Thursday, February 24, 2011

హైదరాబాదులో మంచి భోజనం ఎక్కడ దొరకును?

మనకి అప్పుడప్పుడు ఏదయినా తిని చాలా రోజులయితే ఆ వంటకం తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా.నేను భోజన ప్రియురాలిని కాబట్టి ఈ కోరికలు కాస్త ఎక్కువన్నమాట.

నాకెందుకో ఈ మధ్య మాంఛి తెలుగు భోజనం తినాలని తెగ కోరిక కలిగింది. ఆఫీసు లంచ్ లు,ఇతర పార్టీలలో ఉత్తర భారతదేశపు వంటలు తినీ తినీ మొహం మొత్తడం కూడా ఒక కారణం. ఇంట్లో రోజూ వంట చేసినా కానీ ఏదో అసంత్రుప్తి.

ఇంటికెళ్ళినప్పుడు అమ్మ అత్తయ్య గారు ఇద్దరూ కూడా నీకేమి కావాలో చెప్పు వండుతాము అన్నా కానీ ఎక్కడయినా బయటే తినాలనిపించింది నాకు.

మాంఛి తెలుగు భోజనం అంటే పెళ్ళికి వెళ్తే సరిపోతుంది కదా అన్నారు మా వారు. సర్లెండి,ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో తెలుగుదనం తగ్గిపోతోంది అంటే ఏమీ కాదు మన ఊర్లో ఇంకా(మా ఊరు ఒక టవును లెండి) అలాంటి కల్చర్ వచ్చుండదు అని మా వారు గాట్ఠిగా వాదించేసరికి సరే,చూదామనుకుకున్నాను.

ఏదయినా పెళ్ళి పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురుచూసాము ఇద్దరమూ. నక్కని తొక్కినట్లు ఓ నాలుగు పెళ్ళి పిలుపు కార్డులు ప్రత్యక్షం ఇంట్లో మరునాడు.ఆహా పెళ్ళి భోజనానికి వెళ్తున్నాను అని సంతోషపడ్డాను.


పెళ్ళి భోజనం అంటే నా మనసులో పడిన ముద్ర ఎలాంటిదంటే,చక్కగా వరుసగా కూర్చున్న వాళ్ళకి దోసావకాయతో వడ్డన మొదలెట్టి పప్పు,దప్పళం ఎక్సెట్రా వంటలతో నిండిన రుచికరమయిన భోజనం,అచ్చగా అవే వంటకాలు కాకపోయినా కానీ.

బుఫే భోజనాల పెళ్ళిళ్ళకి కూడా అట్టెండ్ అయ్యాను. కానీ ఈ తరహా భోజనాలతో విసుగెత్తి ఏమో నాకు ఈ కోరిక కలిగింది.

వెళ్ళిన మొదటి పెళ్ళి అర్ధ రాత్రి ముహుర్తం. రాత్రి ఎనిమిదింటికి వెళ్ళాము. ఇసకేస్తే రాలనంత జనం. అమ్మాయి తండ్రి పేరున్న మనిషిట ఆ ఊరిలో.

కళ్యాణమండపం(ఫంక్షను హాలు) ఎంట్రన్స్ లో అమ్మాయి,అబ్బాయి ది భారీ ఫొటో,కింద చేతులు జోడించి ఆహ్వానిస్తున్న భంగిమ లో అమ్మాయి తల్లి తండ్రులు. ఇంత పెద్ద సైజు ఫోటో ఇప్పటి వరకు మన ఊరిలో ఎవరూ పెట్టలేదు, చాలా ఖర్చయిందిట ఆ ప్రింటింగుకీ అదీ అని చెప్పుకుంటుంటోంటే విన్నాను. రకరకాల పూలు,ఇతరత్రా డెకరేషన్ సామాగ్రితో పెళ్ళి పందిరి ని గ్రాండ్ గా అలంకరించారు. కానీ కొబ్బరాకులు లేవు కదా, మండపం ఎంత గ్రాండ్ గా ఉన్నా కానీ నచ్చలేదు నాకు ఆ పచ్చదనం లేకపోయేసరికి.


అలా కూర్చున్నాము ఓ పక్కగా ఎవరయినా తెలిసిన వారు కనిపిస్తారేమో అని. సడెన్ గా మండం నుండి జనాలు హడావిడిగా పైకి వెళ్ళడం చూస్తే అర్ధమయ్యింది. భోజనాలు రెడీ అని.

రష్ గా ఉంది కదా కాసేపాగి వెళ్దామనుకున్నాము. గంతయినా కానీ ఆ రష్ తగ్గే సూచనలు కనిపించక భోజనాలకి వెళ్ళాము. మేము కూర్చున్నాము,రక రకాల కూరలు,స్వీట్లు వస్తాయే కానీ అన్నం రాదే.. అన్నం అయిపోయింది వండుతున్నారు అని అప్పుడు తెలిసింది.

