Saturday, September 24, 2011

వంటల కాన్ఫిడెన్సు

ఇప్పటికే ఓ రెండు మూడు వంటల టపాలు రాసావుగా మరలా ఇదేనా అనకండి. ఏమి చెయ్యమంటారూ, ఆ మధ్య క్రిష్ణప్రియగారి అమ్మో ఏమి రుచి టపాతో నా ఙాపకాలని తట్టిలేపారు. రాద్దాము రాద్దాము అనుకుంటూ బద్ధకించాను కానీ గత నెలరోజులనుండీ మా "జనని" పెడుతోన్న టార్చర్ భరిస్తూ ఆ బాధ కాస్త మీకూ పంచుదామని.

ముందు "లావణ్య" అనే ఆవిడ ఇంటికి పిలిస్తే ఆవిడ అతిధులు ఎలా గడగడలాడుతున్నారో చెప్తాను.

ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా కేవలం పిల్లల ప్లేగ్రవుండు లో హాయ్ బాయ్ పరిచయం ఉన్న ఒకావిడ వాళ్ళబ్బాయి పుట్టినరోజు పార్టీ కి పిలిచింది.ఆవిడతో నేను గట్టిగా ఓ గంట మాట్లాడింది లేదు పార్టీ కి ఎలా వెళ్ళను అని ఆలోచిస్తుండగా నా మనసు చదివేసినట్టు ఆవిడేమో " ఇలా కలిస్తేనే పరిచయాలు పెరుగుతాయండీ,ఓ పది మందిని పిలిచానంతే, రండి ప్లీజ్" అంది.డిన్నర్ మా ఇంట్లోనే అని కూడా చెప్పింది

సరే వస్తాను అన్నాను.ఆరోజు రానే వచ్చింది. ఆవిడ ఆరోజు పొద్దున్నే ఫోను చేసి మరీ ఇంకోసారి పిలిచింది.. ఇక తప్పేట్టులేదని తయారయ్యి దగ్గర్లో ఉన్న మాల్ కి వెళ్ళి ఓ బొమ్మ కొని నేనూ మా అబ్బాయి బయలుదేరాము.

ఓ పాతిక ముప్పై మంది పెద్దవాళ్ళూ పదిహేను మంది దాకా పిల్లలూ ఉన్నారు.

కేక్ కటింగూ అవీ అయ్యి భోజనాల అంకం మొదలయ్యింది.ప్లేటు పట్టుకుని బయలుదేరాను.ఆలూ కూర,బిర్యాని(లాంటిది),సేమ్యా పాయాసం,ఇంకో కూర ఏదో,సాంబారు,పెరుగు,గులాబ్ జాం.మెనూ చూడగానే వాహ్ అనిపించింది.


అన్నీ ప్లేటులో వడ్దించుకుని ఆలూ కూర కలిపి నోటిలో పెట్టుకోగానే ఏదో తేడా అనిపించింది.పక్కన పెట్టి బిర్యాని తినడం మొదలెట్టాను.పచ్చి బియ్యం పులావు అని ఏ వంటల కార్యక్రమంలో అయినా చూపిస్తే ఈవిడ కానీ చూసి చేసిందా ఏమిటీ అనిపించింది గాట్ఠిగా ఉన్న ఆ అన్నాన్ని నములుతోంటే.

సాంబారు ది కూడా ఆలూ కూర పరిస్థితే.అన్నీ అలా కెలికి పెరుగు వేసుకుందామని వెళ్ళేసరికి అది ఖాళీ.

అయ్యో పెరుగు అయిపోయిందా, ఏమండీ కాస్త పెరుగు తీసుకురండి అని వాళ్ళాయనకి చెప్పబోతోంటే కరుణామయులెవరో ఆ,ఇప్పుడేమి వెళ్తారు ఫరవాలేదు లెండి అనేసరికి పురుషులతో బాతాఖానీ లో మునిగిపోయిన వాళ్ళాయన మొహంలో రిలీఫ్.

అయిపోయాను,ఆపద్బాంధవి అనుకున్న పెరుగు లేదు. చేసేది లేక గబగబా చేతులు కడిగేసుకుని గులాబ్ జాం బౌల్ లో పెట్టేసుకున్నాను.

ఇంతలో ఎవరో అడిగారు,ఇన్ని వెరైటీస్ ఒక్కదానివే ఎలా చేసావు లావణ్యా అంటూ. పొద్దున్న్నే పిల్లలు వెళ్ళగానే మొదలెట్టేసాను,పన్నెండింటికి వాళ్ళొచ్చేలోపు అంతా పూర్తి చేసేసా అని విజయ గర్వంతో చెప్పింది లావణ్య.

టైము చూసాను, రాత్రి 9,అంటే దాదాపు 10 గంటలు ఇవన్నీ వండి.పైగా గత వారం నుండీ ఎండ దంచెస్తోంది పగటిపూట. కనీసం ఫ్రిజ్ లో పెట్టినా బాగుండేవేమో.

