళ్ళినా సగం సేపు నాకు వంటిల్లు సర్దటం తోనే సరిపోయేది. ఇదిగో ఈ పచ్చడి పాత పడింది,ఇంకా ఎందుకు ఉంచావు అని పాత ఉసిరికాయో చింతకాయో తీసి బయట పడెయ్యడ్డనికి రెడీ అవ్వడం, మా అమ్మ లోపలకి వచ్చి నీకు తెలీదు ఇవన్నీ పాడవ్వని పచ్చళ్ళు,ముందర నడూ బయటకి అని నన్ను బయటకి పంపేసేది.

మా అమ్మ చలవ,నా బద్ధకం వల్ల అసలు అన్నంలో ఎన్ని నీళ్ళు పొయ్యాలో కూడా తెలీని పసి వయసులో(వంట రానప్పుడు పసి వయసేగా)పెళ్ళయిపోయింది.

అత్తగారింట్లో మొదటి సారి వంట చెయ్యక్కర్లేకుండా గడచిపోయింది. రెండో సారి ఉగాది కి వెళ్ళాము. పొద్దున్నే లేచి తయారయ్యి వంటింట్లో కి వెళ్ళాను. అక్కడ అత్తగారు ములక్కాడలు,దోసకాయ ఇంకా ఏవో పెట్టుకుని వంటకి తయారవుతున్నారు.

నేను చేస్తానండీ అన్నా వినయంగా. వద్దమ్మ,టిఫిన్ తిను ముందు అన్నారు. చేస్తా అని అనేసా కానీ అసలు వాటితో ఏమి చెయ్యాలో కూడా తెలీదు. టిఫిన్ తిని మరలా పట్టుబట్టాను నేను వంట చేస్తా అని.నిజంగా చెయ్యి అని ఉండుంటే ....దేవుడా...నిన్ను నమ్మినందుకు కాపాడావు అనుకుంటా ఇప్పుడు అది గుర్తొచ్చిన్నప్పుడల్లా.

వంట వద్దు కానీ,కాస్త ఈ ములక్కాడలు తరిగివ్వు చాలు అన్నారు. సరే,అదెంతసేపు అని చాకు తీసుకుని కింద కూర్చున్నా. ములక్కాడలని తరిగి మధ్యలో వచ్చే ఈనెలు తియ్యాలి అని తెలీదు.నిజం. ఒక 2 ముక్కలు తరిగేసరికి నా ప్రావీణ్యం అర్ధమయ్యింది అత్తగారికి. మోటారు ఆఫ్ చెయ్యమ్మా అని ఓ పని అప్ప చెప్పి చక చకా తరిగి ఈనెలు తీయడం చూసి నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు.

ఆరోజు పెసర వడలు వేస్తున్నారు పొద్దున్నే టిఫిన్ కోసం. వాటిని అలా చేతి మీదో,పాల కవర్ మీదో సుతారం గా వెయ్యడం చూసి ఓస్,నేనూ చేసిపడెయ్యగలను అనుకున్నాను. దగ్గరకి వెళ్ళగానే,వద్దమ్మ,ఇదిగో ఈ కాఫీ మామయ్యగారికి ఇచ్చి రా అన్నారు.తడబడే అడుగులతో కాఫీ పట్టుకుని వెళ్ళాను.భయం తో కాదు అడుగులు తడబడింది,చీర కట్టుకున్నా కదా,దానితో ఇబ్బంది.


నాకేమీ రాదు,అయినా కొత్త కోడలికి వంట రాదనుకుంటారేమో అనుకుని మరలా వెళ్ళా వంటింట్లోకి. ఇక విసుగొచ్చిందో ఏమో ఆవిడ పాల కవర్ మీద గారే అద్ది(నా ప్రావీణ్యాన్ని ములక్కాడ తరిగినప్పుడే అంచనా వేసుంటారు) నాకిచ్చారు నూనెలో వెయ్యమని.

నిజం చెప్పొద్దూ,నాకు చచ్చే భయం నూనెలో కూర ముక్కలు వెయ్యాలన్నా కానీ.ఇక అంత సల సలా కాగే నూనె లో గారె వెయ్యడమంటే..హమ్మో.

పెళ్ళికి ముందు చదివిన షివ్ ఖేర పుస్తకం "యూ కెన్ విన్" ఓ సారి గుర్తు తెచ్చుకుని కాస్త వెనక్కి జరిగి పై నుండీ గారె వేసా నూనెలో. బుడుంగ్......అని నూనె చింది పక్కనున్న వస్తువుల మీద పడింది.

అత్తగారి వైపు చూసా భయం భయం గా. వాడు లేచుంటాడు చూడమ్మా అని మెత్తగా చెప్పారు నువ్వు ఇక దయ చేయి అని :).

