Monday, September 27, 2010

అతిధులు ముందే వచ్చిన వేళ

మొత్తానికి మేము మా ఇంటికి వచ్చేసాము. మొదటి రోజు వంట మొదలెట్టాను.చక్కగా బియ్యం కడిగి కొలత ప్రకారం నీళ్ళు పోసి,పప్పు లో కూడా కొలత ప్రకారం నీళ్ళు పోసి తళతళళాడే కొత్త ప్రెస్టీజ్ కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించా.

ఆరోజే కొత్తగా పనమ్మాయి వచ్చింది. కుక్కర్ పెట్టి బట్టలు వేసాను ఉతకడానికి.అమ్మాయి బట్టలు ఉతకడం అయిపోయింది కానీ కుక్కర్ కూత పెట్టట్లేదు.ఏదో తేడా అనిపించింది. ఇంతలో ఇంటిలోకొచ్చిన మా వారు నీళ్ళు పోసావా కుక్కర్ లో అన్నారు.హా...అన్నం లో పప్పు లో మర్చిపోకుండా పోసా కానీ కుక్కర్ లో పొయ్యలేదు.అలా మొదలయ్యింది నా మొదటి వంట పెళ్ళయ్యాకా.

నాకు వంట రాదని మా వారే చేస్తుండటంతో హాయిగా ఆయన వంట చేస్తోంటే పాత్రలూ అవీ అందించి సాయపడి చేసిన వంట ని వంక పెట్టకుండా తినేదానిని.

ఇలా నా జీవిత నౌక హాయిగా సాగుతుండగా ఒక రోజు ఫోను. మా అత్తగారూ వాళ్ళొస్తున్నారని.ఊళ్ళో ఉన్న అక్కకి ఫోను చేసా,వంట సలహాల గురించి. కంగారెందుకే,మా ఇంటికి తీసుకొచ్చేయ్ అని ఒక సలహా పారేసింది.

అత్తగారు రాగానే పదండి పదండి అని మా అక్క ఇంటికి తీసుకుపోలేను కదా.

ఏమీ కాదు,వాళ్ళు లంచ్ టైం కి కానీ రారు,అప్పటికి నేను వంట చేసెస్తా లే అన్న మా వారి భరోసా లభించాకా హాయిగా అనిపించింది.

మా అత్తగారు,మామగారు ఫోను చేసారు, మధ్యాహ్నం భోజనానికల్లా వస్తున్నాము అని.సరే టైముంది కదా నేను అలా ఆఫీసుకు వెళ్ళి ఒక రెండు గంటలుండి వస్తా,అంతలో ఆ గోంగూర కోసిపెట్టు,పప్పు,ఇంకేదయినా కూర చేద్దాము అని మా వారు వెళ్ళారు.

ఆయన వెళ్ళగానే హాయిగా టీవీపెట్టుకుని కార్టూన్స్ చూస్తూ(నాకు కొన్ని కార్టూన్స్ ఇప్పటికీ ఇష్టం :) ) టీవీ లో ఆ కార్టూన్ పాట పాడూతూ గోంగూర కోయడం మొదలెట్టా. ఇంకా టైటిల్స్ పూర్తిగా అయ్యాయో లేదో,గుమ్మం లో అలికిడయితే చూద్దును కదా, మా మామగారు ప్రత్యక్షం.

హమ్మ నాయనోయ్,హేమిటి ఇలా చెప్పిన సమయం కన్నా ముందే వచ్చెస్తే,వంట ఎలా రా బాబూ అనుకుంటూ రండి రండి అన్నాను.

ఆయన లోపలకి వస్తూనే ఏమిటమ్మా తినే పదార్ధాల దగ్గర ఈ చెప్పులు(హోం స్లిప్పర్స్ ఆ పక్కగా విడిచి గోంగూర కోస్తున్నా అన్నమాట)అనేసరికి ఒక నవ్వు నవ్వాను ఏమి చెప్పాలో తెలీక. ఇంతలో అత్తగారు కలుగ జేసుకుని అమ్మాయికి ఇంట్లో చెప్పులు వేసుకునే అలవాటు ఉంది లెండి,అయినా గోంగూర మళ్ళీ కడుగుతాము కదా అని సర్ది చెప్పారు.

