Thursday, January 13, 2011

ప్ప్చ్చ్హ్..అనుకుని ఏమి లాభం

మొన్ననే ఇంటి నుండి వచ్చాను. ఈ సారి ట్రిప్ లో నాన్నగారి అనారోగ్యం వల్ల అందరినీ కలవలేకపోయాను.

అలా కలవలేకపోయిన వాళ్ళల్లో అమ్మ మేనమామలు కూడా ఉన్నారు. అవడానికి అమ్మ మేనమామలు అయినా కానీ మాకు చిన్నపటినుండీ బాగా అలవాటు బామ్మలు ,తాతయ్యలుగా. అమ్మ పుట్టింటివారంటే మొదట గుర్తొచ్చేది వాళ్ళే మాకు. అంత అలవాటు.

పాపం ఎంత అభిమానం చూపించేవారో మేమంటే.విద్యుత్ శాఖ లో లైన్మెన్ గా పని చేసే ఇద్దరు తాతయ్యలు,నర్సరీ చూసుకునే ఇంకో తాతయ్య మేమంటే అభిమానం కురిపించేవాళ్ళు,మా "లలిత" కూతుళ్ళని కనపడ్డవాళ్ళకి చెప్తూ అలా సైకిలు మీద తిప్పేవారు.

పాపం చిన్న ఉద్యోగం,పెద్ద సంసారమయినా కానీ మేమెళ్తే మాత్రం ఆ లోటు కనపడనిచ్చేవాళ్ళు కాదు. పాపం ఈ పిల్లలు కూరా,పప్పు లేనిదే తినలేరంటూ వాళ్ళకి వీలయినంతలోనే అన్నీ అమర్చేవారు.చిన్నప్పుడు ఈ ఉద్యోగ అంతరాలు,సమస్యలు అవీ తెలీవు కదా. నాన్నగారి లాగే వీళ్ళూ ఉద్యోగం చేస్తున్నా కానీ వీళ్ళింట్లో మన లాగ అన్నీ ఉండవెందుకో అనిపించేది.మేమెళ్తే తప్పనిసరిగా మాకిష్టమని కరకజ్జం తెప్పించేవారు.


మధ్యాహ్నం భోజనం లోకి మామిడిపళ్ళు,భోజనమయ్యాకా పుల్ల ఐసు ఫ్రూటు,నాలుగింటి వేళ వేడి వేడి జిలేబీ,పార్కుకెళ్తే పిడత కింది పప్పు ఉండాల్సిందే.

ఇదే మెనూ ఎన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా సాగిందో చెప్పలేను.భోజనాల వేళయ్యేసరికి రూప బామ్మో,శేషు బామ్మో ప్రత్యేకం గా పట్టించిన పప్పు నూనే వేసి కలిపే కొత్తావకయి,మాగాయ రుచి ఇంకా గుర్తే ఇప్పటికీ.

రాత్రయ్యేసరికి ఆరు బయట మంచాలేసుకునేటప్పుడు చిన్న మడత మంచం కోసం పిల్లల పోట్లాట, రోజుకొకళ్ళు చొప్పున పడుకునేటట్లు దక్షుడు తాతయ్య తీర్పు చెప్పడం, మరునాడు పొద్దున్నే అమ్మమ్మ కొట్టే నీళ్ళ బోరింగు శబ్దానికి విసుక్కుంటూ నిద్ర లేచి తయారయ్యి అరుగు మీద అష్టా చెమ్మాలు ఆడుకోవడం, మధ్య మధ్యలో బొమ్మరిల్లో,బాలజ్యోతో చదువుకోవడం ఎలా మర్చిపోతాము ఆ బాల్య మధుర స్మృతులన్నీ.

మెల్లిగా పిల్లలందరమూ పెద్దవాళ్ళయ్యి చదువులతో బిజీ అయ్యాము.ఆ తరువాత ఉద్యోగాల బిజీ,ఆ తరువాత పెళ్ళిళ్ళు,సంసారాలలో పడి అందరమూ ఒకసారి కలవడమే అవ్వలేదసలు. అమ్మ వాళ్ళూరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ తాతయ్యలని తప్పక కలుస్తాను. ఈ సారి అమ్మ వాళ్ళ ఊరూ వెళ్ళలేదు,వాళ్ళనీ కలవలేదు.

