Friday, October 15, 2010

మీరూ ఇలాగే మొహమాట పెడతారా?

ఒకరోజు ఆఫీసులో ఉండగా ఫోను. ఎవరా అని చూస్తే,మా అబ్బాయి క్లాస్మేటు వాళ్ళ అమ్మ. వాళ్ళ చిన్నబ్బాయికి భోగిపళ్ళు పోస్తున్నారు,సాయంత్రం పేరంటానికి రమ్మని పిలుపు.

సాధారణం గా నేను ఇలాంటి వాటికి చాలా తక్కువ వెళ్తాను,ఒక వేళ వెళ్ళినా, కూర్చున్నా అన్న పేరు కి కూర్చుని తాంబూలం తీసుకు వచ్చెస్తాను.ఎన్నింటికండీ అని అడిగాను,సాయంకాలం ఐదున్నరకి అంది. అయ్యో రాలేనండీ అప్పుడంటే అన్నాను,మానెయ్యొచ్చని. ఏమీ ఫరవాలేదు,మీరు ఆఫీసు నుండి తిన్నగా మా ఇంటికి వచ్చెయ్యండి,భోజనం కూడా మా ఇంట్లొనే అందావిడ. భోజనాలవీ వద్దు కానీ ఓసారి వచ్చి వెళ్తాను అన్నాను. అలా కుదరదు,ఎప్పుడూ రారు మీరు,ఏదో తెలుసున్న ఓ నలుగురిని పిలిచాను ఫ్యామిలీ లతో సహా భోజనాలకి,మీరందరూ రావాల్సిందే అనడంతో సరే అనక తపలేదు.

మా ఆయనకి ఫోను చేసి చెప్పగానే,పేరంటానికి నేనేమిటి అని ఇంతెత్తున లేచారు. అదేమీ పేరంటము కాదు,చిన్న గెట్ టుగెదర్ అంతే,అలా వెళ్ళి ఇలా భోజనం చేసి వచ్చెద్దాము,పైగా మనము వెళ్ళేటప్పటికి భోగిపళ్ళ కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది అని చెప్పి ఓ పావుగంట బ్రతిమాలి,బామాలినా కానీ వప్పించలేకపోయాను.

సరే, సాయంత్రం త్వరగా వెళ్ళాలి,లేటయితే బాగోదనుకున్నాను.కానీ తానొకటి తలచిన.......కదా.ఆరోజు ఆఫీసులో లేటయిపోయింది.డైరెక్టు గా వెళ్దామా అని ఒక్క నిమిషం ఆలోచించి,ఛీ ఇలా వెళ్తే బాగొదని ఇంటికి వెళ్ళి,ఎదురుగా కనపడిన ఓ కాటన్ డ్రెస్ వేసుకుని బయలుదేరుతూ యధాలాపం గా అడిగాను,రాకూడదూ అని మా వారిని. సరే అని బట్టలు మార్చుకోవడానికి లేవబోతోంటే,ఏమీ అక్కర్లేదు,అక్కడ అందరూ వెళ్ళిపోయి ఉంటారీపాటికి అని మా ఆయనని అలా షార్ట్స్,టీషర్ట్ లోనే లాక్కెళ్ళాను.

వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఏముంది,అక్కడ అసలు ఇంకా కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలయ్యే సూచనలే లేవు. వాళ్ళ ఇల్లంతా ధగధగలాడే బట్టలు,నగలు ధరించిన ఆడవాళ్ళతో మెరిసిపోతోంది.అంతే,మా వారు నా వైపు చూసిన చూపుకి కానీ పవరుండుంటే.....

గబుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న మా ఆయనని చూసిన హోస్టు అయ్యో ఏమిటండీ వెళ్ళిపోతున్నారు,ఆగండి అని చెప్పి లోపలకి వెళ్ళి వాళ్ళాయనని పంపింది బయటకి.వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పరిచయం లేదు,ఇద్దరూ హాయ్ అని పలకరించుకుని,మగవారి
రొటీన్ క్వశ్చనేర్ లో ప్రశ్నలు(ఎక్కడ పని చేస్తారు,మీ క్లైంటు ఎవరు)
వేసుకుని, ఇక అంతే మాటల్లేవు.నేను మా ఆయనకి కంపెనీ ఇద్దామని బయటే ఉండిపోతే,అదేమిటి మీరు లోపలకి రండి అని లాక్కెళ్ళిపోయింది.అంతే,సినిమాలలో హీరోయిన్ని లాక్కెళ్ళిపోతొంటే నిస్సహాయం గా చూసే హీరోయిన్ చూపు లా ఓ చూపు మా ఆయన వైపు చూసి లోపలకి వెళ్ళాను.

