
మా అక్క వాళ్ళ స్కూలు హెడ్మాస్టారు పోయినప్పుడు శెలవు ఇచ్చారు వాళ్ళకి.నేను అప్పుడు కొత్తగా పెట్టిన కాన్వెంటు లో ఉన్నాను. ఛీ!మా స్కూలు కి హెడ్మాస్టారు లేరె,ప్రిన్సిపాలే ఉన్నారు అని బాధ పడిపోయాను. స్కూల్లో ఎవరు టపా కట్టినా శెలవు అని తెలీదు.అలాంటి శెలవు మొదటి సారి చూడటం మరి.
తరువాత నేనూ మా అక్క స్కూలు కి వచ్చేసా.అప్పుడు స్కూల్లో పేద పిల్లలకి మధ్యాహ్నభోజనం పెట్టేవారు.నాకు ఆ భోజనం తినాలి తెగ కోరిక గా ఉండేది.ఆ సాంబారు చూస్తే నోరు ఊరిపోయేది. అమ్మ చేసిన చిక్కటి సాంబారు నచ్చేది కాదు ఆ నీళ్ళ సాంబారు మాత్రం నోరూరించేది.కొంత మంది పిల్లలు తమ కంచాలు తెచ్చుకుని స్కూల్లోనే భోజనం అదీ చేస్తోంటే నాకు ఇంటికి వెళ్ళి తినాలనిపించేది కాదు.కానీ,చెప్పా కదా,మా ఇల్లు స్కూలు కి బాగ దగ్గర.పైగా మా నాన్న అంటే టెర్రర్,దడా అన్నీ నాకు అప్పుడు.ఆయన ససేమిరా ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ భోజనం తినడానికి.
అక్కకి కూడా తినాలనిపించింది ఒకరోజు.హమ్మయ్య,అది అడుగుతుంది నాన్నగారిని,నేనూ తినచ్చు అనుకున్న.నాన్న మొదట ఒప్పుకోలేదు ఆ భోజనం తినడానికి,అది మనకి కాదు,పేద వాళ్ళకి.మనం అలా తినకూడదు అన్నారు,ఇంతలో అమ్మ అందుకుంది ఆ భోజనం శుభ్రం గా వండరు,ఒకసారి చూడు ఎలా వండుతున్నారో అంది.మళ్ళీ చూస్తా కానీ, తింటాను ప్లీజ్ అంది.మొత్తానికి ఒక 2 రోజులు ఆ భోజనం తినడానికి ఒప్పుకున్నారు.లోపల నుండి వింటున్న నా ఆనందం చూడాలి,ఎప్పుడు తెల్లవారుతుందా,ఎప్పుడు స్కూలు సంచీలో కంచం పెట్టుకుని స్కూలు కి వెళ్తానా అని ఉత్సాహం.పొద్దున్నే స్కూలు కి వెడుతూ అమ్మకి చెప్పా,నాకు మధ్యాహ్నానికి అన్నం వండకు,నేను స్కూల్లో తింటున్నా అని చెప్పి పరుగు లాంటి నడకతో స్కూలు చేరుకున్నా.ఎప్పుడు ఒంటి గంట అవుతుందా అన్న ఆనందం తో పాఠాలు ఏవీ చెవికి ఎక్కలేదు.మొత్తానికి భోజనం బెల్లు వినపడగానే కంచం తీసుకుని పరుగు పెట్టా.అలా స్కూలు లో అందరితో కలిసి తినడం,మొదటి సారి నా కంచం నేనే కడుగుకోవడం,థ్రిల్లింగ్ గా అనిపించాయి.మొత్తానికి ఆనందం గా ఇంటికి చేరా సాయంత్రం.