ఇంతలో ఎవరో వచ్చారు ఇంటికి.అయిపోయాను,వీళ్ళకి వంట చెయ్యాలో ఏమో అనుకున్నా. ఇంతలో మా అత్తగారు లోపలకి పిలిచి ప్లేటు నిండా గారెలు సర్ది వాళ్ళకి ఇచ్చి రమ్మన్నారు. ఆవిడ వెనకాలే వచ్చి ఈరోజు అమ్మాయ్యే వంట చేసింది అని చెప్పేసరికి, నేను టైడ్ తెల్లదన్నాన్ని చూసినప్పటికంటే ఎక్కువ అవాక్కయ్యాను.


వచ్చినవారు మగవారు కాబట్టి సరిపోయింది. ఆడవాళ్ళు వచ్చుంటే తిన్నగా వంటింట్లో కి వచ్చేసి కూర్చుని,అక్కయ్యా రావే మాట్లాడూకుందాము అని మా అత్తగారిని పిలిచి కబుర్లాడటం మొదలుపెట్టి ఉంటే.....

అలా మొత్తానికి అత్తగారింట్లో గండం గడచిపోయింది. నాకు వంట రాదన్న సంగతి ఎక్కడా బయటకి రాకుండా పాపం అత్తయ్యగారు బాగా మేనేజ్ చేసారు. కానీ నిజం నిప్పులాంటిది,దాగదు కదా.

ఒక శుభ ముహుర్తాన బయటపడిపోయాను. మళ్ళీ చెప్తా ఆ విషయం.

11 comments:

  1. హా..హా.. అంతేమరి ఎవరూ వంట నేర్చుకుని పుట్టలేదు. ఇలాటి చిన్న చిన్న యాక్సిడెంట్లు లేకపోతే పాఠాలు ఎలా గుర్తుంటాయి. మనకూ ఒక లైఫ్ హిస్టరీ ఉందిలెండి ఈ వంట విషయంలో.. ఎప్పుడో బ్లాగేసాను కూడా...

    ReplyDelete
  2. మీ బ్లాగ్ బాగుందండీ. బాగా రాస్తున్నారు.

    ReplyDelete
  3. హహహ మంచి అత్తగారు దొరికారు మీకు...బాగానే నెట్టుకొచ్చారుగా.

    ReplyDelete
  4. పోస్ట్ అదిరింది. ఎందుకంతే నా స్ఫూర్తి తో రాశారు కదా...హాహాహా..

    కాకపోతే మీరెమితండీ మన ఆశయాలకు విరుద్ధం గా ....బ్లాగ్ పేరు, మీ పేరు అన్నీ పూర్తి గా వంట వాసనెస్తున్నాయి...నేనొప్పుకొను అంతే...

    ReplyDelete
  5. హ హ హ బాగుంది మీ వంట తంట .

    ReplyDelete
  6. భలే బాగుంది మీ బెండకాయ కూర, మొత్తానికి మీ అత్త గారిని మేచ్చుకోవాలండి! అయినా ఇలాంటి అత్తగార్లు ఉన్నారా

    ReplyDelete
  7. జ్యోతి గారూ,
    అంతే అంటారా..పెద్ద లిస్టే ఉంది మీ పోస్టులు,బ్లాగులది. చదవాలి అవన్నీ

    త్రుష్ణ గారూ,
    ధన్యవాదాలండీ

    సౌమ్య గారూ,
    తప్పలేదండీ బాబూ.

    కల్పన గారూ,
    మనిద్దరం ఒకే జాతి కి చెందిన వాళ్ళము. మెంతి బద్దలు నోరూరిస్తాయి కదండీ అందుకే బ్లాగు పేరు అది,సరిగ్గా అతుకుతుందని నా పేరు ఆవకాయ. అదన్నమాట పేర్ల వెనక కహానీ.ఒక డవుటు,మీకు రెంటాల గోపాల క్రిష్ణగారు తండ్రిగారా?మొన్న మీ పోస్టు లో సంఖ్యా శాస్త్రం వగైరా ప్రస్తావిస్తేను.


    మాలా కుమార్ గారూ,
    :))
    జాబిల్లి గారూ,భాను గారూ,
    నిజంగానే మా అత్తగారు కాపాడారండీ బాబూ నన్ను.ఒకానొక పరిస్థితి లో ఆవిడా చేతులెత్తేసారు లెండీ. ఆ కధ చెప్తా మరలా.

    ReplyDelete
  8. అబ్బో నన్ను మించి పోయారు కదా... అసలు కేక మీ వంట... సూపరండీ బాబు... మీ అత్తగారు కూడ కేక.

    ReplyDelete
  9. mee attayagaru kuda chethulu ettese range lo meeru vanta lo praavenyam gadincharu annamata :)

    Baagundhi kahani .....

    Priya

    ReplyDelete
  10. chala bavundadi..maa akka kuda ante..

    ReplyDelete