వీరికి మనవడు పుడితే ఇంక వీరి ఆదర్శలు వినడానికి మన చెవులు సరిపోవు. ఎవరైన ఒకటే అండీ మాకు, ఆడపిల్లయినా ఇలాగే సంతోషంగా ఉండేవాళ్ళం అని పక్కవాళ్ళతో అంటోంటే విన్న కోడలికి ఒళ్ళు మండదూ?? తమ మనవడు మనవరాలు అందంగాఉంటే మాత్రం వాళ్ళ పోలిక. ఏ మాత్రం కాస్త నలుపైనా లేదా జుట్టు పలచగా ఉన్నా కోడలి వైపు పోలికలే అవన్నీ. కోడలి అమ్మా నాన్నా, సోదర సోదరులెవ్వరికీ అలాంటి జుట్టో. రంగో లేదనుకోండి. కోడలి బామ్మకో అమ్మమ్మకో లంకె పెడతారు అదిగో ఆవిడ పోలికే అంటూ.. హూ..
4)ఇంకొంతమంది అత్తగార్లుంటారు. ఏదయినా వస్తువు నచ్చితే ఇది బాగుంది బాగుంది అని ఓ 3-4 సార్లంటారు. సరే అత్తయ్యా, తీసుకెళ్ళండి అంటే మాత్రం అబ్బే నాకెందుకు వద్దు అంటారు. ఓ నాలుగైదు సార్లు బ్రతిమాలితే కానీ తీసుకోరు. ఏదో పెళ్లయిన కొత్తలో అంటే సరే లే కోడలేమనుకుంటుందో అన్న మొహమాటమనుకోవచ్చు. పెళ్ళయ్యి పుష్కరమయినా ఇంకా అలా సాగించుకోవాలని చూస్తే...
5)అత్తయ్యగారూ కొత్త ఉద్యోగం లో చేరాను అని చెప్పగానే వచ్చే ప్రశ్నలు మాకు తెలుసు. "జీతం పెరిగిందా మరి, వాడి కంటే ఎక్కువా ఇప్పుడు లేదా అదేంటీ ఇంకా అంతేనా నీ జీతం?? ".. ఈ ప్రశ్నలు వినగానే ఫోను విసిరికొట్టెయ్యాలన్నంత కోపం వస్తుంది.
6)తాము తమ అత్తింటివారిని ఆదరించామా అని కూడా ఆలోచించకుండా గతమెంతో ఘనం అన్నట్లు తమ కోడలికి మాత్రం అత్తగారినీ, మరిదినీ, ఆడపడచునీ ఎలా నెత్తినపెట్టుకోవాలో చెప్తారు.మామగారు ఓ చిన్న మాట మాట్లాడితే గదిమి కూర్చోబెట్టే అత్తగారు కొడుకు దగ్గరికొచ్చేసరికి మాత్రం కొడుకే రైటు కోడలికేమీ తెలీదు. ఇది చూసే బాపూ గారు ఓ ఛలోక్తి విసిరారనుకుంటా... "మా అల్లుడు చక్కగా అమ్మాయి చెప్పిన మాట వింటాడండీ, కొడుకే, పనికిమాలిన వెధవాయి లాగ కోడలి కొంగు పట్టుకు తిరుగుతాడు" అంటూ .
ఎలాంటి సన్నాయి నొక్కులూ లేకుండా నిజం గా కోడలిని సొంత కూతురిలా చూసుకునే అత్తగార్లూ మీకు నమో నమహ. కాస్త మీ మంచితనాన్ని సమాజం లో ఓ ముగ్గురు అత్తగార్లకి అంటించండి తల్లులూ మీకు పుణ్యం ఉంటుంది.