వస్తూనే సాయంత్రం అక్క తన కంచం తీసి అమ్మ కి ఇచ్చేసి,అమ్మ నేను రేపటి నుండి ఇంట్లొనే తింటాను అంది.ఏమయ్యింది అంది అమ్మ నవ్వుతూ.అమ్మా,ఈరోజు నేను భోజనం చేసి చెయ్యి కడుగుకుంటోంటే చూసాను,నేను చెయ్యి కడుక్కుంటున్నా,ఓ పక్క నుండి అక్కడే బియ్యం కడిగెస్తున్నారు.నా చెయ్యి కడిగిన నీళ్ళు దానిలో పడుతున్నా పట్టించుకోవట్లేదు వాళ్ళు.ఛా,అసహ్యం వేసింది అమ్మా,నిన్ననే రామూ మాస్టారు పరిసరాలు పరిశుభ్రత పాఠం లో కూడా చెప్పారు,అపరిశుభ్ర వాతావరణం లో వండిన ఆహారం తింటే రోగాలొస్తాయని అంది.
అక్క చెప్పింది కదా అక్కడ ఎలా వండుతున్నారో ,రేపటి నుండి నువ్వూ ఇంట్లొనే తిను చిన్నీ అని అమ్మ అనేసరికి కోపం ఆగలేదు నాకు.ప్చ్చ్..ఏమీ చెయ్యలేను.తప్పదు రేపటి నుండీ ఇంటికి రావాలి భోజనానికి అనుకున్నా.
మాకు చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ స్కూలు కి డబ్బులు ఇచ్చేవారు కాదు ఏమయినా కొనుక్కోవడానికి.ఏమి కావాలన్నా నాకు చెప్పు నేను తెస్తా బజార్ నుండి అనేవారు.మా స్కూల్లో ఏమో పిల్లలందరూ పాపమ్మ తెచ్చే జీళ్ళు,మామిడీ తాండ్ర కొనుక్కునే వారు. 5 పైసల కి ఒక తాండ్ర,స్క్వేర్ షేప్ లో ఉన్నది ఇచ్చేది పాపమ్మ.జీడి మాత్రం 10 పైసలు.నాకు నోరూరిపోయేది అవి చూస్తోంటే.నా స్నేహితురాలు ఏమో చక్కగా అన్నీ కొనుక్కునేది.నాకు ఏమో నాన్న ని డబ్బులు అడగాలంటే భయం.పోనీ నాన్న కి తెలీకుండా అమ్మ కూడా ఇచ్చేది కాదు.ఒక ఉపాయం కనిపెట్టా ఒకరోజు.మా ఇంట్లో రక రకాల గులాబీ మొక్కలు ఉండేవి.
ఆరెంజ్ కలర్ గులాబి నేను నా స్నేహితురాలికి ఇచ్చేటట్లు,తను నాకు ఒక జీడి,ఒక తాండ్ర ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాము.ఆహా,పాపమ్మ జీడి తిన్న రోజు నా ఆనందం చూడాలి.కానీ ఈ వ్యవహారం ఎక్కువ రోజులు జరగదు అని నాకు తెలుసు.ఇంట్లో నుండి రోజూ పువ్వు మాయం అయితే దొరికిపోతా కదా,అందుకే.
ఓ 2-3 సార్లు ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చానేమో నా స్నేహితురాలికి అంతే.మొత్తానికి ఆ స్కూలు లో పాపమ్మ జీడి ఎక్కువ సార్లు రుచి చూసే భాగ్యం మాత్రం నాకు కలగలేదు.దసరా అప్పుడు భలేగా ఉండేది మా స్కూల్లో.ఏదో పాట పాడుతూ ఊరంతా తిరిగి చివరికి పప్పు బెల్లం పెట్టేవారు.తెలిసున్న వాళ్ల ఇంటికి వెళ్తే అలా పాట పాడుతూ ఆ ఫీలింగే వేరు.ఆగస్టు పదిహేను వస్తే ఎప్పుడు జెండా వందనం అవుతుందా ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉండే న్యూట్రీన్ చాక్లెట్టులో,ఆరెంజ్ కలర్ లో ఉండే చాక్లెట్టులో తింటామా అని కుతూహలం.అలా చాక్లెట్టు ల కోసం వేచి చూసిన రోజులు గుర్తొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.
నాకు చిన్నప్పుడు నాపేరు అసలు నచ్చేది కాదు.ఏమి పేరు మార్చుకోవాలా అని చూసేదానిని.నాకు మొట్ట మొదట నచ్చిన పేరు "వెంకట లక్ష్మి".మా ఊరిలో అప్పట్లో "గన్ మ్యాన్" ఒకాయన ఉండేవారు.
