Monday, November 15, 2010

ఓపెనింగ్ ఆఫర్ అనుభవాలు---ఉపోద్ఘాతము
ఒకానొక సంధ్యా సమయాన షాపింగ్ మాల్ లో మా శ్రీ వారి కోసం నీరిక్షిస్తున్నాను. ఇదిగో వచ్చేసా అంటున్నారే కానీ ఇంకా రాలేదు. సరే,మరీ దారిలో నిలుచున్నా అని అలా ఓ పక్కకి జరిగి నిల్చున్నా. నా పక్కనే కింగ్ ఫిషర్ క్యాలెండర్ కన్య లా ఉన్న ఓ అమ్మాయి ఏవో ఫ్లయర్స్ పంచుతోంది. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదు పాపం.సరే ఏదో చూద్దామని,నేనొకటి తీసుకున్నా. మేడం,అలా పక్కకి వచ్చి రిజిస్టర్ చేసుకోండి,ఇది మా XYZ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ సెంటర్ ఈ మాల్ ల్లో ఓపెనింగ్ సందర్భం గా ABC$కే మీకు రెండు సెషన్స్ అని చెప్పింది. భలే మంచి చౌక బేరమే అనుకున్నా. కాదూ మరి,ఓ వారం కూరగాయలు కూడా రావట్లేదాయే మరి ఈ రోజుల్లో అంత ధరకి. సరే అని నా వివరాలు వగైరా ఇచ్చాను.

ఇంతలో మా ఆయన వచ్చారు.ఏదో టైంపాస్ కి చూస్తున్న కానీ పెద్ద ఇంట్రస్ట్ లేదు నాకు ఆ ట్రీట్మెంట్ మీద. వచ్చేస్తోంటే,ఆయన చూసి ఏమీ కాదు లే తీసుకో,ఓ సారి చూద్దువు గాని అసలు ఇది ఎలా ఉంటుందో అన్నారు.

నిజ్జంగా ABC$కే కదా ఈ రెండు సెషన్స్ అని మరలా అడిగాను. అవునండీ అంది ఆ అమ్మాయి. మార్కెటింగు వగైరాలుండవు కదా,అదీ ఇదీ తీసుకోండి అని తీరా వెళ్ళాకా అన్నాను.తెలుగు సినిమాకి వెళ్తూ బూతు ఉండదు కదా అని అడుగుతావేంటి అన్నట్లు చూసారు మా ఆయన నన్ను.


అబ్బే,ఏమీ ఉండదు మేడం అంటూ సైనప్ చేసినందుకు ష్యూర్ విన్ అంటూ ఏదో చక్రాన్ని గిర్రున తిప్పించింది. మీకు మా బ్రాండు వారి వెయిట్ రిడక్షన్ జెల్,క్రీం మరియు ఏదో స్క్రబ్ ఫ్రీ అంది. ఫోటో లో నాకు అవి మన 200 గ్రాముల కాల్గేట్ పేస్టంత ఉన్నాయి. తీరా చూద్దును కదా,గట్టిగా ఒక్కసారి నొక్కితే మొత్తం ఖాళీ అయ్యేటట్లున్నాయి. సరే,ఏదో ఒకటి ఫ్రీ కదా అని,ఇవ్వండి అన్నాను. అవి మీరు మా దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు ఇస్తాము అంది.అపాయింట్మెంట్ కోసం ఫోను చేస్తాము అని చెప్పాకా ఇంటికి వచ్చాను. ఆహా అంత పేరున్న సెంటర్ లో రెండు సెషన్స్ ABC$కే తీసుకున్నా అని తెగ సంబర పడ్డాను.ఆ సమయాన తెలీలేదు,కొరివితో తల గోక్కుంటున్నా అని.

Friday, October 15, 2010

మీరూ ఇలాగే మొహమాట పెడతారా?