అత్తయ్యగారు,మామయ్య గారితో పాటు వేరేవాళ్ళు కూడా వచ్చారు.మా ఆయనేమో ఇంకో గంట వరకూ వచ్చే సూచనలు లేవు.

ఏదయితే అదయ్యింది గోంగూర పప్పు నేనే చేద్దమని కుక్కర్ లో అన్నం,పప్పు,పప్పులో గోంగూర మాత్రం వేసాను. కుక్కర్ లో నీళ్ళు పోసానో లేదో అని ఒకటికి రెండు సార్లు చూసుకుని మరీ స్టవ్ వెలిగించా.

కుక్కర్ ఆపాకా తీసి చూస్తే నీళ్ళు నీళ్ళు గా ఉంది పప్పు.అయ్యో పచ్చి మిర్చి వెయ్యడం మరిచిపోయా మళ్ళీ కుక్కర్ పెట్టాలంటే లేటు అవుతుంది అని అనుకున్నా. కనీసం పోపు వేసి దానిలో కాస్త కారం కలిపెయ్యచ్చు అన్న ఫ్యూజన్,రీమిక్స్ టెక్నిక్స్ అప్పుడూ తెలీవు కదా.

వచ్చిన వాళ్ళు నా వంట తినాలన్న ఉత్సాహం మీద ఉండటంతో మా అత్తగారు లోపలకి వచ్చే ఛాన్సు లేకపోయింది.

ఆ పప్పు లో ఉప్పు మాత్రం కలిపి అలా పెట్టేసా భోజనాల దగ్గర. కూర చేసే టైం లేక కాదు,రాక అన్నమాట.

కనీసం అది ముద్ద పప్పు అయినా బాగుండేదేమో తినడానికి.జస్ట్ అందులో గోంగూర మాత్రం వేసి ఉడికించి ఉప్పేసా అంతే. ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇంతలో మా అత్తగారు అందరికీ చెప్పారు,అమ్మాయికి కాస్త నలతగా ఉంది ఈరోజు,పప్పొక్కటే చేసింది ఈరోజు సరిపెట్టుకోండి అని.

నేనేమయినా అనుకుంటానేమో అని అందరూ కాస్త కాస్త పప్పు వేసుకుని,ఆవకాయ మిగతా ఊరగాయలతో,మారు మాట్లాడకుండా
భోజనం అయ్యిందనిపించారు. ఒక్కటే చేసినా కనీసం రుచిగా చేసుంటే మా అత్తగారు నన్ను వెనకేసుకొచ్చినందుకు ఫలితం ఉండేదేమో.

నా గోంగొర పప్పు తో అందరికీ నా వంట పాటవం తెలిసొచింది.అంతే,అప్పటి నుండీ ఎప్పుడూ నన్ను వంట చెయ్యమని ఎవ్వరూ అడగలేదు.

అందరి భోజనాలయ్యాకా మా వారు వచ్చారు తీరికగా.గాట్ఠిగా ఏడ్చేసా ఆరోజు.

కానీ బాగా ఉక్రోషం వచ్చింది ఆరోజు మాత్రం.తరువాత "మాలతీ చందూర్" సహకారంతో నేర్చుకున్నా అనుకోండి, కానీ మా ఇంటికి భోజనానికి మాత్రం ఎవ్వరూ రాలేదు ఒక రెండు సంవత్సరాలు.

ఇప్పటికీ మా మామయ్యగారికి నా నీళ్ళ గోంగూర పప్పు గుర్తే.ఎలా మర్చిపోతారు?ఎప్పుడయినా మా అత్తగారు అమ్మాయి ఫలాన వంట బాగా చేస్తుంది అంటే ఏదీ,ఆ రోజు పప్పు లాగానా అంటారు నవ్వుతూ.

ఇప్పుడు కాస్త ఫరవాలేదు.ఓ రెండూ కూరలు,పచ్చడీ,సాంబారు చేసి ఓ పదిహేను మందికి వండగలను.ఇప్పుడు మా వారి ఫ్రెండ్స్ అందరూ నా వంట అదుర్స్ అంటారు. (వాళ్ళందరూ బ్యాచిలర్స్ కదా మరి).