చేసేదేమీ లేక వడ్డించిన కూరలు రుచి చూసాను ఒక్కొక్కటి గా. నేను ఊహించుకున్న పెళ్ళి భోజనం లాగే లేదసలు. అన్నీ కలగా పులగం కూరలు. ఇంతలో సెగలు కక్కుతూ వేడన్నం పట్టుకొస్తుండటం చూసి ప్రాణం లేచొచ్చింది.

కానీ ఆ సంబరం ఏంతో సేపు నిలవలేదు విస్తట్లో ధబీల్మని పడిన ఉడికీఉడకని అన్నం చూసేసరికి.

మరీ వెంటనే లేచెస్తే బాగోదని అలా కూర్చున్నాను.ఇంతలో కూర్చున్న మా అందరి వెనకాల వచ్చి వరుసగా మనుషులు నిలబడ్డారు,ఎప్పుడు లేస్తారా కూర్చుందామన్నట్లు.

ఒక వరుస మనుషులు లేచీ లేవగానే ఆ టేబిలు మీద పరిచిన పేపరు తీసేసి వెంటనే ఇంకోటి వెయ్యడం,అంతే ఆత్రం తో వెనక నిలబడ్డవాళ్ళు వచ్చి కూర్చోవడం.

చిర్రెత్తుకొచ్చింది నాకు,ఒక పంక్తి పూర్తయ్యేవరకూ కూడా ఆగలేరా అని. పెళ్ళి కొడుకు కూతురిని ఒకసారి కలిసి ఇక వెనుదిరిగాము పెళ్ళివారిచ్చిన పేద్ద రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్టుతో.

బయటకి రాగానే ఎంట్రన్సులో పెట్టిన ఆ ఫోటో మీద శ్రద్ధ, అమ్మాయి తరపు వారు అతిధుల భోజనాలు తదితర ఏర్పాట్ల మీద చూపించుంటే ఎంత బాగుండేది అనిపించింది.

ఎక్కడయినా చిన్న చిన్న లోపాలుంటాయి. చివరి ఒకటి రెండు పంక్తులవారికి అన్నం లేదంటే అర్ధముంది కానీ,కానీ అంత మందిని పిలిచినప్పుడు కనీసం ముప్పావు మందికయినా సరిపడా భోజనం వండిచకపోతే ఎలాగ?

భోజనమే బాలేదంటే నిర్వాహణ అట్టర్ ఫ్లాపు ఈ పెళ్ళిలో.

ఇంకో పెళ్ళికెళ్ళాము,అక్కడ నిర్వాహణ బాగానే ఉంది కానీ, అయ్యో భూతద్దం తేవాల్సింది ఉన్న ఒకటీ రెండూ తెలుగు వంటలని వెతకడానికి అనిపించింది.

ఇక మూడొ పెళ్ళి లోనేమో అన్నీ తెలుగు వంటలే కానీ రీమిక్సులు అన్నమాట. పులిహోర ని వండిన విధానం చూస్తే దేవుడా ఏమి ఈ దుస్థితి మన చక్కటి వంటలకి అనిపించింది.


పెళ్ళి భోజనం మీద ఇంకా మోజు తీరని మా ఆయన ఇక రెస్టారెంట్ల మీద దాడి మొదలెట్టారు హైదరాబాదు మా అక్క ఇంటికి వచ్చి.తను ఇంట్లో వండుతాను ఆన్నా సరే వద్దు నాకు "మంచి భోజనం" కావాలి అని ఒకటే గొడవ.

మంచి భోజనం కి నిర్వచనం మాత్రం అడక్కండి ఆది ఆయనకే తెలియాలి.

ఈ గోల పడలేక అక్క వాళ్ళు ఒక రెస్టారెంటు కి తీసుకెళ్ళారు.అక్కడ ఆంధ్రా భోజనం ఒకటి ఆర్డర్ ఇచ్చాము.

అరిటాకులో పెట్టినంత మాత్రాన అది ఆంధ్రా భోజనం అవుతుందేమిటి రుచీ పచీ లేకపోతే.

ఇంకో రెండు మూడు రెస్టారెంట్లలో ప్రయత్నించాము. సోనియా కి తానేంటొ నిరూపించుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల
కంటే ఎక్కువే చేసామంటే నమ్మండి.

ఇంతలో మా లక్ష్మి అత్తయ్య ఫోను భోజనానికి రండి ఊళ్ళోకి వచ్చారు కదా అని.

సరే అని మరునాడు వెళ్ళాము.ఆహా స్వర్గం చూసామంటే నమ్మండి ఆరోజు.వయసు మీద పడ్దా కానీ మాకోసం అత్తయ్య శ్రమ పడి చేసిన కందా బచ్చలి కూర,మామిడి కొబ్బరి పచ్చడి,ముక్కల పులుసు,బచ్చలి కూర పప్పు,ఊర మిరపకాయలు,అత్తయ్య ట్రేడు మార్కు తొక్కుడు పచ్చడి,ఇతర ఊరగాయలు మాంఛి పెరుగు.

మొత్తానికి ఈ భోజనం తినగానే మా వారి మంచి భోజనం కోరిక తీరింది.(నా కోరిక కూడా లెండి)


అప్పుడు ఙానోదయమయ్యింది నాకు,నేను కోరుకున్న తరహా భోజనం బయట దొరకట్లేదని ఈ మధ్య.