ఒకరోజు ఆఫీసులో ఉండగా ఫోను. ఎవరా అని చూస్తే,మా అబ్బాయి క్లాస్మేటు వాళ్ళ అమ్మ. వాళ్ళ చిన్నబ్బాయికి భోగిపళ్ళు పోస్తున్నారు,సాయంత్రం పేరంటానికి రమ్మని పిలుపు.

సాధారణం గా నేను ఇలాంటి వాటికి చాలా తక్కువ వెళ్తాను,ఒక వేళ వెళ్ళినా, కూర్చున్నా అన్న పేరు కి కూర్చుని తాంబూలం తీసుకు వచ్చెస్తాను.ఎన్నింటికండీ అని అడిగాను,సాయంకాలం ఐదున్నరకి అంది. అయ్యో రాలేనండీ అప్పుడంటే అన్నాను,మానెయ్యొచ్చని. ఏమీ ఫరవాలేదు,మీరు ఆఫీసు నుండి తిన్నగా మా ఇంటికి వచ్చెయ్యండి,భోజనం కూడా మా ఇంట్లొనే అందావిడ. భోజనాలవీ వద్దు కానీ ఓసారి వచ్చి వెళ్తాను అన్నాను. అలా కుదరదు,ఎప్పుడూ రారు మీరు,ఏదో తెలుసున్న ఓ నలుగురిని పిలిచాను ఫ్యామిలీ లతో సహా భోజనాలకి,మీరందరూ రావాల్సిందే అనడంతో సరే అనక తపలేదు.

మా ఆయనకి ఫోను చేసి చెప్పగానే,పేరంటానికి నేనేమిటి అని ఇంతెత్తున లేచారు. అదేమీ పేరంటము కాదు,చిన్న గెట్ టుగెదర్ అంతే,అలా వెళ్ళి ఇలా భోజనం చేసి వచ్చెద్దాము,పైగా మనము వెళ్ళేటప్పటికి భోగిపళ్ళ కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది అని చెప్పి ఓ పావుగంట బ్రతిమాలి,బామాలినా కానీ వప్పించలేకపోయాను.

సరే, సాయంత్రం త్వరగా వెళ్ళాలి,లేటయితే బాగోదనుకున్నాను.కానీ తానొకటి తలచిన.......కదా.ఆరోజు ఆఫీసులో లేటయిపోయింది.డైరెక్టు గా వెళ్దామా అని ఒక్క నిమిషం ఆలోచించి,ఛీ ఇలా వెళ్తే బాగొదని ఇంటికి వెళ్ళి,ఎదురుగా కనపడిన ఓ కాటన్ డ్రెస్ వేసుకుని బయలుదేరుతూ యధాలాపం గా అడిగాను,రాకూడదూ అని మా వారిని. సరే అని బట్టలు మార్చుకోవడానికి లేవబోతోంటే,ఏమీ అక్కర్లేదు,అక్కడ అందరూ వెళ్ళిపోయి ఉంటారీపాటికి అని మా ఆయనని అలా షార్ట్స్,టీషర్ట్ లోనే లాక్కెళ్ళాను.

వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఏముంది,అక్కడ అసలు ఇంకా కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలయ్యే సూచనలే లేవు. వాళ్ళ ఇల్లంతా ధగధగలాడే బట్టలు,నగలు ధరించిన ఆడవాళ్ళతో మెరిసిపోతోంది.అంతే,మా వారు నా వైపు చూసిన చూపుకి కానీ పవరుండుంటే.....

గబుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న మా ఆయనని చూసిన హోస్టు అయ్యో ఏమిటండీ వెళ్ళిపోతున్నారు,ఆగండి అని చెప్పి లోపలకి వెళ్ళి వాళ్ళాయనని పంపింది బయటకి.వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పరిచయం లేదు,ఇద్దరూ హాయ్ అని పలకరించుకుని,మగవారి
రొటీన్ క్వశ్చనేర్ లో ప్రశ్నలు(ఎక్కడ పని చేస్తారు,మీ క్లైంటు ఎవరు)
వేసుకుని, ఇక అంతే మాటల్లేవు.నేను మా ఆయనకి కంపెనీ ఇద్దామని బయటే ఉండిపోతే,అదేమిటి మీరు లోపలకి రండి అని లాక్కెళ్ళిపోయింది.అంతే,సినిమాలలో హీరోయిన్ని లాక్కెళ్ళిపోతొంటే నిస్సహాయం గా చూసే హీరోయిన్ చూపు లా ఓ చూపు మా ఆయన వైపు చూసి లోపలకి వెళ్ళాను.