లోపల అందర్నీ చూసి ఓ సారి నా డ్రెస్ వైపు చూసుకున్నాను.ఆడవాళ్లందరూ ఒక వైపు చేరి నగలు,బట్టలు,పిల్లల చదువులు అన్నీ కలగాపులగం గా మాట్లాడేసుకుంటున్నారు.ఓ మూల ఆఫీసు నుండి డైరెక్ట్ గా ఇటే వచ్చేసిన ఓ క్యాండేటు కనపడేసరికి హమ్మయ్యా,నా అవతారం లో ఉన్న ఇంకో క్యాండేటు ఉంది లే అని ఆవిడ పక్కన వెళ్ళి కూలపడ్దాను.

ఓ పక్క,ఈ పార్టీ హోస్టు మీద పీకల దాకా కోపం వచ్చెస్తోంది,ఇంత పెద్ద పేరంటం అని చెప్పనే లేదు పైగా ఇక్కడెవరూ మగవాళ్ళు వచ్చిన దాఖలాలు కూడా లేవు.మెడలో కొత్తగా కొనుక్కున్న నెక్లస్ సెట్టు,ఏదో బ్రదర్స్ లో కొన్న డిజైనర్ చీర కట్టుకుని హడావిడీగా తిరుగుతున్న హోస్టు ని పట్టుకుని మెల్లిగా అడిగా,ఏమిటండీ ఫ్యామిలీ తో రమ్మన్నారు,పైగా ఐదున్నరకే అన్నారు అని.అయ్యో,అదా,మొదట ఓ ముగ్గురు నలుగురినే పిలిచానండీ,మళ్ళీ ఒకళ్ళని పిలిచి ఇంకోళ్ళని మానెస్తే బాగోదని అందరినీ పిలిచేసాను.అయినా మీ ఆయనకి మా వారి కంపెనీ ఉంటుంది కదా అని మీకు మళ్ళీ చెప్పలేదు అందరూ వస్తున్నారని.అయినా ఏమయ్యిందండిప్పుడు,ఎప్పుడూ మా ఇంటికి రారు మీరిద్దరూ ,మీ వారికి మా ఆయన కంపెనీ ఇస్తారు లెం డి అని సింపుల్ గా చెప్పి,అమ్మా కుక్కరు కట్టేసావా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

నాకు ఎవ్వరూ తెలీదు,లాభం లేదని నా పక్కనున్నావిడతో మాటలు కలిపాను.ఇంత భారీ ఎత్తున చేస్తున్నారని తెలీదండీ,ఆఫీసు నుండి వచ్చెయ్యండి ఫరవాలేదంటే వచ్చేసాను అని ఆవిడ అనేసరికి,హ్హ్మ్,అందరూ ఇలాగే ఫీల్ అవుతారన్నమాట అనుకున్నాను.


మరలా ఓ పది నిమిషాలకి అతి కష్టం మీద హోస్టు ని దొరక పుచ్చుకుని చెప్పాను,మా ఆయన ఇంటికి వెళ్తారండీ నేనుండిపోతాను అని.అబ్బే,అక్కర్లేదు ఇదిగో మొదలెట్టెస్తాము ఇంకో పావుగంటలో అంది.నేను మధ్య మధ్య లో అలా బయటకి తొంగి చూసి,బాల్కనీ లో ఫోను తో కాలక్షేపం చేస్తున్న మా ఆయన వాడి వేడి చూపులు తట్టుకోలేక గబుక్కున లోపలకి వచ్చేసా.

నాకూ నా పక్కనున్నావిడకీ పరిచయం లేకపోవడంతో పెద్ద గా మాట్లాడుకోవడానికి కూడా మాటల్లేవు. సరే అని నా పక్కన కూర్చున్న బ్యాచ్ ఆడవాళ్ళ మాటలమీద నా చెవి పడేసా.


ఏమిటీ మొన్న మీరు ఫలానా వాళ్ళ అబ్బాయి బర్త్ డే ఫంక్షన్ కి రాలేదా అని ఒకావిడ అడిగితే, మా అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూలు కదా,ఏదో ప్రాజెక్టు చెయ్యల్సి వచ్చి ఇంట్లో ఉండిపోయాను,కానీ రిటర్న్ గిఫ్ట్స్ బాగున్నాయిట కదా అని వాళ్ళబ్బాయి స్కూలు గురించి దర్పం ఒలకబోస్తూ ఆరాతీసింది అవతలావిడ.

ఆన్,నా మొహం పెద్ద గొప్పగా ఏమీ లేవండీ,ఫలానా స్టోర్లో ఇయర్ ఎండ్ సేల్ లో కొందిట.ఒకోటీ 2-3 డాలార్లు పడిందిట అంతే అని ఈవిడ జవాబు.


