Saturday, September 24, 2011

వంటల కాన్ఫిడెన్సు

ఇప్పటికే ఓ రెండు మూడు వంటల టపాలు రాసావుగా మరలా ఇదేనా అనకండి. ఏమి చెయ్యమంటారూ, ఆ మధ్య క్రిష్ణప్రియగారి అమ్మో ఏమి రుచి టపాతో నా ఙాపకాలని తట్టిలేపారు. రాద్దాము రాద్దాము అనుకుంటూ బద్ధకించాను కానీ గత నెలరోజులనుండీ మా "జనని" పెడుతోన్న టార్చర్ భరిస్తూ ఆ బాధ కాస్త మీకూ పంచుదామని.

ముందు "లావణ్య" అనే ఆవిడ ఇంటికి పిలిస్తే ఆవిడ అతిధులు ఎలా గడగడలాడుతున్నారో చెప్తాను.

ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా కేవలం పిల్లల ప్లేగ్రవుండు లో హాయ్ బాయ్ పరిచయం ఉన్న ఒకావిడ వాళ్ళబ్బాయి పుట్టినరోజు పార్టీ కి పిలిచింది.ఆవిడతో నేను గట్టిగా ఓ గంట మాట్లాడింది లేదు పార్టీ కి ఎలా వెళ్ళను అని ఆలోచిస్తుండగా నా మనసు చదివేసినట్టు ఆవిడేమో " ఇలా కలిస్తేనే పరిచయాలు పెరుగుతాయండీ,ఓ పది మందిని పిలిచానంతే, రండి ప్లీజ్" అంది.డిన్నర్ మా ఇంట్లోనే అని కూడా చెప్పింది

సరే వస్తాను అన్నాను.ఆరోజు రానే వచ్చింది. ఆవిడ ఆరోజు పొద్దున్నే ఫోను చేసి మరీ ఇంకోసారి పిలిచింది.. ఇక తప్పేట్టులేదని తయారయ్యి దగ్గర్లో ఉన్న మాల్ కి వెళ్ళి ఓ బొమ్మ కొని నేనూ మా అబ్బాయి బయలుదేరాము.

ఓ పాతిక ముప్పై మంది పెద్దవాళ్ళూ పదిహేను మంది దాకా పిల్లలూ ఉన్నారు.

కేక్ కటింగూ అవీ అయ్యి భోజనాల అంకం మొదలయ్యింది.ప్లేటు పట్టుకుని బయలుదేరాను.ఆలూ కూర,బిర్యాని(లాంటిది),సేమ్యా పాయాసం,ఇంకో కూర ఏదో,సాంబారు,పెరుగు,గులాబ్ జాం.మెనూ చూడగానే వాహ్ అనిపించింది.


అన్నీ ప్లేటులో వడ్దించుకుని ఆలూ కూర కలిపి నోటిలో పెట్టుకోగానే ఏదో తేడా అనిపించింది.పక్కన పెట్టి బిర్యాని తినడం మొదలెట్టాను.పచ్చి బియ్యం పులావు అని ఏ వంటల కార్యక్రమంలో అయినా చూపిస్తే ఈవిడ కానీ చూసి చేసిందా ఏమిటీ అనిపించింది గాట్ఠిగా ఉన్న ఆ అన్నాన్ని నములుతోంటే.

సాంబారు ది కూడా ఆలూ కూర పరిస్థితే.అన్నీ అలా కెలికి పెరుగు వేసుకుందామని వెళ్ళేసరికి అది ఖాళీ.

అయ్యో పెరుగు అయిపోయిందా, ఏమండీ కాస్త పెరుగు తీసుకురండి అని వాళ్ళాయనకి చెప్పబోతోంటే కరుణామయులెవరో ఆ,ఇప్పుడేమి వెళ్తారు ఫరవాలేదు లెండి అనేసరికి పురుషులతో బాతాఖానీ లో మునిగిపోయిన వాళ్ళాయన మొహంలో రిలీఫ్.

అయిపోయాను,ఆపద్బాంధవి అనుకున్న పెరుగు లేదు. చేసేది లేక గబగబా చేతులు కడిగేసుకుని గులాబ్ జాం బౌల్ లో పెట్టేసుకున్నాను.

ఇంతలో ఎవరో అడిగారు,ఇన్ని వెరైటీస్ ఒక్కదానివే ఎలా చేసావు లావణ్యా అంటూ. పొద్దున్న్నే పిల్లలు వెళ్ళగానే మొదలెట్టేసాను,పన్నెండింటికి వాళ్ళొచ్చేలోపు అంతా పూర్తి చేసేసా అని విజయ గర్వంతో చెప్పింది లావణ్య.

టైము చూసాను, రాత్రి 9,అంటే దాదాపు 10 గంటలు ఇవన్నీ వండి.పైగా గత వారం నుండీ ఎండ దంచెస్తోంది పగటిపూట. కనీసం ఫ్రిజ్ లో పెట్టినా బాగుండేవేమో.

అంతే..అప్పుడే నాకు ఇంకా కేక్ కావాలి అని నేను ఒప్పుకుంటానో లేదో అని సందేహం గా అడిగిన మా అబ్బాయి ప్లేటులో దగ్గరుండి ఇంకో రెండు ముక్కలు పెట్టాను.

వాడికి అర్ధం కాలేదు అమ్మ ఇంత మంచిదయిపోయింది ఏమిటీ సడెన్ గా అని.

కాసేపటికి లావణ్య వచ్చి మీ అబ్బాయికి అన్నం పెట్టరా అంది.కేక్ తిన్నాడు కదా ఇంక అన్నం తినలేడు అని చెప్పను.

పిల్లలు మనము అబద్ధమాడినప్పుడే సడెన్ గా మంచివాళ్ళయిపోతారు కదా.

అమ్మా,నాకు ఆకలేస్తోంది అని వాడు అనగానే ఓ సీరియస్ చూపు విసిరాను(మా అబ్బాయి నా చూపుల్లో తేడా గుర్తించేస్తాడు లెండి)

లేదండీ,వాడు ఎక్కువసేపు ఉండటానికి ఈ వేషాలన్నీ,అనవసరం గా ఫుడ్ వేస్ట్ తప్ప తినడండీ అని ఇంకో అబద్ధం ఆడేసాను.