లోపల అందర్నీ చూసి ఓ సారి నా డ్రెస్ వైపు చూసుకున్నాను.ఆడవాళ్లందరూ ఒక వైపు చేరి నగలు,బట్టలు,పిల్లల చదువులు అన్నీ కలగాపులగం గా మాట్లాడేసుకుంటున్నారు.ఓ మూల ఆఫీసు నుండి డైరెక్ట్ గా ఇటే వచ్చేసిన ఓ క్యాండేటు కనపడేసరికి హమ్మయ్యా,నా అవతారం లో ఉన్న ఇంకో క్యాండేటు ఉంది లే అని ఆవిడ పక్కన వెళ్ళి కూలపడ్దాను.

ఓ పక్క,ఈ పార్టీ హోస్టు మీద పీకల దాకా కోపం వచ్చెస్తోంది,ఇంత పెద్ద పేరంటం అని చెప్పనే లేదు పైగా ఇక్కడెవరూ మగవాళ్ళు వచ్చిన దాఖలాలు కూడా లేవు.మెడలో కొత్తగా కొనుక్కున్న నెక్లస్ సెట్టు,ఏదో బ్రదర్స్ లో కొన్న డిజైనర్ చీర కట్టుకుని హడావిడీగా తిరుగుతున్న హోస్టు ని పట్టుకుని మెల్లిగా అడిగా,ఏమిటండీ ఫ్యామిలీ తో రమ్మన్నారు,పైగా ఐదున్నరకే అన్నారు అని.అయ్యో,అదా,మొదట ఓ ముగ్గురు నలుగురినే పిలిచానండీ,మళ్ళీ ఒకళ్ళని పిలిచి ఇంకోళ్ళని మానెస్తే బాగోదని అందరినీ పిలిచేసాను.అయినా మీ ఆయనకి మా వారి కంపెనీ ఉంటుంది కదా అని మీకు మళ్ళీ చెప్పలేదు అందరూ వస్తున్నారని.అయినా ఏమయ్యిందండిప్పుడు,ఎప్పుడూ మా ఇంటికి రారు మీరిద్దరూ ,మీ వారికి మా ఆయన కంపెనీ ఇస్తారు లెం డి అని సింపుల్ గా చెప్పి,అమ్మా కుక్కరు కట్టేసావా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

నాకు ఎవ్వరూ తెలీదు,లాభం లేదని నా పక్కనున్నావిడతో మాటలు కలిపాను.ఇంత భారీ ఎత్తున చేస్తున్నారని తెలీదండీ,ఆఫీసు నుండి వచ్చెయ్యండి ఫరవాలేదంటే వచ్చేసాను అని ఆవిడ అనేసరికి,హ్హ్మ్,అందరూ ఇలాగే ఫీల్ అవుతారన్నమాట అనుకున్నాను.


మరలా ఓ పది నిమిషాలకి అతి కష్టం మీద హోస్టు ని దొరక పుచ్చుకుని చెప్పాను,మా ఆయన ఇంటికి వెళ్తారండీ నేనుండిపోతాను అని.అబ్బే,అక్కర్లేదు ఇదిగో మొదలెట్టెస్తాము ఇంకో పావుగంటలో అంది.నేను మధ్య మధ్య లో అలా బయటకి తొంగి చూసి,బాల్కనీ లో ఫోను తో కాలక్షేపం చేస్తున్న మా ఆయన వాడి వేడి చూపులు తట్టుకోలేక గబుక్కున లోపలకి వచ్చేసా.

