Tuesday, May 1, 2012

అత్తగారి కధలు-1

ఈ మధ్యనే తెలిసింది నాకు, ఎప్పుడూ బోరు కొట్టని టాపిక్, ప్రతీ రోజూ తాజా గా ఉండే టాపిక్కే "అత్తగారి కబుర్లు" అని.
అలా అంటే భానుమతి గారి అత్తగారి కధలలాంటిదేదో అనుకునేరు. కాదు. నేను చెప్పేది మా ఆఫీసు లో పనిచేసే అమ్మాయిల అత్తగార్ల కబుర్లు. ఒప్పుకోరు కానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అత్తగార్ల సన్నాయి నొక్కులు చెప్పుకోవడం.

సన్నాయంటే గుర్తొచ్చింది,అసలు ఈ అత్తగార్లున్నారే, వీరికి ఆ సన్నాయి నొక్కులు నొక్కడం ఎలా వస్తుందా అని ఆలోచించా. వాళ్లబ్బాయి పెళ్ళయ్యకా ఇంటికి కోడలితో పాటు బ్యాండు మేళం వారి సన్నాయి తనతో కూడా తెచ్చేసుకుంటారు అని తీర్మానించేసుకున్నాను.

ఇంతకుముందు టపాలో చెప్పా కదా మా జనని గురించి. తనొచ్చాకా వెంట వెంటనే ఇంకో నలుగురమ్మాయిలు వచ్చారు. అందరం పెళ్ళయ్యి పిల్లలున్న అమ్మాయిలమే(అబ్బాయిలూ కోపం గా చూడకండీ, అదే ఆంటీలమే). కొద్ది రోజుల్లోనే అందరి ఫ్రీక్వెన్సీ కలిసిపోయింది. ఇంకేముంది మెల్లిగా పర్సనల్ విషయాలు చెప్పుకోవడం దాకా వెళ్లింది చనువు. మొట్ఠమొదట గుర్తొచ్చేది భర్త గారి టీవీ వ్యసనం,పిల్లలు, చదువులు చివారాఖరికి అత్తగార్లు.

అందరి భర్తలూ ఇంతే టీవీ కంప్యూటర్ వదల్రు ఇంటికి వస్తే అని తీర్మానించేసుకుని ఛీ వీళ్లింతే మారరు, పోనీలే మరే ఇతర దురలవాట్లూ లేవు, ఎమర్జెన్సీ లో సాయం చేస్తారు కదా అని అడ్జస్టయిపోతాము. అబ్భా ఏమి చదువులో ఏంటో అని నిట్టూర్చెస్తాము. ఇక అత్తగారి టాపిక్కొచ్చేసరికి మాత్రం నో కాంప్రమైజు.

లంచ్ టైము గంట అయితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది మాకు. ప్రస్తుతం ఎవరి అత్తగారు ఇంట్లో ఉంటే వాళ్ళే లంచ్ టైమంతా తమకే కేటాయించేసుకుంటారు, ఎవ్వరినీ మాట్లాడనీయకుండా. మేము కూడా చెవులు రిక్కించేసి కుతూహలం తో వింటూ ఉంటాము చెప్ప్పే అమ్మాయి అత్తగారి సన్నాయి నొక్కులు, ఆ అత్తగారు మరీ కఠినాత్ములయితే ఆవిడ గారి విసుర్లు తను చెప్తోంటే జాలిగా విని మాకు తోచిన సలహాలిచ్చెస్తుంటాము ఇక ఎప్పుడైనా మరీ అత్తగారి సాధింపు ఎక్కువయ్యి ఆ అమ్మాయి ఏడిస్తే నాలుగు మంచి మాటలు చెప్పి జోకులేసి నవ్విచ్చెస్తుంటాము. రకరకాల అత్తగార్ల గురించి విని నాకు అత్తగార్లు రెండు రకాలని అర్ధమయ్యింది.

1)స్మార్ట్ ఫోను టైపు అత్తగారు-ఈవిడ మన ఐఫోను లేదా ఇతర స్మార్ట్ ఫోను లాంటిదన్నమాట. సమాచారమంతా నిక్షిప్తమయ్యి ఉంటుంది.ఈ టన్నుల కొద్దీ సమాచారాన్ని శోధించడం బహు కష్టం. అంటే ఈవిడ అసలు తన మనసులో ఏముందో చెప్పరు. వీళ్లకి తగ్గట్టు నడచుకోవడం చాలా కష్టం.

2)పాత నోకియా ఫోను టైపు అత్తగారు-పాత నోకియా ఫోన్లు చూడండి, ఒక్క మెసేజీ రాగానే టుటు ట్టు ట్టూడూ ట్టు ట్టు ట్టూ అని మెసేజీ చూసే వరకు తెగ అరిచేవి.(ఇప్పటి స్మార్ట్ ఫోనుల్లాగా ఒక్కసారే అరు, అసలు అరవకు లాంటి ఆప్షన్స్ లేవు ఈ ఫోనులో) ఇలాంటి అత్తగార్లు చిన్న విషయం మీదే పెద్ద నోరేసుకుని అరిచేసి బయట వాళ్ళకి లోకువయిపోయుంటారు.
వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా వీజీ.

ఎప్పుడైనా ఆఫీసులో తీరిక దొరికితే గూగుల్లో వెతికేసి అత్తగారి జోకులూ అవీ ఫార్వార్డ్ చేసుకుంటూ ఉంటాము. ఈ వెతుకుడు లో ఇంకో విషయం తెలిసింది నాకు. పడమర దేశాల్లో అత్తగారి మీద జోకులు ఎక్కువగా అబ్బాయిలు వేసుకుంటూ ఉంటారని. మన దేశం లో లాగ కోడళ్ళని సతాయించడం తక్కువే అని.