హైదరాబాదు బ్లాగర్లూ కాస్త రుచికరమయిన ఆంధ్రా(తెలుగు) భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి.

13 comments:

 1. జ్యోతిగారినో వారి మిత్రబృందాన్నో అడిగి చూడండి :)

  ReplyDelete
 2. hyderabad sangathi naaku theliyadu gaanee..., bhojana priyudaina naku kooda ee post chaduvuthunte noroorindi..., habbaa...

  ReplyDelete
 3. ameerpet lo maitrivanam opposite lo harsha mess lo manchi andhra bojanam untundi andi.

  ReplyDelete
 4. అన్నీ తెలుగు వంటలే కానీ రీమిక్సులు అన్నమాట....super :)

  ReplyDelete
 5. ameerpet cross road lo kakateeya mess lo kuda bhojanam chala bavuntundi andi .

  ReplyDelete
 6. సాంప్రదాయ తెలంగాణా(బూతులు కాదు) భోజనం, హైద్రాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? :D

  ReplyDelete
 7. You can visit a hotel or mess which labelled as "NELLORE BHOJANAM" Usually you will get (Telugu)Bhojanam (Not Andhra Bhojanam which is vary from place to place)

  ReplyDelete
 8. తెలింగిటమ్మాయి,
  విజయవాడ లో మా ఇంటికొస్తే మాంచి ఆంద్ర భోజనం చెయ్యొచ్చు
  ఇంకో సారి అలా అనిపిస్తే ఇద్దరూ వచ్చేయండి
  తెలిగింటి బాబాయి

  ReplyDelete
 9. హా హా మహ రుచిగా వర్ణించారు మాంఛి భోజనాన్ని. అది సరే ఇంతకీ మీరు వండుతారా మాంఛి భోజనం?

  ReplyDelete
 10. మీకు బోజనం దొరకడం ఏమోకాని, ఇప్పుడు ఇదంతా చదివి పిచ్చ ఆకలేస్తోంది!!

  ReplyDelete
 11. ee madhya naaku ee baffe food thini thini virakthi vasthundi. manchi teluginti bhojanam kosam waiting. aithe naa vuddeshyam lo prematho evaraina vaddisthe adi manchi bhojanam.

  ReplyDelete
 12. మనవాణి గారూ,

  సలహాకి ధన్యవాదాలు

  మిర్చి బజ్జీ గారూ,

  మీ పేరే నోరూరుతుంటే ఇక్కడ :)

  శివ ప్రసాద్ గారూ,

  అప్పుడెప్పుడో 2003 లో అనుకుంటా ట్రై చేసా అక్కడ,ఊహూ నాట్ సాటిస్ఫైడ్ అండీ :)

  రాజేంద్ర కుమార్ గారూ,

  :))

  రాజా గారూ,

  ఊహూ..నాకు మెస్సుల్లో భోజనం నచ్చలేదు అమీర్ పెట్ లో ట్రై చేసా కానీ ఈ మధ్య కాదు ఓ ఏడెనిమిది ఏళ్ళ క్రితం.

  అనానిమస్ గారూ,
  ఈ నెల 19 న ఏదో రోడ్ల మీద వంటా వార్పూ కార్యక్రమం ఉంది,అక్కడ ప్రయత్నించండి :)).సరదాకి అన్నానండోయ్,నాకు తెలీదు.

  డాక్టర్ గారూ,

  నెల్లూరు భోజనం రుచి చూడాలి ఈ సారి. మా చిన్నప్పుడు మా ఊరిలో నెల్లూరు హోటల్ ఉండేది. దానిలో చారు నచ్చేది నాకు :).అమ్మ ఊరెళితే మాకు క్యారేజీ అక్కడ నుండే.

  ఆత్రేయ గారూ,

  కాసుకోండి వచ్చెస్తాము మొహమాటం లేకుండా ఈ సారి.పిలిచేసారు గా,కాదనకూడదు మరి :)


  వనితా జ్యోతి గారూ,
  నేను బ్రహ్మాండగా వండుతాను. వచ్చి రుచి చూసే దమ్ముందా?

  మిరియప్పొడి గారూ,

  :)).

  గీతా యశస్వి గారూ,

  అవునండీ,వడ్డన మాయమయ్యింది అసలు ఈ మధ్య పెళ్ళిళ్ళ నుండి.

  ReplyDelete
 13. తెలుగింటమ్మాయిగారు,, నాలుగు నెలల క్రింద టపాకు ఇప్పుడు సమాధానమిస్తున్నందుకు సారీ.

  హైదరాబాదులో తెలుగింటి భోజనం సంగతి తెలీదండి. మేము బయట తినడం తక్కువే. మా ఇంటికి రండి. మీకు ఇష్టమైనవి చేసి, విస్తరేసి వడ్డిస్తాను. ఇది మాటవరసకు కాదు నిజంగా అంటున్న మాట..

  ReplyDelete