అయ్యో ఆకలేస్తుందేమో కాస్త బాక్స్ లో పెట్టిస్తా ఆగండి అని,పచ్చి బియ్యం పులావు,ఆలూ కూర,సాంబారు ఓ మూడు డబ్బాలలో సర్ది రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఇచ్చింది. రిటర్న్ గిఫ్ట్ మాత్రమే మాతో పాటు ఇంటికి వచ్చింది అని వేరే చెప్పక్కర్లేదు కదా.

ఎప్పుడో పొద్దుననగా చేసిన వంటలని సాయంత్రం అతిధులకి ఏ చీకూ చింతా లేకుండా వడ్దించడానికి ఎన్ని గుండెలుండాలి

అంతే, ఆ దెబ్బకి ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే వంకలు వెతుక్కుంటున్నారు ఆనాటి అతిధులు.


ఇంక మా "జనని" సంగతి చూద్దాము. "జనని" అనగా మా మాత్రుమూర్తి అనుకుంటారేమో. కాదు,నా అరవ కొలీగ్.

జనని ఈ మధ్యే నేను పనిచేసే ఆఫీసులో నా టీంలోనే జాయిన్ అయ్యింది.ఇంతకుముందు కూడా ఇద్దరమూ కలిసి పనిచేసాము కానీ అప్పుడు పెద్ద పరిచయం లేదు.

నెల క్రితం తను మా టీం లోకి వస్తోంది అని తెలిసింది. నేను తప్ప ఆడ పురుగు లేని మా టీం లోకి తను వస్తోందంటే సంతోషమేసింది.

అంతా బాగానే ఉంది తనతో రోజులో ఆ పది నిమిషాలూ తప్ప. అదేనండీ మేము భోజనం చేసే సమయం తప్ప.

ఇంతకుముందటి ఆఫీసులో ఓ గంట మినిమం లంచేవాళ్ళము,ఇక్కద పెద్ద గ్రూపూ లేదు,ఉన్న ఇద్దరమే ఏమి చేస్తాము అనే కారణం కంటే మా జనని కి భయపడి పది నిమిషాల్లోపే డబ్బా మూసెస్తున్నాను.

జనని తమిళమ్మాయి అని చెప్పాను కదా. కానీ బొంబాయిలో పెరిగింది.అందుకని కాస్త అరవ వాసన తక్కువే తన వేష,భాష, వంటల్లో.

ఓ సారి మాటల్లో తాను ఓ 70 మందికి వండటం అలవోకగా చేసెస్తా అంది.అయ్యబాబోయ్ అనుకున్నాను.చైనీస్,నార్త్ ఇండియన్ అన్ని రకాలు చేసెస్తా అనంటే అబ్బురమనిపించింది.చాలా కాలం క్రితం నేను ఉద్యోగం కోసం ప్రయత్నించి ఏమీ అవకాశాలు రానప్పుడు అసలు నేనే చిన్న ఫుడ్ సెంటర్ పెట్టుకోవడమో పార్టీ లకి ఆర్డర్లు తీసుకోవడమో చేద్దాము ఈ ఉద్యోగం సజ్జొగం వద్దు అనిపించింది అన్నప్పుడు వాహ్,ఎంత మంచి వంటగత్తె, నాకూ తన రకరకాల వంటలు తినే భాగ్యం అన్నమాట అనుకున్నాను.


మెల్లిగా ఓ వారం గడిచింది.కాస్త మా ఇద్దరి పరిచయమూ బలపడింది.కలిసే భోజనం చేసేవాళ్ళము.అక్కడ మొదలయ్యింది నా తంటా.

తన బాక్సులో మంచూరియా,పావ్ భాజీ లాంటి రకాలుండేవి.లేదా కాస్త టైము పట్టే కూరలైన పాలక్ పనీరు,వంకాయ కారం పెట్టిన కూర లాంటివి. పొద్దున్నే ఇవన్నీ చేస్తున్నావంటే సూపర్ అన్నాను.

పిచ్చా,ఏమన్నా పొద్దున్నే ఇవన్నీ చెయ్యడానికి?మా పిల్లలు ఎనిమిదింటికల్లా వెళ్ళాలి,నేను బయలుదేరాలి ఎలా కుదురుతుంది? నేను రాత్రి డిన్నర్ కోసం వండీన వాటిని మైక్రోవేవ్ లో పెట్టి తెచ్చుకుంటాను అనగానే షాక్ నేను.

తన మానాన తను తెచ్చుకుని తింటే అసలు ఈ టపా ఎందుకు ఉండేది?తెచ్చినవన్నీ బలవంతం గా నా బాక్స్ లో వేసేసేది. మంచూరియా అయితే దారుణం. మైదా ముద్దని గ్రేవీ లో ముంచుతిన్నట్టుంది.పాలక్ పనీర్ సూపర్ గా ఏమీ లేదు.జస్ట్ ఓకే అంతే.

వార్నీ, ఇలా అసలు రుచుల్ని మార్చేసేట్లయితే నేను లెబనీస్,కొరియన్,థాయ్ కూడా వండెయ్యగలను అనిపించింది.

నిన్న శుక్రవారం హాయిగా నా మామిడికాయపప్పు ఆస్వాదిస్తోంటే ఖావో యార్ అంటూ అదేదో కడాయ్ వెజ్ కూర ట గుమ్మరించేసింది పక్కన.

వద్దు అని ఎన్ని సార్లని చెప్తాము చెప్పండి?వద్దంటే "అరే, తుం కుచ్ నహీ ఖాతీ హో" అని అతి చనువుతో నాకు పెట్టెస్తుంది.

అందరికీ వండి పెట్టాలి,తన కలినరీ స్కిల్స్ అందరూ గుర్తించాలి అనే యావ ఎక్కువ మా జనని కి.

అసలు నాకు తనలో నచ్చేది ఆ కాన్ఫిడెన్సు. చాలా గొప్పగా అన్ని వండెయ్యగలనూ అని చెప్పుకుంటుంది, వండి ధైర్యం గా బయట వాళ్ళకి పెడుతుంది కూడా.