నాకూ నా పక్కనున్నావిడకీ పరిచయం లేకపోవడంతో పెద్ద గా మాట్లాడుకోవడానికి కూడా మాటల్లేవు. సరే అని నా పక్కన కూర్చున్న బ్యాచ్ ఆడవాళ్ళ మాటలమీద నా చెవి పడేసా.


ఏమిటీ మొన్న మీరు ఫలానా వాళ్ళ అబ్బాయి బర్త్ డే ఫంక్షన్ కి రాలేదా అని ఒకావిడ అడిగితే, మా అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూలు కదా,ఏదో ప్రాజెక్టు చెయ్యల్సి వచ్చి ఇంట్లో ఉండిపోయాను,కానీ రిటర్న్ గిఫ్ట్స్ బాగున్నాయిట కదా అని వాళ్ళబ్బాయి స్కూలు గురించి దర్పం ఒలకబోస్తూ ఆరాతీసింది అవతలావిడ.

ఆన్,నా మొహం పెద్ద గొప్పగా ఏమీ లేవండీ,ఫలానా స్టోర్లో ఇయర్ ఎండ్ సేల్ లో కొందిట.ఒకోటీ 2-3 డాలార్లు పడిందిట అంతే అని ఈవిడ జవాబు.


ఇలాంటి పేరంటం పదనిసలు చాలా ఉన్నాయి,అవి మళ్ళా రాస్తాను.మొత్తానికి రాత్రి ఎనిమిదిన్నర కి కార్యక్రమం మొదల్లయ్యింది. ఆ హడావిడి,చుట్టూ మూగిన పిల్లలని చూసి భోగిపళ్ళ పెళ్ళికొడుకు ఏడుపు లంకిచ్చుకున్నాడు.


ఆ హై పిచ్ రెహ్మాన్ వింటే ఈ పిల్లాడిని తప్పక తన ట్రూప్ లో పెట్టుకుంటాడనిపించింది,తనతో పాటు "జయహో" అనో "వందేమాతరం" అనో అరిచి గీ పెట్టడానికి.

మొదట ఆ అబ్బాయి అమ్మ నాన్న భోగి పళ్ళు పోసారు. తరువాత మా ఆయనని పిలిచారు,అబ్బే మీరంతా కానీండి ముందు,తను ఉంది కదా అక్కడ అని చెప్పి బయట కి వెళ్ళిపోయారు.

ఒకోళ్ళూ కాసిని పండ్లు వాడి మీద పోస్తుంటే ఓపిక గా వాళ్ళాయన ఫొటోలు తీసారు.

హమ్మయ్యా,కార్యక్రమ అయ్యింది ఇంక భోజనాలు చేసి బయలుదేరదామనుకుంటోంటే,హోస్టు నా దగ్గరకి వచ్చి,మీ వారు అసలు పిల్లాడిని చూడలేదు,అక్షింతలు వెయ్యలేదుకదా,లోపలకి రమ్మనండి అనగానే నా గుండె గుభేల్ మంది. మా వారిని ఆ అవతారం లో ఇంత మంది ముందు కి రమ్మనడమే అని.అలా ఏమీ అనుకోరండీ,అన్నా కానీ వినిపించుకోకుండా,బయటకి వెళ్ళి ఆయనని లోపలకి రమ్మని బలవంతం పెట్తడంతో ఓ వెర్రి నవ్వు నవ్వుకుంటూ మా ఆయన లోపలకి వచ్చి అక్షింతలేసి వెళ్ళబోతోంటే,ఆగండి అని,ఏమండీ ఇక్కడ ఓ ఫొటూ తియ్యండి అని ఓ అరుపు అరిచింది.


వాళ్ళాయన కెమేరా తీసుకుని రావడం,ఫోటో తీద్దామని క్లిక్ చెయ్యగానే బ్యాటరీ డవున్ అయ్యింది.మా ఆయన పిల్లాడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోబోతోంటే ఆపి,ఆగండి స్పేర్ బ్యాటరీ తెస్తాను అని లోపలకి వెళ్ళిన మనిషి ఐదు నిమిషాలయినా రాడే బయటకి.