ఇలాంటి పేరంటం పదనిసలు చాలా ఉన్నాయి,అవి మళ్ళా రాస్తాను.మొత్తానికి రాత్రి ఎనిమిదిన్నర కి కార్యక్రమం మొదల్లయ్యింది. ఆ హడావిడి,చుట్టూ మూగిన పిల్లలని చూసి భోగిపళ్ళ పెళ్ళికొడుకు ఏడుపు లంకిచ్చుకున్నాడు.


ఆ హై పిచ్ రెహ్మాన్ వింటే ఈ పిల్లాడిని తప్పక తన ట్రూప్ లో పెట్టుకుంటాడనిపించింది,తనతో పాటు "జయహో" అనో "వందేమాతరం" అనో అరిచి గీ పెట్టడానికి.

మొదట ఆ అబ్బాయి అమ్మ నాన్న భోగి పళ్ళు పోసారు. తరువాత మా ఆయనని పిలిచారు,అబ్బే మీరంతా కానీండి ముందు,తను ఉంది కదా అక్కడ అని చెప్పి బయట కి వెళ్ళిపోయారు.

ఒకోళ్ళూ కాసిని పండ్లు వాడి మీద పోస్తుంటే ఓపిక గా వాళ్ళాయన ఫొటోలు తీసారు.

హమ్మయ్యా,కార్యక్రమ అయ్యింది ఇంక భోజనాలు చేసి బయలుదేరదామనుకుంటోంటే,హోస్టు నా దగ్గరకి వచ్చి,మీ వారు అసలు పిల్లాడిని చూడలేదు,అక్షింతలు వెయ్యలేదుకదా,లోపలకి రమ్మనండి అనగానే నా గుండె గుభేల్ మంది. మా వారిని ఆ అవతారం లో ఇంత మంది ముందు కి రమ్మనడమే అని.అలా ఏమీ అనుకోరండీ,అన్నా కానీ వినిపించుకోకుండా,బయటకి వెళ్ళి ఆయనని లోపలకి రమ్మని బలవంతం పెట్తడంతో ఓ వెర్రి నవ్వు నవ్వుకుంటూ మా ఆయన లోపలకి వచ్చి అక్షింతలేసి వెళ్ళబోతోంటే,ఆగండి అని,ఏమండీ ఇక్కడ ఓ ఫొటూ తియ్యండి అని ఓ అరుపు అరిచింది.


వాళ్ళాయన కెమేరా తీసుకుని రావడం,ఫోటో తీద్దామని క్లిక్ చెయ్యగానే బ్యాటరీ డవున్ అయ్యింది.మా ఆయన పిల్లాడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోబోతోంటే ఆపి,ఆగండి స్పేర్ బ్యాటరీ తెస్తాను అని లోపలకి వెళ్ళిన మనిషి ఐదు నిమిషాలయినా రాడే బయటకి.

అంత మంది ఆడవాళ్ళ ముందు మా ఆయన ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోకుండా ఫోటో తియ్యల్సిందే అని పట్టుబట్టిన ఆవిడ పట్టుదల కి పిచ్చి కోపం వచ్చింది నాకు.

మొత్తానికి భోజనాల టైమయ్యింది.నేను ఎలాగో లోపల గబగబా తినేసి అయ్యిందననిపించి జారుకుందాము అనుకుంటోంటే,ఆయో మీ వారు సరిగ్గ తినట్లేదండీ,కాస్త మీరు దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసరికి నా కోపం ఇంకా పెరిగిపోయింది. అది కాదు అని నేను ఆవిడకి ఏదో చెప్ప బోతూ ఆగిపోయాను,మా వారు నాకు ఇంకొక బొబ్బట్టు కావాలండీ అని అడిగేసరికి.నేను తెచ్చి వేస్తోంటే చెప్పారు,ఆవిడ ఏది చెప్పినా ఓకే అనెయ్యి,ఇందాకా కెమేరా ఎపిసోడ్ చూసావు కదా అనేసరికి పాపం జాలేసింది నాకు.

మొత్తానికి అలా భోజనం చేసి రాత్రి పదింటికి ఇంటికి వచ్చామన్నమాట.

ఇందులో నా తప్పెంటి చెప్పండి?ఆవిడేమో అందరూ ఫ్యామిలీ తో వస్తున్నారు,అంటేనే కదా నేను వీళ్ళని వెంటబెట్టుకెళ్ళింది!!ఇంక అంతే,ఆ దెబ్బకి ఎక్కడకీ గెట్ టుగెదర్ అంటే రారు,నాకు మాత్రమే తెలుసున్నవాళ్ళు పిలిచినవి.మొన్నటికి మొన్న మా కొలీగ్ ఇంటి గ్రుహ ప్రవేశం అంటే కూడా రాలేదు,నువ్వెళ్ళొచ్చేయి,అక్కడ నాకెవ్వరూ తెలీదు కదా అని రాలేదు.

ఆరోజు ఆవిడ పెట్టిన మొహమాటం మా వారి మనసులో అలా చెరగని ముద్ర వేసేసింది.