Thursday, August 4, 2011

పంద్రాగస్టు

వచ్చెస్తోంది పంద్రాగస్టు. ఏమి పంద్రాగస్టో ఏమో,టింగు రంగా మని ఆరోజు భారతీయత ఉట్టిపడే వస్త్ర ధారణ తో వచ్చి షరా మామూలుగా న్యూసులు బ్రేకడం, ఆరోజు ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇదేగా. దిన పత్రిక లలో అయితే ఎన్ని సంవత్సరాల నుండీ చూస్తున్నానో,వంటల సెక్షన్ అంతా "తిరంగా" మయమే. తిరంగా కేకు, తిరంగా హల్వా ఇవి కంపల్సరీ. ఇంకాస్త కొత్తదనం గా ఆలోచించగలిగితే తిరంగా పులిహోర(తింగరి పులిహోర అని నేననుకుంటాను), తిరంగా బూర్లు,పాయాసం..తిరంగా చపాతీలు. అసలు ఆ వంటలు కనిపెట్టిన వాళ్ళని అడగాలనిపిస్తుంది నిజ్ఝం గా మీ ఇంట్లో ఇవన్నీ తింటారా, పైగా పిల్లలు చాలా ఇష్టం గా తింటారు అంటారు కదా, మీ పిల్లలు ఆ పదార్ధాలు తింటున్నప్పుడూ ఓ వీడియో తీసిపెట్టండి అని.

ఇప్పుడు ఓ ముప్ఫై నలభై శాతం మందికి తెలియక పోవచ్చు స్వాతంత్ర్య పోరాటం గురించి, కొన్ని రోజుల తరువాత ఓ ముప్ఫై నలభై శాతం మందికి మాత్రమే తెలుస్తుందేమో.

ఆరోజు కనీసం రాజధాని లో పరేడ్ జరిగినంత సేపైనా ప్రైవేటు ఛానెళ్ళు మిగతా కార్యక్రమాలని ఆపి అది చూపిస్తే బాగుండు. డీడీ లో వస్తుంది గా, ఈ ప్రసారాలు ఆపి వీళ్ళకి నష్టం కలిగించ్గడం ఎందుకు అంటారేమో, చిత్త చాపల్యమండీ(పదం కరక్టేనా), ఆ పక్క ఇష్టమైన రెహ్మానో, ఇళయరాజా పాటలో వస్తోంటే డీడీ లో మన రాష్ట్ర శకటం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడలేని నా లాంటి వాళ్ళుంటారుగా.


ఇన్నేళ్ళలో ఏమి సాధించాము అంటే చాలానే సాధించాము కానీ దురద్రుష్టం ఏమిటి అంటే సాంకేతిక రంగాలలో ఎంత అభివ్రుద్ధి సాధిస్తున్నామో చిన్న చిన్న వాటిల్లో (నైతికత,జవాబు దారీ తనం) పాతాళానికి పడిపోతున్నాము.

అభివ్రుద్ధి సాధించిన సాంకేతికత ని ప్రజలకి ఉపయోగ పడేటట్లు చెయ్యలేకపోతున్నాము. కొన్ని చోట్ల ప్రయోగిస్తే వాడుక తెలియకో,ఆ ఏమవుతుందిలే ఇది పాడవుతే అన్న నిర్లక్ష్యమో కానీ కొన్ని యంత్రాలు నిరుపయోగమవుతున్నాయి.