ఓ నాలుగు రోజుల క్రితం అమ్మ చెప్పింది రాజు తాతయ్య ని హాస్పిటల్లో జాయిన్ చేసారని. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోను చేసాను. నేనేదో పని మీద ఊరికి వెళ్తున్నా,రాత్రికి చెయ్యి,అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేసారు కంగారు ఏమీలేదు అన్నాడు. ఆరోజు రాత్రి చేద్దామనిపించి కూడా చెయ్యలేదు.ఆ,ఇంకా రెండు రోజులలో సంక్రాంతి ఉంది కదా,అప్పుడు మాట్లాడచ్చులే అని.


ఈరోజు పొద్దున్నే అమ్మకి చేస్తే తెలిసింది రాజు తాతయ్య ఇక లేడని. దుఖం ఆగలేదు నాకు. చిన్ననాటి ఙాపకాలన్నీ అలా కళ్ళముందు కదలాడాయి. ఛా! మొన్నే ఫోను చేసుంటే ఎంత బాగుండేది ఒక్కసారి మాట్లాడేదానిని అని ఎన్ని సార్లనిపించిందో. తాతయ్యది చిన్న వయసు కాదు,ఇదంతా జీవిత చక్రం లో భాగమే..కానీ మనసు అలా భారం గానే ఉంది పొద్దున నుండీ.


బయటకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సు నచ్చితే ఠక్కున కొనుక్కుంటాము. అదే ఒక్క ఫోను చెయ్యడానికి ఒకోసారి ఆలోచిస్తాము,ఆ రేపో ఎల్లుండో చెయ్యచ్చులే అని.

అప్పటివరకు ఈ పండుటాకులు ఉండొద్దూ. ఈరోజే ఒక పాఠం నేర్చుకున్నా నేను.వారానికి ఒకసారయినా తాతయ్యలు, అమ్మమ్మలని పలకరించాలని.కనీసం అప్పుడయినా అయ్యో మాట్లాడలేకపోయానే అన్న బాధ నుండయినా ఉపశమనం.

(మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న మా "రాజు" తాతయ్య కోసం ఈ టపా.)

4 comments:

  1. ఇలాంటి విషయాలలో తాత్సారాలు చెయ్యకూడదండీ..!! ఏది ఎమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు....!!

    ReplyDelete
  2. అవునండీ, మనలో చాలా మందిమి ఇలాగే ఆలోచిస్తాం! ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ మనుషులు దూరమై మరిక కనపడరని తల్చుకున్నపుడు చెప్పలేని దుఃఖం కల్గుతుంది. ఎంత పశ్చాత్తప పడినా లాభం లేదు. మీ బాధ అర్థమవుతోంది. మీరు తీసుకున్న నిర్ణయం బాగుంది. మర్చిపోకుండా ఫోన్లు చేస్తారని ఆశిస్తున్నాను

    ReplyDelete
  3. అమ్మ, నాన్న కు మేనమామలూ, పెళ్ళయ్యాక మా అత్తయ్యగారి మేనమామలూ ,పిన్నమ్మలూ కూడా నాకు అత్యంత ప్రియమైన వారు .అలాగని ఫోను చేసే వీలు లేదు :)
    ఈ టపా ద్వార మీ దుఃఖము కొంత ఉప్సమించింది అని తలుస్తాను ,చాల మంచి నిర్ణయం ..నెలకొక్క సారయినా ప్రయత్నించండి

    ReplyDelete
  4. అనానిమస్ గారూ,
    ధన్య వాదాలు

    సుజాత గారూ,

    అవెనండీ ఎంత భారంగా ఉందో మనసు గత వారం నుండీ..ఇప్పుడే తేరుకుంటున్నాను కాస్త

    మౌళి గారూ,

    మీ వ్యాఖ్య లో "అలాగని ఫోను చేసే వీలు లేదు :)" ఈ వ్యాఖ్య అర్ధం కాలేదు.

    పోయిన వారం బామ్మ,అమ్మమ్మ తో మాట్ళాడాను. ఈ అలవాటు కంటిన్యూ చెద్దామని ప్రయత్నం.మీ తాతయ్య కల బ్లాగుంది :)

    ReplyDelete