Friday, July 16, 2010

మా ప్రభు మామయ్య కబుర్లు

నా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ప్రభు అని మా నాన్నగారి కొలీగ్ ఉండేవాడు.అప్పటికి అతనికి పెళ్ళి కాలేదు ఇంకా.ఆఫీసు తరువాత వెళితే అప్పుడప్పుడు క్లబ్బు కి వెళ్ళి టెన్నిస్ ఆడి వచ్చేవాడు.లేకపోతే అదీ లేదు.అప్పుడు టీవీ లలో ఇన్ని ఛానెల్సు లేవు కాబట్టి బ్యాచిలర్ అయిన మా ప్రభు మామయ్య బోలెడు ఖాళీ గా ఉండేవాడు.మాకూ బోలెడు టైంపాస్ తనతో.అక్క కంటే ఎక్కువ నేను వెళ్ళి తనతో కబుర్లు చెప్పేదానిని.

ఒక సారి నేను మా ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినకుండా పేచీ పెడుతున్నాను.అమ్మ శతవిధాలా ప్రయత్నించింది నన్ను ఊరుకోబెట్టడానికి.ఊహూ,ఏడుపు ఆగదే,అమ్మ బ్రతిమాలే కొద్దీ స్వరం పెరుగుతోంది.ఎప్పటి నుండి మరి నా రాగాన్ని వింటున్నాడో సడెన్ గా ప్రభు మామయ్య వచ్చాడు,ఏమిటి వదినా చిన్నది ఎందుకు ఏడుస్తొంది అని.అమ్మ ఏదో చెప్పింది.

నాతో రా అని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి తాళం వేసేసాడు.మన రాజకీయ నాయకుల లాగ నేను దిగ్భ్రాంతి చెందానన్నమాట ఈ హఠాత్ పరిణామానికి.ఇంకా స్వరం పెంచా నా ఏడుపు లో.మా అమ్మ అయితే కరిగేది కానీ అక్కడ ఉన్నది ఎవరు,ప్రభు మామయ్య.అరిచావంటే తాళం వేసి నేను బయటకి వెళ్ళిపోతా అని బెదిరించేసరికి దెబ్బకి నా కచేరీ ఆపేసాను.

ఎంత భయపెట్టేవాడో అంత గా నాతో కలిసి ఆడేవాడు.ఒక సారి నేను వాళ్ళింట్లోకి వెళ్ళినప్పుడు ఏదో వండుతున్నాడు.అదేమిటి అని అదిగా.వెల్లుల్లిపాయలు అని చెప్పి రుచి చూస్తావా అని ఓ రెండిచ్చాడు.ఇంతకీ అవి రొయ్యలుట.నాకు తెలీదు.తిని ఇంటికి వెళ్ళి మా అమ్మ కి చెప్పాను అమ్మ, ఈరోజు ప్రభు మామయ్య వెల్లుల్లిపాయలు వేయించి నాకు పెట్టాడు అని.యధావిధి గా మా అమ్మ తనకి చివాట్లేసింది అనుకోండి.

ఓరోజు నాన్నగారు ఆఫీసు కి వెళ్ళాకా అమ్మ నాన్నగారి షేవింగు సెట్టు తీసి శుభ్రం చేస్తోంది.రేజర్ లో బ్లేడు అమ్మ వేలికి గుచ్చుకుని పాపం రక్తం కారుతోంది.కట్టు కట్టుకుంది అయినా ఆగట్లేదు.నన్ను పిలిచి ప్రభు మామయ్య ఉన్నడేమో చూడు,ఉంటే వెళ్ళి చెప్పు, వేలు తెగి రక్తం బాగా వస్తోందని అని చెప్పింది.


నేను వెళ్ళి చెప్పినప్పుడు ప్రభు మామయ్య నమ్మలేదు.నాన్న పులి కధ లాగ అప్పుడప్పుడూ నేను అబద్ధాలు చెప్పేదానిని లెండి.నిజం మామయ్య అని చెప్పినా నమ్మలేదు పైగా "మా బాగా అయ్యింది" అని చెప్పు అన్నాడు.నేను మా ఇంట్లోకి వచ్చి అమ్మ కి చెప్పాను,"అమ్మా,మామయ్య మా బాగా అయ్యిందన్నాడు" అని.అంతే,మా అమ్మ అరిచిన అరుపు కి తాళం వేసి ఆఫీసు కి బయలు దేరు తున్న మామయ్య మా ఇంట్లో కి వచ్చి అమ్మ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.