అంత మంది ఆడవాళ్ళ ముందు మా ఆయన ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోకుండా ఫోటో తియ్యల్సిందే అని పట్టుబట్టిన ఆవిడ పట్టుదల కి పిచ్చి కోపం వచ్చింది నాకు.

మొత్తానికి భోజనాల టైమయ్యింది.నేను ఎలాగో లోపల గబగబా తినేసి అయ్యిందననిపించి జారుకుందాము అనుకుంటోంటే,ఆయో మీ వారు సరిగ్గ తినట్లేదండీ,కాస్త మీరు దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసరికి నా కోపం ఇంకా పెరిగిపోయింది. అది కాదు అని నేను ఆవిడకి ఏదో చెప్ప బోతూ ఆగిపోయాను,మా వారు నాకు ఇంకొక బొబ్బట్టు కావాలండీ అని అడిగేసరికి.నేను తెచ్చి వేస్తోంటే చెప్పారు,ఆవిడ ఏది చెప్పినా ఓకే అనెయ్యి,ఇందాకా కెమేరా ఎపిసోడ్ చూసావు కదా అనేసరికి పాపం జాలేసింది నాకు.

మొత్తానికి అలా భోజనం చేసి రాత్రి పదింటికి ఇంటికి వచ్చామన్నమాట.

ఇందులో నా తప్పెంటి చెప్పండి?ఆవిడేమో అందరూ ఫ్యామిలీ తో వస్తున్నారు,అంటేనే కదా నేను వీళ్ళని వెంటబెట్టుకెళ్ళింది!!ఇంక అంతే,ఆ దెబ్బకి ఎక్కడకీ గెట్ టుగెదర్ అంటే రారు,నాకు మాత్రమే తెలుసున్నవాళ్ళు పిలిచినవి.మొన్నటికి మొన్న మా కొలీగ్ ఇంటి గ్రుహ ప్రవేశం అంటే కూడా రాలేదు,నువ్వెళ్ళొచ్చేయి,అక్కడ నాకెవ్వరూ తెలీదు కదా అని రాలేదు.

ఆరోజు ఆవిడ పెట్టిన మొహమాటం మా వారి మనసులో అలా చెరగని ముద్ర వేసేసింది.

Monday, September 27, 2010

అతిధులు ముందే వచ్చిన వేళ

మొత్తానికి మేము మా ఇంటికి వచ్చేసాము. మొదటి రోజు వంట మొదలెట్టాను.చక్కగా బియ్యం కడిగి కొలత ప్రకారం నీళ్ళు పోసి,పప్పు లో కూడా కొలత ప్రకారం నీళ్ళు పోసి తళతళళాడే కొత్త ప్రెస్టీజ్ కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించా.

ఆరోజే కొత్తగా పనమ్మాయి వచ్చింది. కుక్కర్ పెట్టి బట్టలు వేసాను ఉతకడానికి.అమ్మాయి బట్టలు ఉతకడం అయిపోయింది కానీ కుక్కర్ కూత పెట్టట్లేదు.ఏదో తేడా అనిపించింది. ఇంతలో ఇంటిలోకొచ్చిన మా వారు నీళ్ళు పోసావా కుక్కర్ లో అన్నారు.హా...అన్నం లో పప్పు లో మర్చిపోకుండా పోసా కానీ కుక్కర్ లో పొయ్యలేదు.అలా మొదలయ్యింది నా మొదటి వంట పెళ్ళయ్యాకా.

నాకు వంట రాదని మా వారే చేస్తుండటంతో హాయిగా ఆయన వంట చేస్తోంటే పాత్రలూ అవీ అందించి సాయపడి చేసిన వంట ని వంక పెట్టకుండా తినేదానిని.