ఏ మాటకామాటే చెపుకోవాలి, మా జనని పులావ్ బాగా వండుతుంది. కాకపోతే అది ముందు రోజు తను ఇంటికెళ్ళాకా చేసినది అని చెప్పకుండా ఉంటే ఇంకా బాగుంటుంది :)

Thursday, August 4, 2011

పంద్రాగస్టు

వచ్చెస్తోంది పంద్రాగస్టు. ఏమి పంద్రాగస్టో ఏమో,టింగు రంగా మని ఆరోజు భారతీయత ఉట్టిపడే వస్త్ర ధారణ తో వచ్చి షరా మామూలుగా న్యూసులు బ్రేకడం, ఆరోజు ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇదేగా. దిన పత్రిక లలో అయితే ఎన్ని సంవత్సరాల నుండీ చూస్తున్నానో,వంటల సెక్షన్ అంతా "తిరంగా" మయమే. తిరంగా కేకు, తిరంగా హల్వా ఇవి కంపల్సరీ. ఇంకాస్త కొత్తదనం గా ఆలోచించగలిగితే తిరంగా పులిహోర(తింగరి పులిహోర అని నేననుకుంటాను), తిరంగా బూర్లు,పాయాసం..తిరంగా చపాతీలు. అసలు ఆ వంటలు కనిపెట్టిన వాళ్ళని అడగాలనిపిస్తుంది నిజ్ఝం గా మీ ఇంట్లో ఇవన్నీ తింటారా, పైగా పిల్లలు చాలా ఇష్టం గా తింటారు అంటారు కదా, మీ పిల్లలు ఆ పదార్ధాలు తింటున్నప్పుడూ ఓ వీడియో తీసిపెట్టండి అని.

ఇప్పుడు ఓ ముప్ఫై నలభై శాతం మందికి తెలియక పోవచ్చు స్వాతంత్ర్య పోరాటం గురించి, కొన్ని రోజుల తరువాత ఓ ముప్ఫై నలభై శాతం మందికి మాత్రమే తెలుస్తుందేమో.

ఆరోజు కనీసం రాజధాని లో పరేడ్ జరిగినంత సేపైనా ప్రైవేటు ఛానెళ్ళు మిగతా కార్యక్రమాలని ఆపి అది చూపిస్తే బాగుండు. డీడీ లో వస్తుంది గా, ఈ ప్రసారాలు ఆపి వీళ్ళకి నష్టం కలిగించ్గడం ఎందుకు అంటారేమో, చిత్త చాపల్యమండీ(పదం కరక్టేనా), ఆ పక్క ఇష్టమైన రెహ్మానో, ఇళయరాజా పాటలో వస్తోంటే డీడీ లో మన రాష్ట్ర శకటం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడలేని నా లాంటి వాళ్ళుంటారుగా.


ఇన్నేళ్ళలో ఏమి సాధించాము అంటే చాలానే సాధించాము కానీ దురద్రుష్టం ఏమిటి అంటే సాంకేతిక రంగాలలో ఎంత అభివ్రుద్ధి సాధిస్తున్నామో చిన్న చిన్న వాటిల్లో (నైతికత,జవాబు దారీ తనం) పాతాళానికి పడిపోతున్నాము.

అభివ్రుద్ధి సాధించిన సాంకేతికత ని ప్రజలకి ఉపయోగ పడేటట్లు చెయ్యలేకపోతున్నాము. కొన్ని చోట్ల ప్రయోగిస్తే వాడుక తెలియకో,ఆ ఏమవుతుందిలే ఇది పాడవుతే అన్న నిర్లక్ష్యమో కానీ కొన్ని యంత్రాలు నిరుపయోగమవుతున్నాయి.

మా ఊరి రైల్వే స్టేషనులో టచ్ స్క్రీన్ పెట్టారు(రైల్వే సమాచారం కోసమో మరి దేని కోసమో గుర్తు లేదు సరిగ్గా). అది కొన్నాళ్ళకే నిరుపయోగమయ్యి మూల పడింది. పిల్లలు ఏడుస్తోంటే సముదాయించడానికి దాని దగ్గరకి తీసుకెళ్ళి నొక్కించి ఆడిస్తున్న ఒకాయన దగ్గరకి వెళ్ళి ఇంకొక ఆయన(బాధ్యత గల పౌరుడు అనాలేమో)చెప్పాడు,బాబూ ఇది పిల్లలు ఆడుకునేది కాదు అని. రియాక్షను ఊహించుకోగలరు కదా. మన నుండి ఇలాంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తన వల్ల కావచ్చు,మెయింటినెన్సు లేకపోవడం కావచ్చు ఏదైతేనేమి ఎంతో విలువైన ప్రజల ఉపయోగార్ధం పెట్టిన ఓ పరికరం మూల పడింది. ఇప్పటికీ అది మా ఊరి స్టేషను కి అలంకారమే.


ఇక మెటల్ డిటెక్టర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాడులు జరిగిన ముంబై సంగతేమో నేను చూసిన ఓ రెండు మూడు మహా నగరాలలో అయితే చక్కగా స్టేషను లోకి వచ్చే వారికి స్వాగతం పలుకుతూ ఉంటాయి అవి ఏమీ పని చెయ్యకుండా.

ఇక రాజకీయాల గురించి చెప్పేదేముంది,ఇలాంటి వాళ్ళు డబ్బు ప్రభావం వల్లో, ఓటెయ్యని నా లాంటి వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసేసుకునో గెలిచెస్తుంటారు.

అవినీతి అవినీతి అంటాము కానీ, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నేను మొదట ఆలోచించేది ఎవరిని "మేనేజ్" చేస్తే పని అవుతుంది అని. పని త్వరగా అవ్వాలి అంతే నాకు కావాల్సింది,సో, నేనూ నా యధా శక్తి తోడ్పడుతున్నాను ఈ లంచగొండులకి. నాకున్న ఇతర బాధ్యతలు కావచ్చు కారణం మరేదైన కావచ్చు నేను లంచం ఇవ్వకుండా ఓపిక గా వాళ్ళ చుట్టూ తిరగలేను. ఒక వేళ అలా వెళ్తానూ అన్నా కానీ, ఆ ఎందుకమ్మా నీకా ఇబ్బంది అంటారు ఇంట్లో వాళ్ళు. ఫలానా వాళ్ళ కోడలు/అమ్మాయి అలా పడిగాపులు కాస్తే పాపం వాళ్ళకీ ఇబ్బంది అని అర్ధం చేసేసుకుని నేనూ ఊ కొట్టెస్తాను.

ఇప్పటికీ నాకు సియాచిన్ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇంకాస్త డీప్ గా ఆలోచిస్తే నా ప్రవర్తనకి సిగ్గుపడతాను,సగటు పౌరురాలిగా నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించనందుకు. ఇవన్నీ నాకే పరిమితం,ఎవరికి చెప్పినా నవ్వుతారని, భయం ఏంటీ పేట్రియాటిక్ అయిపోతున్నావు అంటారని.

