Wednesday, May 19, 2010

...అందుకే అలా చేసా మరి




నాన్నగారి ఆఫీసు దగ్గరే అవడం వల్ల మధ్యాహ్నం భోజనం చేసి అలా ఒకసారి కునుకు తీసి వెళ్ళేవారు.ఒక రోజు నాన్నగారు పడుకున్నాకా నేను అక్క మా ఇంటి పెరడులో ఉన్న ఏదో పాదు కింద కూర్చుని మట్టి తో ఏవో చేసుకుంటున్నాము. తెలుసా, మేము హాయిగా మట్టిలో ఆడుకునేవాళ్ళము చిన్నప్పుడు.లైఫ్ బాయ్ 100% ప్రొటెక్ట్ లు కానీ సానిటైజర్ లు కానీ వాడకుండానే చేతులు కడుకున్న రోజులు గుర్తొస్తే ఒక నిట్టూర్పు విడుస్తా ఇప్పుడు.

ఓకే, మళ్ళీ మా మట్టి ముద్దల దగ్గరకి వస్తే,మా అక్క నా కంటే పెద్దది అవడం వల్ల చకచకా గిన్నెలు చేసెస్తోంది మట్టితో.నాకూ చేసిపెట్టు అన్నా.పాపం ముద్దుల చెల్లి ని కదా,చేసిచ్చింది.సరిపోలేదు నాకు,ఇంకా చెయ్యి అన్నాను,ఆగు అని తనకి చేసుకోవడం మొదలెట్టింది.నాకు చిర్రెత్తుకొచ్చి కసుక్కున కాలు మీద కొరికేసా :) :)

పాపం బాధ తట్టుకోలేక రాగం అందుకోగానే నాకు భయం వేసింది,అంతే దాని నోరు గట్టిగా నొక్కేసా అరవకు అని.పాపం,పిచ్చి మొద్దు కనీసం ఫైట్ చెయ్యకుండా నొప్పి అలా భరించింది.ఇంతలో నాన్న నిద్ర లేచారు.నాకు ఇక టెన్షన్ మొదలు.ఎక్కడ చెప్పెస్తుందో అని ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా.పాపం నాన్నగారికి చెప్పలేదు.నాన్న వెళ్ళాకా అమ్మ చూసీంది అక్క కాలు మీద కమిలిపోయిన నల్లటి మచ్చ.ఏమయింది అని అడిగింది.మొదట అసలు విషయం చెప్పలేదు. కాస్త కోపం గా అడిగేసరికి చెప్పింది మెల్లిగా.ఇక చూసుకోండి అమ్మ లాంగ్ స్కేలు ఒకటి చేత పుచ్చుకుని నా వెనక పడింది.నేను దొరుకుతానా,ఇంటి పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు చుట్టూ పరుగులు.అమ్మ కి విసుగొచ్చి స్కేలు విసిరేసి అక్కని డాక్టర్ బాబూ రావు గారి దగ్గరకి తీసుకెళ్ళింది.

ఆ గాటూ చూస్తూనే ఆయన ఏ జంతువో కరిచుంటుంది అనుకుని ఏమి కరిచింది అని అడిగారు.

అమ్మ నసుగుతూ మా చిన్నది కొరికిందండీ అని చెప్పింది.దానిని ఒకసారి సాయంత్రం మా ఇంటికి పంపండి అని చెప్పి అక్కకి మందులిచ్చి పంపేసారు.

అమ్మ ఇంటికొచ్చి విషయం చెప్పగానే ఇక నాకు దడ మొదలు డాక్టర్ గారు తిడతారని.పోనీ వెళ్లకుండా ఉందామ అంటే,డాక్టర్ గారు చెప్పాకా వెళ్ళకపోతే ఎలాగ అనే భయం.మొత్తనికి సాయంత్రం వాళ్ళింటి దగ్గర షటిల్ కోర్టు కి వెళ్ళా.

డాక్టర్ గారిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి.అమ్మ నన్ను బాగా కొట్టమని ఈయనకి చెప్పి ఉంటుంది అని మనసులో కాసేపు అమ్మ ని తిట్టుకున్నా.అమ్మో ఈయన నన్ను కోడితే,తిడితే ఇలా ఎన్ని ఆలోచనలో.వేరే వాళ్ళు తమ పిల్లల్ని కొడితే అమ్మ నాన్న చూస్తూ ఊరుకోరు అన్న ఙానం లేదు కదా అప్పట్లో.