పిండి వంటల సెక్షన్ మాత్రం మా ఆయనదే ఇంట్లొ.

"వంట నేను-పిండివంట వారు" ఇదీ మా ఇంటి పద్ధతి.పొరపాటూన కూడా ఎప్పుడూ మామూలు వంటలో ఆయన చెయ్యి పెట్టరు.

నా వంట తంటాలు

ఈ పోస్టు రాయడానికి కూర్చుని ఒకసారి అలా ఆగ్రిగేటర్ లో చూడగానే
కల్పన గారి
టపా కనపడింది. నా లాంటి వారు కూడా ఉంటారు లే, హమ్మయ్య అనుకుని ధైర్యం గా టపా మొదలెట్టాను.

నేను ఎనిమిదో తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడో ఓ సారి అనుకోకుండా అమ్మ ఊరెళ్ళాల్సివచ్చింది. అక్క కూడా లేదు ఊరిలో.నాన్నగారేమో నేను క్యారేజీ తెప్పిస్తానమ్మ అన్నారు. అక్కర్లేదు నాన్నగారూ,నేను చేస్తా అన్నాను.

పొద్దున్నే నేను ఇచ్చిన కాఫీ నీళ్ళు మాత్రం తాగి ఆఫీసుకి వెళ్ళారు.వెళ్ళాకా ఆలోచించడం మొదలెట్టా. ఏమి చెయ్యాలి అని.ఇంట్లో ఏమో బెండకాయలు,ఆకుకూర,క్యాబేజీ కనిపించాయి. అన్నింట్లోకీ వీజీ బెండకాయే అనిపించింది.

అంతకు ముందు రోజే అమ్మ ఆలూ ని కుక్కర్ లో ఉడికించడం చూసి,బెండకాయలు కూడా శుభ్రం గా కడిగి కట్ చేసి కుక్కర్ లో పెట్టా ఒక 3-4 విజిల్స్ వచ్చేవరకు.తక్కువ విజిల్స్ అయితే ఉడకదేమో అని భయం మరి.


కుక్కర్ తీసి చూద్దును కదా,స్కూలో ఝండాలంటించుకునే మైదా పిండి కి ప్రతిసౄష్టి కనపడింది. ఏమీ కాదు,నూనె లో వేయిస్తే ఈ తడి పోతుంది అనుకుని ,స్టవ్ మీద మూకుడూ పెట్టాను. నూనే ఎంత వెయ్యాలి అని డవుటు.

మరలా అమ్మ ఆలూ ఫ్రై కోసం పెట్టిన నూనె గుర్తుకు తెచ్చుకుని,ఎందుకయినా మంచిదని కొంచెం ఎక్కువ అనగా మూకుడి సగం వరకు నూనె పోసాను. నూనె కాగాకా, దానిలో పోపు వేసా.పోపు కూడా ఆషా మాషీ పోపు కాదండోయ్,అమ్మ దాచిపెట్టిన "వనిత" పుస్తకాలలో చదివిన వంటలలో అన్నీ సమ పాళ్ళలో వెయ్యమన్నది గుర్తొచ్చి ఆవాలు,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు,ఎందు మిర్చి,ఇంగువ వైగైరా పోపుల పెట్టె లో కనపడిన వన్నీ తలా ఒక స్పూను వేసా.

ఇప్పుడు నా ఝండా పిండి ని అలా దూరం గా నిలబడి దానిలోకి వేసాను.కాసేపయ్యాకా చూసినా కానీ అమ్మ చేసే బెండకాయ కూర రూపు కనపడలేదు. ఇంతలో నాన్నగారొచ్చారు లంచ్ కి.వంటింట్లోకొచ్చి చిల్లుల గరిటె తో ఆ పదార్ధ్హాన్ని నూనే లేకుండా ఒక గిన్నెలో తీసి జావ లాంటి అన్నంతో మారు మాట్లాడకుండా తినేసారు. ఎలా ఉంది నాన్నగారూ వంట,అని అడిగా. అమ్మ కంటే బాగా చేసావు నాన్న అన్న మాట విని,కూర ఖాళీ చేయబోయిన దాన్నల్లా ఆగి కొంచం అమ్మ కోసం ఉంచా.