నా లాంటి సగటు భారతీయులు ఏమీ మార్చలేరు. ఇలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ మార్పు రాదు,పదండి అని ఓ నాయకుడు ఉద్రేక పూరిత ప్రసంగం వినగానే మహిళా మణులంతా ఏకమయ్యి మార్పు తెచ్చెయ్యడానికి సినిమా కాదు ఇది, వాస్తవం. మహిళా సంఘాల నాయకురాళ్ళని చూస్తే మహిళ నైనందుకు సిగ్గుపడతాను వాళ్ళ వేషాలు చూసి. ఉదాహరణకి స్టూడియోలకొచ్చి బూతు సినిమా అనో అశ్లీలం అనో చించుకుంటారే కానీ వారి వెనకాలే స్క్రీన్ లో మార్చి మార్చి చూపిస్తున్న ఆ క్లిప్పింగులని ఆపమని ఒక్కరూ చెప్పలేరు.


నిజం చెప్పొద్దూ నాకూ ఆగస్టు పదిహేను అంటే ఓ శలవు మాత్రమే. ముందు రోజు నాకొచ్చిన ఎస్సెమ్మెస్సులని ఓ పది ఇరవై మందికి ఫార్వార్డ్ చేసేసి నలుగురితో పాటూ నేను ఆరోజు కాసేపు భరత మాత ని గుర్తు చేసేసుకుని, లాంగ్ వీకెండు ని ఎంజాయ్ చేసేసి రొటీన్ లో పడిపోతాను.

అంతే కదా, నేను చెయ్యగలిగినది. ఈ సారి ఎన్నికలలో "వీలయితే" ఓటు హక్కు వినియోగించుకుంటాను.

Thursday, February 24, 2011

హైదరాబాదులో మంచి భోజనం ఎక్కడ దొరకును?

మనకి అప్పుడప్పుడు ఏదయినా తిని చాలా రోజులయితే ఆ వంటకం తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా.నేను భోజన ప్రియురాలిని కాబట్టి ఈ కోరికలు కాస్త ఎక్కువన్నమాట.

నాకెందుకో ఈ మధ్య మాంఛి తెలుగు భోజనం తినాలని తెగ కోరిక కలిగింది. ఆఫీసు లంచ్ లు,ఇతర పార్టీలలో ఉత్తర భారతదేశపు వంటలు తినీ తినీ మొహం మొత్తడం కూడా ఒక కారణం. ఇంట్లో రోజూ వంట చేసినా కానీ ఏదో అసంత్రుప్తి.

ఇంటికెళ్ళినప్పుడు అమ్మ అత్తయ్య గారు ఇద్దరూ కూడా నీకేమి కావాలో చెప్పు వండుతాము అన్నా కానీ ఎక్కడయినా బయటే తినాలనిపించింది నాకు.

మాంఛి తెలుగు భోజనం అంటే పెళ్ళికి వెళ్తే సరిపోతుంది కదా అన్నారు మా వారు. సర్లెండి,ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో తెలుగుదనం తగ్గిపోతోంది అంటే ఏమీ కాదు మన ఊర్లో ఇంకా(మా ఊరు ఒక టవును లెండి) అలాంటి కల్చర్ వచ్చుండదు అని మా వారు గాట్ఠిగా వాదించేసరికి సరే,చూదామనుకుకున్నాను.

ఏదయినా పెళ్ళి పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురుచూసాము ఇద్దరమూ. నక్కని తొక్కినట్లు ఓ నాలుగు పెళ్ళి పిలుపు కార్డులు ప్రత్యక్షం ఇంట్లో మరునాడు.ఆహా పెళ్ళి భోజనానికి వెళ్తున్నాను అని సంతోషపడ్డాను.


పెళ్ళి భోజనం అంటే నా మనసులో పడిన ముద్ర ఎలాంటిదంటే,చక్కగా వరుసగా కూర్చున్న వాళ్ళకి దోసావకాయతో వడ్డన మొదలెట్టి పప్పు,దప్పళం ఎక్సెట్రా వంటలతో నిండిన రుచికరమయిన భోజనం,అచ్చగా అవే వంటకాలు కాకపోయినా కానీ.

బుఫే భోజనాల పెళ్ళిళ్ళకి కూడా అట్టెండ్ అయ్యాను. కానీ ఈ తరహా భోజనాలతో విసుగెత్తి ఏమో నాకు ఈ కోరిక కలిగింది.

వెళ్ళిన మొదటి పెళ్ళి అర్ధ రాత్రి ముహుర్తం. రాత్రి ఎనిమిదింటికి వెళ్ళాము. ఇసకేస్తే రాలనంత జనం. అమ్మాయి తండ్రి పేరున్న మనిషిట ఆ ఊరిలో.

కళ్యాణమండపం(ఫంక్షను హాలు) ఎంట్రన్స్ లో అమ్మాయి,అబ్బాయి ది భారీ ఫొటో,కింద చేతులు జోడించి ఆహ్వానిస్తున్న భంగిమ లో అమ్మాయి తల్లి తండ్రులు. ఇంత పెద్ద సైజు ఫోటో ఇప్పటి వరకు మన ఊరిలో ఎవరూ పెట్టలేదు, చాలా ఖర్చయిందిట ఆ ప్రింటింగుకీ అదీ అని చెప్పుకుంటుంటోంటే విన్నాను. రకరకాల పూలు,ఇతరత్రా డెకరేషన్ సామాగ్రితో పెళ్ళి పందిరి ని గ్రాండ్ గా అలంకరించారు. కానీ కొబ్బరాకులు లేవు కదా, మండపం ఎంత గ్రాండ్ గా ఉన్నా కానీ నచ్చలేదు నాకు ఆ పచ్చదనం లేకపోయేసరికి.


అలా కూర్చున్నాము ఓ పక్కగా ఎవరయినా తెలిసిన వారు కనిపిస్తారేమో అని. సడెన్ గా మండం నుండి జనాలు హడావిడిగా పైకి వెళ్ళడం చూస్తే అర్ధమయ్యింది. భోజనాలు రెడీ అని.

రష్ గా ఉంది కదా కాసేపాగి వెళ్దామనుకున్నాము. గంతయినా కానీ ఆ రష్ తగ్గే సూచనలు కనిపించక భోజనాలకి వెళ్ళాము. మేము కూర్చున్నాము,రక రకాల కూరలు,స్వీట్లు వస్తాయే కానీ అన్నం రాదే.. అన్నం అయిపోయింది వండుతున్నారు అని అప్పుడు తెలిసింది.