అంతే..అప్పుడే నాకు ఇంకా కేక్ కావాలి అని నేను ఒప్పుకుంటానో లేదో అని సందేహం గా అడిగిన మా అబ్బాయి ప్లేటులో దగ్గరుండి ఇంకో రెండు ముక్కలు పెట్టాను.

వాడికి అర్ధం కాలేదు అమ్మ ఇంత మంచిదయిపోయింది ఏమిటీ సడెన్ గా అని.

కాసేపటికి లావణ్య వచ్చి మీ అబ్బాయికి అన్నం పెట్టరా అంది.కేక్ తిన్నాడు కదా ఇంక అన్నం తినలేడు అని చెప్పను.

పిల్లలు మనము అబద్ధమాడినప్పుడే సడెన్ గా మంచివాళ్ళయిపోతారు కదా.

అమ్మా,నాకు ఆకలేస్తోంది అని వాడు అనగానే ఓ సీరియస్ చూపు విసిరాను(మా అబ్బాయి నా చూపుల్లో తేడా గుర్తించేస్తాడు లెండి)

లేదండీ,వాడు ఎక్కువసేపు ఉండటానికి ఈ వేషాలన్నీ,అనవసరం గా ఫుడ్ వేస్ట్ తప్ప తినడండీ అని ఇంకో అబద్ధం ఆడేసాను.

అయ్యో ఆకలేస్తుందేమో కాస్త బాక్స్ లో పెట్టిస్తా ఆగండి అని,పచ్చి బియ్యం పులావు,ఆలూ కూర,సాంబారు ఓ మూడు డబ్బాలలో సర్ది రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఇచ్చింది. రిటర్న్ గిఫ్ట్ మాత్రమే మాతో పాటు ఇంటికి వచ్చింది అని వేరే చెప్పక్కర్లేదు కదా.

ఎప్పుడో పొద్దుననగా చేసిన వంటలని సాయంత్రం అతిధులకి ఏ చీకూ చింతా లేకుండా వడ్దించడానికి ఎన్ని గుండెలుండాలి

అంతే, ఆ దెబ్బకి ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే వంకలు వెతుక్కుంటున్నారు ఆనాటి అతిధులు.


ఇంక మా "జనని" సంగతి చూద్దాము. "జనని" అనగా మా మాత్రుమూర్తి అనుకుంటారేమో. కాదు,నా అరవ కొలీగ్.

జనని ఈ మధ్యే నేను పనిచేసే ఆఫీసులో నా టీంలోనే జాయిన్ అయ్యింది.ఇంతకుముందు కూడా ఇద్దరమూ కలిసి పనిచేసాము కానీ అప్పుడు పెద్ద పరిచయం లేదు.

నెల క్రితం తను మా టీం లోకి వస్తోంది అని తెలిసింది. నేను తప్ప ఆడ పురుగు లేని మా టీం లోకి తను వస్తోందంటే సంతోషమేసింది.

అంతా బాగానే ఉంది తనతో రోజులో ఆ పది నిమిషాలూ తప్ప. అదేనండీ మేము భోజనం చేసే సమయం తప్ప.

ఇంతకుముందటి ఆఫీసులో ఓ గంట మినిమం లంచేవాళ్ళము,ఇక్కద పెద్ద గ్రూపూ లేదు,ఉన్న ఇద్దరమే ఏమి చేస్తాము అనే కారణం కంటే మా జనని కి భయపడి పది నిమిషాల్లోపే డబ్బా మూసెస్తున్నాను.

జనని తమిళమ్మాయి అని చెప్పాను కదా. కానీ బొంబాయిలో పెరిగింది.అందుకని కాస్త అరవ వాసన తక్కువే తన వేష,భాష, వంటల్లో.

ఓ సారి మాటల్లో తాను ఓ 70 మందికి వండటం అలవోకగా చేసెస్తా అంది.అయ్యబాబోయ్ అనుకున్నాను.చైనీస్,నార్త్ ఇండియన్ అన్ని రకాలు చేసెస్తా అనంటే అబ్బురమనిపించింది.చాలా కాలం క్రితం నేను ఉద్యోగం కోసం ప్రయత్నించి ఏమీ అవకాశాలు రానప్పుడు అసలు నేనే చిన్న ఫుడ్ సెంటర్ పెట్టుకోవడమో పార్టీ లకి ఆర్డర్లు తీసుకోవడమో చేద్దాము ఈ ఉద్యోగం సజ్జొగం వద్దు అనిపించింది అన్నప్పుడు వాహ్,ఎంత మంచి వంటగత్తె, నాకూ తన రకరకాల వంటలు తినే భాగ్యం అన్నమాట అనుకున్నాను.


మెల్లిగా ఓ వారం గడిచింది.కాస్త మా ఇద్దరి పరిచయమూ బలపడింది.కలిసే భోజనం చేసేవాళ్ళము.అక్కడ మొదలయ్యింది నా తంటా.