సాయంత్రం అమ్మ రాగానే అమ్మ కి చూపించేసరికి......
బెండకాయలెందుకు ఉడకబెట్టావే అంది. నువ్వు అలూ పెడతావుగా అందుకే అన్నాను.నిన్ను ఫాలో అయ్యగా,ఇంకా తప్పేంటి అన్న ధీమాతో. వంటింట్లోకెళ్ళీ మరి ఈ నూనె ఏమిటి అని అడిగింది.నువ్వు ఆలూ వేయించేటప్పుడు వేసే అంతటి నూనే వేసాను అన్నాను.

అర్ధమయ్యిందనుకుంటా మీకు...అలూ ఉడక బెట్టినట్లు బెండకాయ కుక్కర్లో పెట్టాను,పోనీ ఉడికిస్తే ఉడికించా తక్కువ నూనె వెయ్య్ద్దూ పోపులో,ఆలూ ఫ్రై గుర్తు తెచ్చుకుని సగం నూనె పోసేసా అన్నమట. అదన్నమాట,ఆలూ ఇన్స్పిరేషన్ తో నా మొదటి కూర ఎక్స్పీరియన్స్.

మరలా ఎప్పుడూ మా అమ్మ నన్ను వదిలి ఊరెళ్ళకపోవడంతో,నాన్నగారికి మా అమ్మ కంటే మంచి వంట తినే భాగ్యం లేకపోయింది.

ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఎప్పుడూ వంట నేర్చుకున్న పాపాన పోలేదు. ఆ తరువాత హాస్టలు. హాస్టలు నుండి ఇంటికి వెళ్ళినప్పుడేమో మహరాణీ భోగం,హాయిగా అమ్మ చేస్తే తిని పెట్టడం. ఏరోజయినా కూర చెయ్యకుండా పప్పు,పచ్చడి తో సరిపెడితే రంకెలెయ్యడం. ఎప్పుడయినా వంటింట్లో కి వెళ్ళినా సగం సేపు నాకు వంటిల్లు సర్దటం తోనే సరిపోయేది. ఇదిగో ఈ పచ్చడి పాత పడింది,ఇంకా ఎందుకు ఉంచావు అని పాత ఉసిరికాయో చింతకాయో తీసి బయట పడెయ్యడ్డనికి రెడీ అవ్వడం, మా అమ్మ లోపలకి వచ్చి నీకు తెలీదు ఇవన్నీ పాడవ్వని పచ్చళ్ళు,ముందర నడూ బయటకి అని నన్ను బయటకి పంపేసేది.

మా అమ్మ చలవ,నా బద్ధకం వల్ల అసలు అన్నంలో ఎన్ని నీళ్ళు పొయ్యాలో కూడా తెలీని పసి వయసులో(వంట రానప్పుడు పసి వయసేగా)పెళ్ళయిపోయింది.

అత్తగారింట్లో మొదటి సారి వంట చెయ్యక్కర్లేకుండా గడచిపోయింది. రెండో సారి ఉగాది కి వెళ్ళాము. పొద్దున్నే లేచి తయారయ్యి వంటింట్లో కి వెళ్ళాను. అక్కడ అత్తగారు ములక్కాడలు,దోసకాయ ఇంకా ఏవో పెట్టుకుని వంటకి తయారవుతున్నారు.

నేను చేస్తానండీ అన్నా వినయంగా. వద్దమ్మ,టిఫిన్ తిను ముందు అన్నారు. చేస్తా అని అనేసా కానీ అసలు వాటితో ఏమి చెయ్యాలో కూడా తెలీదు. టిఫిన్ తిని మరలా పట్టుబట్టాను నేను వంట చేస్తా అని.నిజంగా చెయ్యి అని ఉండుంటే ....దేవుడా...నిన్ను నమ్మినందుకు కాపాడావు అనుకుంటా ఇప్పుడు అది గుర్తొచ్చిన్నప్పుడల్లా.