మా ఊరి రైల్వే స్టేషనులో టచ్ స్క్రీన్ పెట్టారు(రైల్వే సమాచారం కోసమో మరి దేని కోసమో గుర్తు లేదు సరిగ్గా). అది కొన్నాళ్ళకే నిరుపయోగమయ్యి మూల పడింది. పిల్లలు ఏడుస్తోంటే సముదాయించడానికి దాని దగ్గరకి తీసుకెళ్ళి నొక్కించి ఆడిస్తున్న ఒకాయన దగ్గరకి వెళ్ళి ఇంకొక ఆయన(బాధ్యత గల పౌరుడు అనాలేమో)చెప్పాడు,బాబూ ఇది పిల్లలు ఆడుకునేది కాదు అని. రియాక్షను ఊహించుకోగలరు కదా. మన నుండి ఇలాంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తన వల్ల కావచ్చు,మెయింటినెన్సు లేకపోవడం కావచ్చు ఏదైతేనేమి ఎంతో విలువైన ప్రజల ఉపయోగార్ధం పెట్టిన ఓ పరికరం మూల పడింది. ఇప్పటికీ అది మా ఊరి స్టేషను కి అలంకారమే.


ఇక మెటల్ డిటెక్టర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాడులు జరిగిన ముంబై సంగతేమో నేను చూసిన ఓ రెండు మూడు మహా నగరాలలో అయితే చక్కగా స్టేషను లోకి వచ్చే వారికి స్వాగతం పలుకుతూ ఉంటాయి అవి ఏమీ పని చెయ్యకుండా.

ఇక రాజకీయాల గురించి చెప్పేదేముంది,ఇలాంటి వాళ్ళు డబ్బు ప్రభావం వల్లో, ఓటెయ్యని నా లాంటి వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసేసుకునో గెలిచెస్తుంటారు.

అవినీతి అవినీతి అంటాము కానీ, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నేను మొదట ఆలోచించేది ఎవరిని "మేనేజ్" చేస్తే పని అవుతుంది అని. పని త్వరగా అవ్వాలి అంతే నాకు కావాల్సింది,సో, నేనూ నా యధా శక్తి తోడ్పడుతున్నాను ఈ లంచగొండులకి. నాకున్న ఇతర బాధ్యతలు కావచ్చు కారణం మరేదైన కావచ్చు నేను లంచం ఇవ్వకుండా ఓపిక గా వాళ్ళ చుట్టూ తిరగలేను. ఒక వేళ అలా వెళ్తానూ అన్నా కానీ, ఆ ఎందుకమ్మా నీకా ఇబ్బంది అంటారు ఇంట్లో వాళ్ళు. ఫలానా వాళ్ళ కోడలు/అమ్మాయి అలా పడిగాపులు కాస్తే పాపం వాళ్ళకీ ఇబ్బంది అని అర్ధం చేసేసుకుని నేనూ ఊ కొట్టెస్తాను.

ఇప్పటికీ నాకు సియాచిన్ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇంకాస్త డీప్ గా ఆలోచిస్తే నా ప్రవర్తనకి సిగ్గుపడతాను,సగటు పౌరురాలిగా నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించనందుకు. ఇవన్నీ నాకే పరిమితం,ఎవరికి చెప్పినా నవ్వుతారని, భయం ఏంటీ పేట్రియాటిక్ అయిపోతున్నావు అంటారని.

నా లాంటి సగటు భారతీయులు ఏమీ మార్చలేరు. ఇలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ మార్పు రాదు,పదండి అని ఓ నాయకుడు ఉద్రేక పూరిత ప్రసంగం వినగానే మహిళా మణులంతా ఏకమయ్యి మార్పు తెచ్చెయ్యడానికి సినిమా కాదు ఇది, వాస్తవం. మహిళా సంఘాల నాయకురాళ్ళని చూస్తే మహిళ నైనందుకు సిగ్గుపడతాను వాళ్ళ వేషాలు చూసి. ఉదాహరణకి స్టూడియోలకొచ్చి బూతు సినిమా అనో అశ్లీలం అనో చించుకుంటారే కానీ వారి వెనకాలే స్క్రీన్ లో మార్చి మార్చి చూపిస్తున్న ఆ క్లిప్పింగులని ఆపమని ఒక్కరూ చెప్పలేరు.