మా ఊరిలో అప్పలమ్మ అని ఒకావిడ సారా అమ్మేది.ఒక రోజు నేను స్కూలు నుండి వస్తోంటే ఒక తాగు బోతు నా పక్క నుండి వెళుతూ "అప్పలమ్మ సారాయి నిప్పు లాంటిది" అని పాడుకుంటూ వెళ్ళడం విన్నాను అంటే,అది నా హమ్మింగ్ సాంగ్ అయి కూర్చుంది.

మామయ్య వాళ్ళింటికి వెళ్ళి పాడేదానిని.ఆపు,ఆ పిచ్చి పాట అని మామయ్య అరిచిన కొద్దీ బయటకి పరుగెత్తి మరీ పాడేదానిని.కొట్టడానికి ఒకరోజు నా వెనక పడేసరికి గేటు దాటి బయటకి వచ్చి మరీ గాట్ఠిగా పాడాను.

ఇప్పుడు నవ్వొస్తుంది అవన్నీ తలచు కుంటే,అంత పిచ్చి పాట ని గొంతెత్తి మరీ రామదాసు కీర్తన లాగ ఎలా పాడానో కదా అని.అదేనేమో చిన్నతనమంటే,బెరుకు,భయం ఏమీ తెలీని వయసు.

మనము పెరిగి పెద్ద వాళ్ళయ్యే కొద్దీ బయటకి ప్రకటించే భయం తగ్గుతుందేమో కానీ మానసికం గా బెరుకు మాత్రం పెరుగుతుంది అనిపిస్తుంది నాకు.మంచి పాట అయినా కానీ ఇప్పుడు నేను నడుస్తూ కాస్త గట్టిగా పాడుకోలేను కదా.

ప్రభు మామయ్య పెళ్ళి కి వైజాగ్ వెళ్ళడం,తన పెళ్ళి ఇంకా గుర్తే నాకు.వాళ్ళావిడ(విజయత్తయ్య) ని మా ఊరు తీసుకొచ్చినప్పుడు బోలెడు స్వీట్లు గట్రా పట్టుకొచ్చింది.అప్పటికి నాకు లడ్డు,బాదుషా,మినప సున్ని,మైసూర్పాకు తప్ప వేరే స్వీటు తెలీదు.స్టీలు బిందెలో తను తెచ్చిన ఒక స్వీటు ని సగం నేనే ఖాళీ చేశానేమో.అప్పటికి ఇంకా కాజూ కత్లీ లు లేవు కదా,స్వీటు పేరు గుర్తు లేదు కానీ డైమండ్ షేపు లో పైన సిల్వర్ ఫాయిల్("ముచ్చి రేకు" అప్పటి నా భాష లో) అంటిచ్చిన స్వీటు తెగ నచ్చేసింది నాకు.

ఆ స్వీట్లన్నీ నా కోసం తెచ్చినట్లు దర్జాగా వాళ్ళింట్లొకి వెళ్ళిపోయి నాక్కావాల్సినవి తీసుకునే దానిని.కొత్త అమ్మాయి కదా,అలా వెళ్తే బాగోదని మా అమ్మ ఎంత కంట్రోల్ చేసినా నాకు అర్ధ మయ్యేది కాదు.ఇంతక ముందు ప్రభు మామయ్య ఇంటికి వెళ్తే ఏమీ అనని అమ్మ ఇప్పుడు ఇలా చేస్తోందేమిటా అని.

పాపం మా అత్తయ్య కూడా "ఫరవాలేదు లెంది అక్కయ్య గారు,తనని పంపండి" అనేది.తన గురించి అప్పటికి ఏమీ తెలియకపోయినా,స్వీట్స్ తెచ్చింది అని నాకు తెగ నచ్చేసింది మా అత్తయ్య.తను చేసే కొబ్బరన్నం నా ఫేవరెట్ డిష్.ఈ సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ చేయించు కోవాలి.

చెప్పాలంటే ప్రభు మామయ్య కీ మాకూ ఏ విధమయిన చుట్టరికమూ లేదు ఫ్రెండ్ షిప్ తప్ప.మా నాన్నగారి స్నేహం మామయ్యతో మొదలయ్యి దాదాపు 35 ఏళ్ళు కావస్తోంది,అది ఇప్పటికీ అలా సాగుతోంది.