ఆయన కూతురే ఈ వెంకట లక్ష్మి. ఆయన అడవికి వెళ్ళి పులులని వేటాడతారు అనుకునేదానిని.కానీ ఆయన సెక్యూరిటీ గార్డు అందుకే గన్ను చేతిలో అని తెలీదు అప్పట్లో.మా ఇంటి పక్క ఉండే అప్పల నాయుడు గారికి గేదెలు ఉండేవి.మేము అడవి ప్రాంతం లో ఉండటం వల్ల రాత్రిళ్ళు అడవి జంతువుల సంచారం బాగానే ఉండేది అక్కడ.పైగా మా ఇంటి ఎదురుగుండా పేద్ద అడవి.
అప్పుడప్పుడు చిరుత పులి వచ్చి మా పక్కింటి వాళ్ళ గేదే లని లాక్కు పోయేది అని చెప్పుకునేవారు.ఒక ఉగాది రోజు అమ్మ నాకూ అక్కకీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తను పని చేసుకుంటోంది.ఇంతలో పక్కనే ఉన్న నాయుడు గారి ఇంట్లో హడావిడి.రాత్రి చిరుత వచ్చి గేదె ని లాక్కుపోయిందిట.ఆనవాళ్ళు పట్టుకుని అలా ఇంటి ఎదురు అడవి లోకి కాస్త దూరం వెళ్ళగానే అక్కడ పడి ఉన్న గేదె కనపడింది.
నేనూ అక్కా ఇంటికి వచ్చేసరికి అమ్మ భద్ర కాళీ అవతారం ఎత్తింది.చక్కగా స్నానం చేయిస్తే వెళ్ళి అవన్నీ చూసొస్తారా అని.
మా స్కూల్లో ఒకమ్మాయి ఉండేది,పేరు గుర్తు లేదు కానీ ఎప్పుడూ ఆ అమ్మాయి పాట పాడమంటే చాలు "రాణీ రాణమ్మా" అని అందుకునేది. ఆ అమ్మాయి కి ఇద్దరు తమ్ముళ్ళుండేవారు.ఒకసారి ఆ అమ్మాయిక్లాసు కి వచ్చి మా తమ్ముడు ఇప్పుడే చచ్చిపోయి మళ్ళీ లేచాడు తెలుసా అని చెప్పింది.వాళ్ళ తమ్ముడు చచ్చి పోయి బతికాడుట అని ఒకటే హడావిడి క్లాసు అంతా. ఎలా అయ్యింది అని అడిగారెవరో.స్కూలు కి వస్తోంటే మా తమ్ముడు అలా సడెన్ గా కింద పడి చచ్చిపోయాడు(కళ్ళు తిరిగి పడిపోయాడన్నమాట).మళ్ళీ కాసేపటీకి తనంతట తానే లేచాడు అని చెప్పింది.ఈ వింత ని అమ్మ కి చెప్పాలి అని ఆ రోజు భోజనాల దగ్గర అమ్మ కి చెప్పా.ఇంతలో నాన్నగారు,అలా పడిపోవడాన్ని కళ్ళు తిరగడం అంటారు అన్నారు.నాన్న భోం చేసి లేవగానే మళ్ళీ అమ్మ కి చెప్పా,నిజమమ్మా చచ్చిపోయి బతికాడుట అని.అవతల నుండి నాన్న,చచ్చిపోవడం కాదని చెప్పానా అని ఒక్క కేక వేసారంతే.చుప్ చాప్ గా అన్నం తినేసి బయటపడ్డాను.ఏమిటో వీళ్ళు నమ్మరు అని ఓ నిట్టూర్పు కూడా విడిచానండోయ్.
నెక్స్ట్ టప్పా లో మా ఇంటి పక్కన ఉన్న ప్రభూ మామయ్య తో నా ఎక్స్ పీరియన్స్ గురించి రాస్తాను.
:):) Beautiful Memories.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteస్ఫురిత గారూ,
ReplyDeleteమీ కామెంటు నేను డిలీట్ చేసినట్లుగా ఉంది.ఎందుకలాగ?