వంట వద్దు కానీ,కాస్త ఈ ములక్కాడలు తరిగివ్వు చాలు అన్నారు. సరే,అదెంతసేపు అని చాకు తీసుకుని కింద కూర్చున్నా. ములక్కాడలని తరిగి మధ్యలో వచ్చే ఈనెలు తియ్యాలి అని తెలీదు.నిజం. ఒక 2 ముక్కలు తరిగేసరికి నా ప్రావీణ్యం అర్ధమయ్యింది అత్తగారికి. మోటారు ఆఫ్ చెయ్యమ్మా అని ఓ పని అప్ప చెప్పి చక చకా తరిగి ఈనెలు తీయడం చూసి నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు.

ఆరోజు పెసర వడలు వేస్తున్నారు పొద్దున్నే టిఫిన్ కోసం. వాటిని అలా చేతి మీదో,పాల కవర్ మీదో సుతారం గా వెయ్యడం చూసి ఓస్,నేనూ చేసిపడెయ్యగలను అనుకున్నాను. దగ్గరకి వెళ్ళగానే,వద్దమ్మ,ఇదిగో ఈ కాఫీ మామయ్యగారికి ఇచ్చి రా అన్నారు.తడబడే అడుగులతో కాఫీ పట్టుకుని వెళ్ళాను.భయం తో కాదు అడుగులు తడబడింది,చీర కట్టుకున్నా కదా,దానితో ఇబ్బంది.


నాకేమీ రాదు,అయినా కొత్త కోడలికి వంట రాదనుకుంటారేమో అనుకుని మరలా వెళ్ళా వంటింట్లోకి. ఇక విసుగొచ్చిందో ఏమో ఆవిడ పాల కవర్ మీద గారే అద్ది(నా ప్రావీణ్యాన్ని ములక్కాడ తరిగినప్పుడే అంచనా వేసుంటారు) నాకిచ్చారు నూనెలో వెయ్యమని.

నిజం చెప్పొద్దూ,నాకు చచ్చే భయం నూనెలో కూర ముక్కలు వెయ్యాలన్నా కానీ.ఇక అంత సల సలా కాగే నూనె లో గారె వెయ్యడమంటే..హమ్మో.

పెళ్ళికి ముందు చదివిన షివ్ ఖేర పుస్తకం "యూ కెన్ విన్" ఓ సారి గుర్తు తెచ్చుకుని కాస్త వెనక్కి జరిగి పై నుండీ గారె వేసా నూనెలో. బుడుంగ్......అని నూనె చింది పక్కనున్న వస్తువుల మీద పడింది.

అత్తగారి వైపు చూసా భయం భయం గా. వాడు లేచుంటాడు చూడమ్మా అని మెత్తగా చెప్పారు నువ్వు ఇక దయ చేయి అని :).

ఇంతలో ఎవరో వచ్చారు ఇంటికి.అయిపోయాను,వీళ్ళకి వంట చెయ్యాలో ఏమో అనుకున్నా. ఇంతలో మా అత్తగారు లోపలకి పిలిచి ప్లేటు నిండా గారెలు సర్ది వాళ్ళకి ఇచ్చి రమ్మన్నారు. ఆవిడ వెనకాలే వచ్చి ఈరోజు అమ్మాయ్యే వంట చేసింది అని చెప్పేసరికి, నేను టైడ్ తెల్లదన్నాన్ని చూసినప్పటికంటే ఎక్కువ అవాక్కయ్యాను.


వచ్చినవారు మగవారు కాబట్టి సరిపోయింది. ఆడవాళ్ళు వచ్చుంటే తిన్నగా వంటింట్లో కి వచ్చేసి కూర్చుని,అక్కయ్యా రావే మాట్లాడూకుందాము అని మా అత్తగారిని పిలిచి కబుర్లాడటం మొదలుపెట్టి ఉంటే.....

అలా మొత్తానికి అత్తగారింట్లో గండం గడచిపోయింది. నాకు వంట రాదన్న సంగతి ఎక్కడా బయటకి రాకుండా పాపం అత్తయ్యగారు బాగా మేనేజ్ చేసారు. కానీ నిజం నిప్పులాంటిది,దాగదు కదా.