నిజం చెప్పొద్దూ నాకూ ఆగస్టు పదిహేను అంటే ఓ శలవు మాత్రమే. ముందు రోజు నాకొచ్చిన ఎస్సెమ్మెస్సులని ఓ పది ఇరవై మందికి ఫార్వార్డ్ చేసేసి నలుగురితో పాటూ నేను ఆరోజు కాసేపు భరత మాత ని గుర్తు చేసేసుకుని, లాంగ్ వీకెండు ని ఎంజాయ్ చేసేసి రొటీన్ లో పడిపోతాను.

అంతే కదా, నేను చెయ్యగలిగినది. ఈ సారి ఎన్నికలలో "వీలయితే" ఓటు హక్కు వినియోగించుకుంటాను.

6 comments:

 1. ఈ పంద్రాగస్టు కి నేను ఒకటి చేయదలిచాను...
  స్వాతంత్ర్య సమరయోధుల black and white ఫోటోలను కలర్ లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ www.bukke.blogspot.com
  .....
  ఇది నిరుపయోగం అనుకుంటాను....
  కానీ కలర్ లో వాళ్ళను చూస్తే కొత్త ఉత్తేజం వస్తుందనుకుంటా.....

  ReplyDelete
 2. మంచి టపా. నిజాయితీగా రాశారు.

  >>నా లాంటి సగటు భారతీయులు ఏమీ మార్చలేరు. ఇలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ మార్పు రాదు,పదండి అని ఓ నాయకుడు ఉద్రేక పూరిత ప్రసంగం వినగానే మహిళా మణులంతా ఏకమయ్యి మార్పు తెచ్చెయ్యడానికి సినిమా కాదు ఇది, వాస్తవం.

  అలా ఉద్రేక పడి మార్పు తేలేమన్నది నిజమే కానీ, మనలో ప్రతిఒక్కరం ఎంతోకొంత మార్పు తేగలుగుతాం. దాంతోటే దేశం మారిపోదు కదా అనుకోవడమే మన పొరపాటు. దేశంలో మార్పు అనేది ఒక్క రోజులో రాదు. ఎవరికి వీలయినంత వాళ్ళు చేసుకుంటూ మంచి నాయకత్వాన్ని పెంచుకుంటూ పోవడమే.

  Just do your part and leave the rest to the collective judgement of the excellent people of this country. Some simple things that can do wonders and are definitely possible for each one of us are:

  1. Be a voter and vote
  2. Observe the politics and have opinions on issues
  3. Participate in the system of governance
  4. Get into Politics and be there (with in the limits of your time, energy and interest)

  ReplyDelete
 3. బాగుంది . మంచి పోస్ట్ .

  ReplyDelete
 4. చాలా రోజులకు రాసారు...
  బావుందండి టపా. వీలుచూసుకుని రాస్తూడండి. మీరు బాగా రాస్తారు.పంద్రాగస్టు కి అప్పుడప్పుడూ బ్లాగునో చూపు చూడాలని నిర్ణయం తీసుకోండి..:))

  ReplyDelete
 5. ఇంకొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే...

  >> అంతే కదా, నేను చెయ్యగలిగినది. ఈ సారి ఎన్నికలలో "వీలయితే" ఓటు హక్కు వినియోగించుకుంటాను.

  "వీలయితే" కాదు, "వీలు చేసుకొని" ఓటు హక్కు వినియోగించుకోండి. ఈ మర్పుతో మొదలెట్టండి. Things will definitely get better :)

  as a start you can edit the post and replace "వీలయితే" with "వీలు చేసుకొని"

  Once you do take this small first step your 15th August will be much better. Trust me :)

  ReplyDelete
 6. పంద్రాగస్టు ఐపోయాక చూసాను మీ టపా...


  చాలా నిజాయితీగా రాసారు..అభినందనలు.

  దాదాపు అందరి మనసుల్లోనూ ఇదే వున్నా అంత తేలికగా వొప్పుకోలేం...ఏదో గుడ్డి నమ్మకం తో బతికేస్తూ వుంటాం అభినందనలు.

  ReplyDelete