తన బాక్సులో మంచూరియా,పావ్ భాజీ లాంటి రకాలుండేవి.లేదా కాస్త టైము పట్టే కూరలైన పాలక్ పనీరు,వంకాయ కారం పెట్టిన కూర లాంటివి. పొద్దున్నే ఇవన్నీ చేస్తున్నావంటే సూపర్ అన్నాను.

పిచ్చా,ఏమన్నా పొద్దున్నే ఇవన్నీ చెయ్యడానికి?మా పిల్లలు ఎనిమిదింటికల్లా వెళ్ళాలి,నేను బయలుదేరాలి ఎలా కుదురుతుంది? నేను రాత్రి డిన్నర్ కోసం వండీన వాటిని మైక్రోవేవ్ లో పెట్టి తెచ్చుకుంటాను అనగానే షాక్ నేను.

తన మానాన తను తెచ్చుకుని తింటే అసలు ఈ టపా ఎందుకు ఉండేది?తెచ్చినవన్నీ బలవంతం గా నా బాక్స్ లో వేసేసేది. మంచూరియా అయితే దారుణం. మైదా ముద్దని గ్రేవీ లో ముంచుతిన్నట్టుంది.పాలక్ పనీర్ సూపర్ గా ఏమీ లేదు.జస్ట్ ఓకే అంతే.

వార్నీ, ఇలా అసలు రుచుల్ని మార్చేసేట్లయితే నేను లెబనీస్,కొరియన్,థాయ్ కూడా వండెయ్యగలను అనిపించింది.

నిన్న శుక్రవారం హాయిగా నా మామిడికాయపప్పు ఆస్వాదిస్తోంటే ఖావో యార్ అంటూ అదేదో కడాయ్ వెజ్ కూర ట గుమ్మరించేసింది పక్కన.

వద్దు అని ఎన్ని సార్లని చెప్తాము చెప్పండి?వద్దంటే "అరే, తుం కుచ్ నహీ ఖాతీ హో" అని అతి చనువుతో నాకు పెట్టెస్తుంది.

అందరికీ వండి పెట్టాలి,తన కలినరీ స్కిల్స్ అందరూ గుర్తించాలి అనే యావ ఎక్కువ మా జనని కి.

అసలు నాకు తనలో నచ్చేది ఆ కాన్ఫిడెన్సు. చాలా గొప్పగా అన్ని వండెయ్యగలనూ అని చెప్పుకుంటుంది, వండి ధైర్యం గా బయట వాళ్ళకి పెడుతుంది కూడా.

ఏ మాటకామాటే చెపుకోవాలి, మా జనని పులావ్ బాగా వండుతుంది. కాకపోతే అది ముందు రోజు తను ఇంటికెళ్ళాకా చేసినది అని చెప్పకుండా ఉంటే ఇంకా బాగుంటుంది :)

8 comments:

 1. ముందురోజుదని చెప్పినా, ముక్కు మూసుకుని 'మమ' అనుకుని నోట్లో పడేసికోడమే ఉత్తమమైన పని.

  ReplyDelete
 2. పాపం రోజూ బలైపోతూవుంటారన్నమాట :)

  ReplyDelete
 3. ఫణి బాబు గారూ,

  ఏదో కాస్త ఇస్తే మమ అనుకోవచ్చు. ఆ తినూ అంటూ గుమ్మరించెస్తే కష్టం కదండీ.

  ఆనానిమస్ గారూ,

  ధన్యవాదాలు.

  మాలాకుమార్ గారూ,

  అవునండీ. నా ఇబ్బంది బస్సెక్కగ్గానే మొదలవుతుంది రాయడం మర్చిపోయాను. యాపిల్ కట్ చేసి రోజూ తెస్తుంది. యాపిల్ తినడానికేమి అనుకుంటున్నారు కదూ.

  యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పు రాయాలి అన్న చిట్కాల చిట్టెమ్మల మాట విని ఉప్పటి యాపిల్ అందిస్తుంది రోజూ. వంకాయ ముక్కలని తరిగి ఉప్పు నీటిలో వేసినట్లు తియ్యటి యాపిల్ ని వేసి తినమంటే ఎలా చెప్పండి . కామెంటుకి ధన్యవాదాలు.

  ReplyDelete
 4. ఆపిల్ ముక్కలకి కాసంత పసుపు కారం రాసెయ్యమనండి..ఎ౦చక్కా
  ఊరగాయ్ అవుతుంది...ఇలాంటి అతి ప్రేమ భరించడం కష్టమే...

  ReplyDelete
 5. దీనినే మూఢప్రేమ అందురు...
  ఒకసారి మీరే భక్త శబరి అనుకోండి...హహహహ

  ReplyDelete
 6. హ హ హ ... మీ బాధ వర్ణనాతీతం తెలుగమ్మాయి గారు...బాగుంది మీరు రాసిన వైనం.

  ReplyDelete