చేసేదేమీ లేక వడ్డించిన కూరలు రుచి చూసాను ఒక్కొక్కటి గా. నేను ఊహించుకున్న పెళ్ళి భోజనం లాగే లేదసలు. అన్నీ కలగా పులగం కూరలు. ఇంతలో సెగలు కక్కుతూ వేడన్నం పట్టుకొస్తుండటం చూసి ప్రాణం లేచొచ్చింది.

కానీ ఆ సంబరం ఏంతో సేపు నిలవలేదు విస్తట్లో ధబీల్మని పడిన ఉడికీఉడకని అన్నం చూసేసరికి.

మరీ వెంటనే లేచెస్తే బాగోదని అలా కూర్చున్నాను.ఇంతలో కూర్చున్న మా అందరి వెనకాల వచ్చి వరుసగా మనుషులు నిలబడ్డారు,ఎప్పుడు లేస్తారా కూర్చుందామన్నట్లు.

ఒక వరుస మనుషులు లేచీ లేవగానే ఆ టేబిలు మీద పరిచిన పేపరు తీసేసి వెంటనే ఇంకోటి వెయ్యడం,అంతే ఆత్రం తో వెనక నిలబడ్డవాళ్ళు వచ్చి కూర్చోవడం.

చిర్రెత్తుకొచ్చింది నాకు,ఒక పంక్తి పూర్తయ్యేవరకూ కూడా ఆగలేరా అని. పెళ్ళి కొడుకు కూతురిని ఒకసారి కలిసి ఇక వెనుదిరిగాము పెళ్ళివారిచ్చిన పేద్ద రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్టుతో.

బయటకి రాగానే ఎంట్రన్సులో పెట్టిన ఆ ఫోటో మీద శ్రద్ధ, అమ్మాయి తరపు వారు అతిధుల భోజనాలు తదితర ఏర్పాట్ల మీద చూపించుంటే ఎంత బాగుండేది అనిపించింది.

ఎక్కడయినా చిన్న చిన్న లోపాలుంటాయి. చివరి ఒకటి రెండు పంక్తులవారికి అన్నం లేదంటే అర్ధముంది కానీ,కానీ అంత మందిని పిలిచినప్పుడు కనీసం ముప్పావు మందికయినా సరిపడా భోజనం వండిచకపోతే ఎలాగ?

భోజనమే బాలేదంటే నిర్వాహణ అట్టర్ ఫ్లాపు ఈ పెళ్ళిలో.

ఇంకో పెళ్ళికెళ్ళాము,అక్కడ నిర్వాహణ బాగానే ఉంది కానీ, అయ్యో భూతద్దం తేవాల్సింది ఉన్న ఒకటీ రెండూ తెలుగు వంటలని వెతకడానికి అనిపించింది.

ఇక మూడొ పెళ్ళి లోనేమో అన్నీ తెలుగు వంటలే కానీ రీమిక్సులు అన్నమాట. పులిహోర ని వండిన విధానం చూస్తే దేవుడా ఏమి ఈ దుస్థితి మన చక్కటి వంటలకి అనిపించింది.


పెళ్ళి భోజనం మీద ఇంకా మోజు తీరని మా ఆయన ఇక రెస్టారెంట్ల మీద దాడి మొదలెట్టారు హైదరాబాదు మా అక్క ఇంటికి వచ్చి.తను ఇంట్లో వండుతాను ఆన్నా సరే వద్దు నాకు "మంచి భోజనం" కావాలి అని ఒకటే గొడవ.

మంచి భోజనం కి నిర్వచనం మాత్రం అడక్కండి ఆది ఆయనకే తెలియాలి.

ఈ గోల పడలేక అక్క వాళ్ళు ఒక రెస్టారెంటు కి తీసుకెళ్ళారు.అక్కడ ఆంధ్రా భోజనం ఒకటి ఆర్డర్ ఇచ్చాము.

అరిటాకులో పెట్టినంత మాత్రాన అది ఆంధ్రా భోజనం అవుతుందేమిటి రుచీ పచీ లేకపోతే.

ఇంకో రెండు మూడు రెస్టారెంట్లలో ప్రయత్నించాము. సోనియా కి తానేంటొ నిరూపించుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల
కంటే ఎక్కువే చేసామంటే నమ్మండి.

ఇంతలో మా లక్ష్మి అత్తయ్య ఫోను భోజనానికి రండి ఊళ్ళోకి వచ్చారు కదా అని.

సరే అని మరునాడు వెళ్ళాము.ఆహా స్వర్గం చూసామంటే నమ్మండి ఆరోజు.వయసు మీద పడ్దా కానీ మాకోసం అత్తయ్య శ్రమ పడి చేసిన కందా బచ్చలి కూర,మామిడి కొబ్బరి పచ్చడి,ముక్కల పులుసు,బచ్చలి కూర పప్పు,ఊర మిరపకాయలు,అత్తయ్య ట్రేడు మార్కు తొక్కుడు పచ్చడి,ఇతర ఊరగాయలు మాంఛి పెరుగు.

మొత్తానికి ఈ భోజనం తినగానే మా వారి మంచి భోజనం కోరిక తీరింది.(నా కోరిక కూడా లెండి)


అప్పుడు ఙానోదయమయ్యింది నాకు,నేను కోరుకున్న తరహా భోజనం బయట దొరకట్లేదని ఈ మధ్య.

హైదరాబాదు బ్లాగర్లూ కాస్త రుచికరమయిన ఆంధ్రా(తెలుగు) భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి.

Friday, February 18, 2011

కాస్త నీటు గా ఉండచ్చు కదా...
కట్టూ బొట్టూ లో "ఫ్యూజన్" విధానాన్ని పాటిస్తూ చూసే వాళ్ళని కన్ ఫ్యూజన్ కి గురిచేస్తూ ఉండే ఆడవాళ్ళ గురించి ఇది.

చాలా మంది ఆడవాళ్ళు ఎందుకో తమని తాము నీట్ గా ప్రజెంట్ చేసుకోవడానికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు. ఎంత సేపూ ఆఫీసులో పని చేసామా బాసు మెప్పు పొందామా లేదా,ప్రమోషన్ ఎప్పుడు ఇవే ఆలోచనలు. కాస్త నీట్ గా ఉందాము అన్న స్పృహే ఉండదెందుకో.

