Tuesday, August 11, 2015

అత్తగారి కధలు-2

1)కొంతమంది అత్తగార్లకి అదోరకం అలవాటనాలో వంకర బుద్ధి అనాలో. కోడలు పిల్లకి ఫలానా పదార్ధం ఇష్టం ఉండదు, అత్తగారికి అది బాగా ఇష్టం అనుకోండి,ఆ ఇష్టాన్ని గౌరవిస్తున్నట్లే ఉంటారు కానీ వీలయినప్పుడల్లా దానిని తినకపోవడం వల్ల కోడలు ఎంత నష్టపోతోందో సన్నాయి నొక్కుల్లా నొక్కుతూనే ఉంటారు. ఇంకాస్త ముందుకెళ్ళి అసలు ఆ కూర ని ఎన్ని రకాలుగా వండచ్చో(కొడుకు లేనప్పుడే) ఏకరువుపెడతారు. ఇది వినీ వినీ కోడలికి రక్తం మరిగిపోయినా పాపం ఏమీ చెయ్యలేదు ఓ వెర్రి నవ్వు నవ్వడం లేదా మనసులో మీరు తినని పండు మీకు పెట్టాలి ఈసారి అని కసిగా అనుకోవడం తప్ప.
2)కోడలితో అమ్మా, తల్లీ అని ప్రేమతో మాట్లాడుతున్నట్లే ఉంటారు, ఆర్ధిక వ్యవహారాల్లన్నీ మాత్రం కొడుకుతో "Behind the closed doors" .
3)చాలా మంది అత్తగార్లకి మనవడు కావాలని ఉంటుంది. స్మార్ట్ ఫోను టైపు అత్తగారు ఆ మాట పైకి చెప్పరు, పాత నోకియా ఫోను టైపు అత్తగారు మాత్రం సూర్యకాంతం లా నోరేసుకు పడిపోయి ఆర్డరిచ్చెస్తుంది మనవడే కావాలి అని. ఇప్పటి అత్తగార్లందరూ దాదాపు స్మార్టు ఫోను టైపే.పైకి చెప్పరు లోపల మనవడే కావాలి అన్న కోరిక ఉన్నా కానీ. ఈ కాలం లో ఒక్క పిల్లో పిల్లాడో పుడితే ఫులుస్టాప్ పెట్టెస్తున్నారు, పుట్టబోయేది ఆడపిల్లయితేనో అన్న బాధ లోపల ఉన్నా ఆ ఎవరయితే ఏమిటి లెండి అంటూ బయటవాళ్ళ దగ్గర నటించేటప్పుడు చూసి తీరాల్సిన ద్రుశ్యం.ఆ తొమ్మిది నెలల్లో బయట వాళ్ళతో కాకపోయినా కోడలిపిల్లకి మాత్రం అప్పుడప్పుడు హింట్ ఇస్తూనే ఉంటారు, ఆడపిల్లయితే రెండో సంతానానికి ట్రై చెయ్యాలి అని.

వీరికి మనవడు పుడితే ఇంక వీరి ఆదర్శలు వినడానికి మన చెవులు సరిపోవు. ఎవరైన ఒకటే అండీ మాకు, ఆడపిల్లయినా ఇలాగే సంతోషంగా ఉండేవాళ్ళం అని పక్కవాళ్ళతో అంటోంటే విన్న కోడలికి ఒళ్ళు మండదూ?? తమ మనవడు మనవరాలు అందంగాఉంటే మాత్రం వాళ్ళ పోలిక. ఏ మాత్రం కాస్త నలుపైనా లేదా జుట్టు పలచగా ఉన్నా కోడలి వైపు పోలికలే అవన్నీ. కోడలి అమ్మా నాన్నా, సోదర సోదరులెవ్వరికీ అలాంటి జుట్టో. రంగో లేదనుకోండి. కోడలి బామ్మకో అమ్మమ్మకో లంకె పెడతారు అదిగో ఆవిడ పోలికే అంటూ.. హూ..

4)ఇంకొంతమంది అత్తగార్లుంటారు. ఏదయినా వస్తువు నచ్చితే ఇది బాగుంది బాగుంది అని ఓ 3-4 సార్లంటారు. సరే అత్తయ్యా, తీసుకెళ్ళండి అంటే మాత్రం అబ్బే నాకెందుకు వద్దు అంటారు. ఓ నాలుగైదు సార్లు బ్రతిమాలితే కానీ తీసుకోరు. ఏదో పెళ్లయిన కొత్తలో అంటే సరే లే కోడలేమనుకుంటుందో అన్న మొహమాటమనుకోవచ్చు. పెళ్ళయ్యి పుష్కరమయినా ఇంకా అలా సాగించుకోవాలని చూస్తే...

5)అత్తయ్యగారూ కొత్త ఉద్యోగం లో చేరాను అని చెప్పగానే వచ్చే ప్రశ్నలు మాకు తెలుసు. "జీతం పెరిగిందా మరి, వాడి కంటే ఎక్కువా ఇప్పుడు లేదా అదేంటీ ఇంకా అంతేనా నీ జీతం?? ".. ఈ ప్రశ్నలు వినగానే ఫోను విసిరికొట్టెయ్యాలన్నంత కోపం వస్తుంది.

6)తాము తమ అత్తింటివారిని ఆదరించామా అని కూడా ఆలోచించకుండా గతమెంతో ఘనం అన్నట్లు తమ కోడలికి మాత్రం అత్తగారినీ, మరిదినీ, ఆడపడచునీ ఎలా నెత్తినపెట్టుకోవాలో చెప్తారు.మామగారు ఓ చిన్న మాట మాట్లాడితే గదిమి కూర్చోబెట్టే అత్తగారు కొడుకు దగ్గరికొచ్చేసరికి మాత్రం కొడుకే రైటు కోడలికేమీ తెలీదు. ఇది చూసే బాపూ గారు ఓ ఛలోక్తి విసిరారనుకుంటా... "మా అల్లుడు చక్కగా అమ్మాయి చెప్పిన మాట వింటాడండీ, కొడుకే, పనికిమాలిన వెధవాయి లాగ కోడలి కొంగు పట్టుకు తిరుగుతాడు" అంటూ .

ఎలాంటి సన్నాయి నొక్కులూ లేకుండా నిజం గా కోడలిని సొంత కూతురిలా చూసుకునే అత్తగార్లూ మీకు నమో నమహ. కాస్త మీ మంచితనాన్ని సమాజం లో ఓ ముగ్గురు అత్తగార్లకి అంటించండి తల్లులూ మీకు పుణ్యం ఉంటుంది.