ఒక శుభ ముహుర్తాన బయటపడిపోయాను. మళ్ళీ చెప్తా ఆ విషయం.

Tuesday, September 14, 2010

టీవీ వంటలుఎప్పుడూ చేసే బెండకాయ,వంకాయ కూరలు,పోపేసిన శనగలు,బజ్జీల లాంటి స్నాక్స్ బోరు కొట్టి కొత్తగా ఏమి చేద్దామా అని ఆలోచించి ఎలాగూ వంటల కార్యక్రమాలు వస్తుంటాయి కదా అని ఇప్పుడే మన తెలుగు చానెల్ లో ఒక వంట కార్యక్రమం చూసాను. వంట ల సంగతి దేవుడెరుగు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద ఎందుకు ఇన్నిన్ని జోక్స్ పుట్టుకొస్తాయో అర్ధమయిపోయిందోచ్.


ఈరోజు ఒకావిడ అదేదో బిర్యాని,కార్న్ కబాబ్ చూపించారు.మన యాంకర్ ఆవిడని అడుగుతుంది ఈ కార్న్ కెబాబ్ ని నెయ్యి లేదా డాల్డా లో కూడా వేయించచ్చా అండీ అని. అసలే ఇలాంటి వంటకాలలో సగం పోషకాలు చచ్చి ఉంటాయి. ఇంకా వీటిని నెయ్యి డాల్డా లలో వేపి అనవసర కొవ్వు వంటికి పట్టించుకోవడం కాకపోతే మరేమిటి?

కెబాబ్స్ వేసి అవి వేగుతున్నప్పుడు యాంకరు "వీటిని ఒక వైపు వేపాకా మరోవైపు తిప్పాలాండీ" అని అడిగింది. అక్కడున్నావిడ సంగతేమో కానీ నాకయితే యాంకర్ ని గరిట తిప్పి ఒక్కటెయ్యాలనిపించింది.

మన సగం మంది యాంకర్లకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలాగూ లేదు.కనీసం రికార్డెడ్ ప్రోగ్రాంస్ లో అయినా ఇలాంటివి తొలగించచ్చు కదా.ఏమో లెండి ఇలాంటి పిచ్చి వాగుళ్ళు ఎన్ని ఫిల్టర్ చేసారో మన ముందుకి తెచ్చే ముందు :)


ఇంకో ప్రోగ్రాం లో ఒకావిడ కూరగాయల సిక్స్టీఫవో ఎయిటీఫయివో చూపించింది.

సగం కూరలని ముందు నూనె లో వేపి మరలా ఏదో పిండి పట్టించి మరలా నూనెలో నిండా ముంచి స్నానం చేయించి చివరాఖరికి గార్నిష్ అంటూ ప్లేటు చుట్టూ క్యారెట్టు,ఉల్లిపాయలు,ఎక్సెట్రా ఎక్సెట్రా. మాంచి బజ్జీలో,మంచూరియానో చేసి ప్లేటు లో పెట్టి చివరికి చుట్టూ గార్నిష్ అంటూ ఎన్ని పచ్చి ముక్కలు పెట్టినా చివరికి ప్లేటులో మిగిలేవి ఈ పచ్చి ముక్కలే.అంత మాత్రానికి ఆ హడావిడి ఎందుకో?
టీవీలలో వంటలు చేసే వాళ్లని చూస్తే హాచ్చర్యమేస్తుంది నాకు. ఎంత నీటుగా కనీసం నూనె చుక్క కింద పడకుండా ఎంత పెద్ద వంటైనా చేసెస్తారు.ముందర అదేదో చేసి చివరికి నూనెలో వేయించి తియ్యాలి అంటే ఎంత లేదన్నా నాకు ఓ రెండు మూకుళ్ళు,3-4 గరిటెలు,వంటింటి గట్టు మీద అక్కడక్కడా పిండి,నేల మీద ఒకటి రెండు కూరగాయ తొక్కులు కనీసం ఉంటాయి వంట పూర్తయ్యేసరికి.


హేమిటో,ఎప్పుడు నేర్చుకుంటానో అలాగ?