నీట్ అంటే మోడర్న్ గా సగం సగం బట్టలో నూడుల్ స్ట్రాప్ టాప్సో వేసుకోమని కాదు. వేసుకున్న బట్ట ఏదయినా నీట్ గా వేసుకోవచ్చు కదా. చాలా మంది ఆడవాళ్ళని చూసాను ఆఫీసుకి ఎందుకొచ్చామా దేవుడా అన్న మొహం పెట్టుకుని వస్తారు, అస్సలు వీళ్ల మొహం లో చిరునవ్వే ఉండదు. తాము లేకపోతే ఆఫీసు తలకిందులయిపోతుంది అని బలం గా విశ్వసిస్తారు వీళ్ళు.

ఆఫీసుకి వస్తున్నాము నలుగురితో ఉన్నాము కాబట్టి గుడ్డిగా అనుకరించెస్తారు అన్నింటినీ.. వీళ్ళ పాత వాసనలు వదులుకోలేరు,అలాగే పూర్తిగా కొత్తదనానికి అలవాటు పడలేక సతమత మయ్యే స్త్రీలని చూస్తే నవ్వొస్తుంది నాకు.

ప్రస్తుతం హెయిర్ రీబోండింగ్ హవా నడుస్తోంది కాబట్టి తామూ ఓ పార్లర్ కి వెళ్ళి నిట్ట నిలువుగా 90 డిగ్రీలలో తమ జుట్టు ని చీపురు పుల్లల లాగ సాగదీయించుకుని వచ్చెస్తారు.

అది తమకి నప్పిందా నప్పలేదా అని కాదు లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అయ్యామా లేదా ఇదే వీళ్ళ ఫిలాసఫీ.

ఓ వారం పది రోజులు జుట్టు ని అలా విరబోసుకుని సుతారం గా మధ్య మధ్య లో వెనక్కి తోసుకుంటూ(వీళ్ళకి ఆ సున్నిత మయిన మేనరిజం నప్పకపోయినా సరే) జనాలని చావగొట్తెస్తుంటారు. ఆ తరువాత చిన్న చిన్న గా కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. ఇక అప్పుడు చూడాలి అందాన్ని.పార్లర్ మాట అటుంచితే కనీసం ఇంట్లొ చేసుకోగలిగే పరికరాలతో కూడా ఆ కొత్త జుట్టు ని స్ట్రెయిట్ చేసుకోరు. మెల్లిగా కొత్త గా వచ్చే వెంట్రుకల సంఖ్య పెరగడమో చేయించుకున్న స్ట్రెయిటనింగ్ పోవడమో జరుగుతుంది.

ఆ అందాన్ని చూసేకన్న కలగాపులగం గా ఉండే జానా రెడ్డి గారి ప్రసంగం వినడం మేలు.

ఈ జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ ఏమో కానీ చూడలేక చస్తున్నా నేను చాలా మందిని. చక్కగా పొడుగు జుట్టున్న వాళ్ళు కూడా అలా దెయ్యాలా వదిలేయడం,నల్లగా నిగ నిగ లాడే ఆ జుట్టు మధ్యలో ఓ మాంఛి జిగేల్ మనే క్లిప్పు.

ఇక బట్టల విషయానికొస్తే రోం లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండమన్నారని "దేశీ రోమన్" అవతారం ఎత్తుతారు చాలా మంది "లత" ల్లాగ ఉండే వనితలు వేసుకునే బట్టలని "మాను"ల్లా ఉండే తామూ వేసుకోవాలని పడే తాపత్రయంచూసి తీరాల్సిందే.

ఆ బట్టలు వేసుకున్నప్పుడు పోనీ దానికి తగ్గ యాక్సరరీస్ వేసుకుంటారా అంటే అదీ లేదు. బట్టల వరకే కాపీ. మిగతావి కొనుక్కోవాలంటే మనసొప్పదు.

టైటు లెగ్గింగ్,పైన ఓ స్టైలిష్ టాపు వేసుకుంటారు కానీ చెవులకి సేం ఓల్డ్ జూకాలు,కాళ్ళకి బండ పట్టీలు మాత్రం ఉండాల్సిందే.

బీడు భూముల్లా ఉండే పాదాలని కనీసం కవర్ చేసుకునే పాదరక్షలు కూడా వేసుకోరు.

తెలుగు స్త్రీలం చాలా మంది ఎక్కువగా పాదరక్షల మీద ఖర్చు పెట్టము. పెట్టాలి అని రూల్ కూడా లేదు.కానీ బట్టలకి సరిపోయే పాదరక్షలు వేసుకోవాలి కదా.ఉన్న రెండు మూడు జతలే అన్నింటి మీదకీ సరిపోయేవి కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. ఇలా చూసే వాళ్ళ కళ్ళని ఇబ్బంది పెట్టేబదులు తమ "బ్రాండు" డ్రెస్సింగుతో.

పోనీ వేసుకునే చూడీదార్లయినా మంచివి వేసుకొస్తారా అంటే అదీ లేదు. బబ్లింగ్ వచ్చినా సరే అవి వాడాల్సిందే ఆఫీసుకి. ఇలా ఉండే వాళ్ళెవరూ కొనుక్కోలేని వాళ్ళు కాదు. డబ్బులు వెనకెయ్యాలి ఇదే వాళ్ళ జీవిత ధ్యేయం.

ఇక మేకప్ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాస్త కాంపాక్ట్ పౌడర్ వేసుకుని రెండంగుళాళ మందాన మూతికి రంగు పూసుకుని మేకప్ అయ్యిందనిపించేవాళ్ళు కోకొల్లలు.

పోనీ ఆ మేకప్ చివరి వరకూ నిలుస్తుందా అంటే అదీ లేదు. పదకొండయ్యేసరికి చెదిరిపోతుమంది. ఆఫీసుకి పొద్దున్న వెళ్ళామంటే ఇంకంతే,మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళేవరకు మొహం చూసుకోరు. లకలక జ్యొతిక లా ఉన్నా సరే అలా చెదిరి పోయిన జుట్టుతోనే మీటింగులకొచ్చి మీటింగు ని క్షణ కాలం స్తంభింప చేసే చాతుర్యం వీళ్లకే సొంతం.

ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతుండదు కానీ ఇలాంటి వాళ్ళని మీరూ చూసి ఉంటే చెప్పండి మరి.