మొత్తానికి డాక్టర్ గారు నాలుగు చివాట్లు పెట్టి,మానవ దంత గాయం ఎంత విషమో అనే పాఠం చెప్పేసారు.ఈ పాఠానికి ఆకర్షితులయిన అక్కడ ఆడుకునే పిల్లలు కూడా చుట్టూ చేరడం వల్ల అందరికీ మా అక్క ని కొరికినది(కరిచింది) ఎవరో తెలిసిపోయింది.నాన్నగారు తన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి ఆ రాత్రి నాకు,అది వేరే విషయం.

సో మా అక్కని "అది" కరిచిందన్నమాట.

9 comments:

  1. మీ అక్కని మీరే కరిచి, మమ్మల్ని దారి మళ్ళించడానికి ఏవేవో కథలు చెప్పి ఇన్నాళ్ళూ suspense లో పెడతారా. కానీ ఈ మళుపు ఎవరూ వూహించి వుండరండీ.

    మీ అక్కని తల్చుకుంటేనే జాలేస్తోంది, మిమ్మల్ని ఎలా భరించారో పాపం. ఇంకా మీరు చేసిన ఘనకార్యాలన్నీ రాసేయ్యండి మరి మీ మెంతిబద్దల్లా వూరికే వూరించకుండా...

    ReplyDelete
  2. కుక్క కరిచింది అనుకున్నామే :)
    మంచిఫోటో పెట్టి క్లారిటీ ఇచ్చారు
    మీ టపా చాలా బావుంది

    ReplyDelete
  3. charlie bit my finger :
    http://www.youtube.com/watch?v=_OBlgSz8sSM

    ReplyDelete
  4. మీ టపా చాలా బావుంది!

    ReplyDelete
  5. బాగుందండీ మీ అల్లరి :)
    మీ బ్లాగు లే అవుట్ లో 'ఆర్కైవ్' కూడా చేర్చండి. పాత టపాలు చూడడానికి వీలుగా ఉంటుంది.

    ReplyDelete
  6. హమ్మో మా చెల్లి ఇలాంటిది కాదు, లేకుంటే నేను అయిపోయి ఉండేదాన్ని. కరిస్తే కరిచారుగానీ మరీ కండ ఊడబెరికేలా కరిస్తే ఎలాగండీ...పాపం మీ అక్క :)

    ReplyDelete
  7. హ హ..బాగా నవ్వించారు..మీ టపాలు అని టపాయించాను...చాలా బాగా రాస్తున్నారు..మీ తదుపరి టపా కోసం వేయికన్నులతో వెయిటింగ్ :-)

    ReplyDelete
  8. ఇంతకీ మెంతి బద్దలు ఎలా చేస్తారండి ??..ఎపుడూ వినలేదు :-(

    ReplyDelete
  9. స్ఫురిత ,
    మా అక్క ని నేను ఎంత ఏడిపించానో పాపం.సందర్భం వచ్చినప్పుడల్లా రాస్తుంటా.

    హరె క్రిష్ణ,బద్రి,పద్మప్రీత
    :)
    సాయి ప్రవీణ్,
    ధన్యవాదండీ..ఆర్కైవ్ చేర్చాను

    సౌమ్య,
    హహహా...నవ్వొచ్చింది మీ కామెంటు చూడగానే

    @కిషన్ రెడ్డి,
    ధన్యవాదాలండీ..మెంతి బద్దలు మామిడీ కాయతో చేస్తారు,మామిడి కాయలు వచ్చిన కొత్తలో ఎక్కువగా చేస్తారు.చెక్కు తీసి ముక్కలు తరిగి మెంతి పొడి,కారం ఉప్పు వేసి దానిలో మామిడి ముక్కలని ఊరబెట్టడమే.కరక్ట్ ప్రొసీజర్ కోసం గూగుల్ చూడండి.చాలా టేస్టీ గా ఉంటాయి ఈ మెంతిబద్దలు

    ReplyDelete