Wednesday, January 26, 2011

నాకు నచ్చిన (వంటల) పుస్తకం
ఈ మధ్య ఒక బ్లాగులో కుక్కర్ మూత తియ్యడం ఎలా అని చదివి నవ్వుకున్నా కానీ వంట నేర్చుకునే కొత్తలో అన్నీ సందేహాలే.

నేను నాలుగో తరగతి లో ఉన్నప్పుడనుకుంటా అమ్మ "వంటలు-పిండి వంటలు" అనే పుస్తకం కొంది మాలతీ చందూర్ గారిది.

కొన్నేళ్ళకి అది శిధిలావస్థ కి చేరుకుంటే దానిని బైండు చేసి మరీ భద్ర పరిచింది. నేను పెద్దయ్యాకా ఈ పుస్తకాన్ని చూసినప్పుడల్లా విసుక్కునే దానిని. బైండింగు కూడా చిరిగిపోతున్న ఈ వంటల పుస్తకం అవసరమా అమ్మా, బయట బోలెడు దొరుకుతాయి అనేదానిని. అయినా అమ్మ మాత్రం పారెయ్య లేదు సరి కదా పెళ్ళయ్యిన ఓ రెండు నెలలకి నన్ను చూడటానికొచ్చి నాకిచ్చింది దానిని.

అబ్బా..ఇక్కడ కూడానా ఇది అని విసుక్కుని మూల పడేసాను. నెట్ లో బోలెడు సైట్లు, రోజూ పేపర్లలో వంటల కాలంస్, టీవీ లలో పక్కింటి ఎదురింటి వంటల కార్య క్రమాలు ఇన్ని ఉండగా అది నా కంటికి ఆనలేదసలు.

నాకసలే వంట రాదు పెళ్లయిన కొత్తలో. నా పాత పోస్టు లలో నా వంటతంటాలు చూడండి.

ఒక శుభ సమయాన దోశలు మొదలెట్టాను. ఆరోజే పేపర్ లో చూసిన "పేపర్ దోశ" రెసిపీ ఇచ్చారు. అన్నీ సరిగ్గానే వేసాను, పిండి రుబ్బాను అయినా దోశ రాదే. మా వారు చూసి ముందర మామూలు దోశ నేర్చుకో తరువాత మిగతావి అనేసరికి మామూలు దోశ రెసిపీ నెట్ లో చూసి మరలా మొదలెట్టాను, సేం ప్రాబ్లం.


పిండి సరిగ్గా రుబ్బానా అని ఒక డవుటు. రెండో సారి ఇంకో సైట్లో చూసి కాస్త కొలత మార్చి ట్రై చేసినా సేం రిజల్ట్. మన సినిమా వాళ్ళు అసలు బేసిక్ కధ ని మర్చి పోయి హింస,కామెడీ పాళ్ళు పెంచినా సినిమా హిట్టవ్వలేదెందుకబ్బా అని ఆలోచిస్తారే అలాగే నేనూ "ఇంటికి ఏమి కప్పు వెయ్యాలా అని దీర్ఘం గా ఆలోచించే రామయ్య" లాగ ఆలోచన మొదలెట్టాను.ఎక్కడా పొరపాటు కనపడట్లేదు.

చివరాఖరుకి అమ్మ ఇచ్చిన మాలతీ చందూర్ గారి పుస్తకం తీసా. అందులో ఆవిడ ఎంత వివరం గా చెప్పారంటే పోపు వెయ్యాలంటే ఏ పప్పు ముందు వెయ్యాలి దగ్గర నుండీ విడమరచి చెప్పారు. పోపెయ్యడం కూడా చెప్పాలా అని మొదట్లొ అనిపించేది కానీ ఆ చిన్న చిన్న మెళకువలు తెలీకే బామ్మ/అమ్మమ్మ చేసే కూర ల లాగ నావి రావు అని తెలుసుకున్నాను.

ఇంతకీ మరలా దోసల విషయానికొస్తే, నేనెక్కడ తప్పు చేస్తున్ననో నాకు తెలిసిపోయింది.హీహీ..అసలు పెనం వేడెక్కకుండా ఇలా స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం లో గరిట తో పిండి దాని మీద గుమ్మరిస్తే అతుక్కోక ఏమవుతుంది?

దోసలే కాదు ఇంకా ఎన్నో రకాల వంటలలో చిన్న చిన్న కిటుకులు నేర్చుకున్నాను ఈ పుస్తకం ద్వారా. ఇప్పటి వంట రచయిత్రులలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప అంత విడమరచి చెప్పగా చూడలేదు. Really those smaal small tricks make lot of difference to the out come.

పైగా నా దగ్గర ఉన్న పుస్తకం మిక్సీ లూ గ్యాస్ స్టవ్ లూ ఇంకా మన జీవితాలలోకి రానప్పుడు రాసిన పుస్తకం మూలాన ఆవిడ తన వంటలు వివరిస్తూ "మదరాసు లో కొంతమంది మిక్సీ లో రుబ్బుకుంటారనో", "గ్యాసు పొయ్యి మీద పెడతారనో" రాసిన వాక్యాలు చదివితే అప్పటి కాలం అలా కళ్ల ముందు మెదులుతుంది నేను చూడక పోయినా కానీ.

మాలతీ చందూర్ గారి పుస్తకం లో అన్నీ ఎంత విడమరచి ఉంటాయంటే కొన్ని కిటుకులు ఇప్పటి బుక్స్,సైట్లలో వంటల రచయిత్రులు అసలు చెప్పారు. అన్నీ వేసి కలిపేసి మిక్సీ పట్టెయ్యండనో, వేయించెయ్యండనో చెపుతారు. నా లాగ వంటలలో ఓనమాలు నేర్చుకునే వారికి మాత్రం మాలతీ చందూర్ గారి పుస్తకమే బాగుంటుంది.

ఉదాహరణ కి బెల్లం పరమాన్నం చెయ్యాలంటే అన్నం పాలు ఉడికాకా బెల్లం వెయ్యాలి అంటే నేను మొదట్లో స్టవ్ ఆపకుండా బెల్లం వేసేసే దానిని. ఒకటి రెండు సార్లు విరిగిపోయిన పరవాన్నం చేస్తే కానీ కిటుకు తెలీలేదు.

ఇప్పుడు ఆవిడ పేరుతో వచ్చిన బుక్స్ కొన్ని కొన్నాను ఎగ్జిబిషన్ లలో అక్కడా కానీ ఆవిడ రాసినట్లే లేవసలు. అన్నీ కట్టే కొట్టే తెచ్చే తీరే.

Thursday, January 13, 2011

ప్ప్చ్చ్హ్..అనుకుని ఏమి లాభం

మొన్ననే ఇంటి నుండి వచ్చాను. ఈ సారి ట్రిప్ లో నాన్నగారి అనారోగ్యం వల్ల అందరినీ కలవలేకపోయాను.

అలా కలవలేకపోయిన వాళ్ళల్లో అమ్మ మేనమామలు కూడా ఉన్నారు. అవడానికి అమ్మ మేనమామలు అయినా కానీ మాకు చిన్నపటినుండీ బాగా అలవాటు బామ్మలు ,తాతయ్యలుగా. అమ్మ పుట్టింటివారంటే మొదట గుర్తొచ్చేది వాళ్ళే మాకు. అంత అలవాటు.

పాపం ఎంత అభిమానం చూపించేవారో మేమంటే.విద్యుత్ శాఖ లో లైన్మెన్ గా పని చేసే ఇద్దరు తాతయ్యలు,నర్సరీ చూసుకునే ఇంకో తాతయ్య మేమంటే అభిమానం కురిపించేవాళ్ళు,మా "లలిత" కూతుళ్ళని కనపడ్డవాళ్ళకి చెప్తూ అలా సైకిలు మీద తిప్పేవారు.

పాపం చిన్న ఉద్యోగం,పెద్ద సంసారమయినా కానీ మేమెళ్తే మాత్రం ఆ లోటు కనపడనిచ్చేవాళ్ళు కాదు. పాపం ఈ పిల్లలు కూరా,పప్పు లేనిదే తినలేరంటూ వాళ్ళకి వీలయినంతలోనే అన్నీ అమర్చేవారు.చిన్నప్పుడు ఈ ఉద్యోగ అంతరాలు,సమస్యలు అవీ తెలీవు కదా. నాన్నగారి లాగే వీళ్ళూ ఉద్యోగం చేస్తున్నా కానీ వీళ్ళింట్లో మన లాగ అన్నీ ఉండవెందుకో అనిపించేది.మేమెళ్తే తప్పనిసరిగా మాకిష్టమని కరకజ్జం తెప్పించేవారు.


మధ్యాహ్నం భోజనం లోకి మామిడిపళ్ళు,భోజనమయ్యాకా పుల్ల ఐసు ఫ్రూటు,నాలుగింటి వేళ వేడి వేడి జిలేబీ,పార్కుకెళ్తే పిడత కింది పప్పు ఉండాల్సిందే.

ఇదే మెనూ ఎన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా సాగిందో చెప్పలేను.భోజనాల వేళయ్యేసరికి రూప బామ్మో,శేషు బామ్మో ప్రత్యేకం గా పట్టించిన పప్పు నూనే వేసి కలిపే కొత్తావకయి,మాగాయ రుచి ఇంకా గుర్తే ఇప్పటికీ.

రాత్రయ్యేసరికి ఆరు బయట మంచాలేసుకునేటప్పుడు చిన్న మడత మంచం కోసం పిల్లల పోట్లాట, రోజుకొకళ్ళు చొప్పున పడుకునేటట్లు దక్షుడు తాతయ్య తీర్పు చెప్పడం, మరునాడు పొద్దున్నే అమ్మమ్మ కొట్టే నీళ్ళ బోరింగు శబ్దానికి విసుక్కుంటూ నిద్ర లేచి తయారయ్యి అరుగు మీద అష్టా చెమ్మాలు ఆడుకోవడం, మధ్య మధ్యలో బొమ్మరిల్లో,బాలజ్యోతో చదువుకోవడం ఎలా మర్చిపోతాము ఆ బాల్య మధుర స్మృతులన్నీ.

మెల్లిగా పిల్లలందరమూ పెద్దవాళ్ళయ్యి చదువులతో బిజీ అయ్యాము.ఆ తరువాత ఉద్యోగాల బిజీ,ఆ తరువాత పెళ్ళిళ్ళు,సంసారాలలో పడి అందరమూ ఒకసారి కలవడమే అవ్వలేదసలు. అమ్మ వాళ్ళూరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ తాతయ్యలని తప్పక కలుస్తాను. ఈ సారి అమ్మ వాళ్ళ ఊరూ వెళ్ళలేదు,వాళ్ళనీ కలవలేదు.

ఓ నాలుగు రోజుల క్రితం అమ్మ చెప్పింది రాజు తాతయ్య ని హాస్పిటల్లో జాయిన్ చేసారని. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోను చేసాను. నేనేదో పని మీద ఊరికి వెళ్తున్నా,రాత్రికి చెయ్యి,అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేసారు కంగారు ఏమీలేదు అన్నాడు. ఆరోజు రాత్రి చేద్దామనిపించి కూడా చెయ్యలేదు.ఆ,ఇంకా రెండు రోజులలో సంక్రాంతి ఉంది కదా,అప్పుడు మాట్లాడచ్చులే అని.


ఈరోజు పొద్దున్నే అమ్మకి చేస్తే తెలిసింది రాజు తాతయ్య ఇక లేడని. దుఖం ఆగలేదు నాకు. చిన్ననాటి ఙాపకాలన్నీ అలా కళ్ళముందు కదలాడాయి. ఛా! మొన్నే ఫోను చేసుంటే ఎంత బాగుండేది ఒక్కసారి మాట్లాడేదానిని అని ఎన్ని సార్లనిపించిందో. తాతయ్యది చిన్న వయసు కాదు,ఇదంతా జీవిత చక్రం లో భాగమే..కానీ మనసు అలా భారం గానే ఉంది పొద్దున నుండీ.


బయటకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సు నచ్చితే ఠక్కున కొనుక్కుంటాము. అదే ఒక్క ఫోను చెయ్యడానికి ఒకోసారి ఆలోచిస్తాము,ఆ రేపో ఎల్లుండో చెయ్యచ్చులే అని.

అప్పటివరకు ఈ పండుటాకులు ఉండొద్దూ. ఈరోజే ఒక పాఠం నేర్చుకున్నా నేను.వారానికి ఒకసారయినా తాతయ్యలు, అమ్మమ్మలని పలకరించాలని.కనీసం అప్పుడయినా అయ్యో మాట్లాడలేకపోయానే అన్న బాధ నుండయినా ఉపశమనం.

(మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న మా "రాజు" తాతయ్య కోసం ఈ టపా.)