ఇలా నా జీవిత నౌక హాయిగా సాగుతుండగా ఒక రోజు ఫోను. మా అత్తగారూ వాళ్ళొస్తున్నారని.ఊళ్ళో ఉన్న అక్కకి ఫోను చేసా,వంట సలహాల గురించి. కంగారెందుకే,మా ఇంటికి తీసుకొచ్చేయ్ అని ఒక సలహా పారేసింది.

అత్తగారు రాగానే పదండి పదండి అని మా అక్క ఇంటికి తీసుకుపోలేను కదా.

ఏమీ కాదు,వాళ్ళు లంచ్ టైం కి కానీ రారు,అప్పటికి నేను వంట చేసెస్తా లే అన్న మా వారి భరోసా లభించాకా హాయిగా అనిపించింది.

మా అత్తగారు,మామగారు ఫోను చేసారు, మధ్యాహ్నం భోజనానికల్లా వస్తున్నాము అని.సరే టైముంది కదా నేను అలా ఆఫీసుకు వెళ్ళి ఒక రెండు గంటలుండి వస్తా,అంతలో ఆ గోంగూర కోసిపెట్టు,పప్పు,ఇంకేదయినా కూర చేద్దాము అని మా వారు వెళ్ళారు.

ఆయన వెళ్ళగానే హాయిగా టీవీపెట్టుకుని కార్టూన్స్ చూస్తూ(నాకు కొన్ని కార్టూన్స్ ఇప్పటికీ ఇష్టం :) ) టీవీ లో ఆ కార్టూన్ పాట పాడూతూ గోంగూర కోయడం మొదలెట్టా. ఇంకా టైటిల్స్ పూర్తిగా అయ్యాయో లేదో,గుమ్మం లో అలికిడయితే చూద్దును కదా, మా మామగారు ప్రత్యక్షం.

హమ్మ నాయనోయ్,హేమిటి ఇలా చెప్పిన సమయం కన్నా ముందే వచ్చెస్తే,వంట ఎలా రా బాబూ అనుకుంటూ రండి రండి అన్నాను.

ఆయన లోపలకి వస్తూనే ఏమిటమ్మా తినే పదార్ధాల దగ్గర ఈ చెప్పులు(హోం స్లిప్పర్స్ ఆ పక్కగా విడిచి గోంగూర కోస్తున్నా అన్నమాట)అనేసరికి ఒక నవ్వు నవ్వాను ఏమి చెప్పాలో తెలీక. ఇంతలో అత్తగారు కలుగ జేసుకుని అమ్మాయికి ఇంట్లో చెప్పులు వేసుకునే అలవాటు ఉంది లెండి,అయినా గోంగూర మళ్ళీ కడుగుతాము కదా అని సర్ది చెప్పారు.

అత్తయ్యగారు,మామయ్య గారితో పాటు వేరేవాళ్ళు కూడా వచ్చారు.మా ఆయనేమో ఇంకో గంట వరకూ వచ్చే సూచనలు లేవు.

ఏదయితే అదయ్యింది గోంగూర పప్పు నేనే చేద్దమని కుక్కర్ లో అన్నం,పప్పు,పప్పులో గోంగూర మాత్రం వేసాను. కుక్కర్ లో నీళ్ళు పోసానో లేదో అని ఒకటికి రెండు సార్లు చూసుకుని మరీ స్టవ్ వెలిగించా.

కుక్కర్ ఆపాకా తీసి చూస్తే నీళ్ళు నీళ్ళు గా ఉంది పప్పు.అయ్యో పచ్చి మిర్చి వెయ్యడం మరిచిపోయా మళ్ళీ కుక్కర్ పెట్టాలంటే లేటు అవుతుంది అని అనుకున్నా. కనీసం పోపు వేసి దానిలో కాస్త కారం కలిపెయ్యచ్చు అన్న ఫ్యూజన్,రీమిక్స్ టెక్నిక్స్ అప్పుడూ తెలీవు కదా.

వచ్చిన వాళ్ళు నా వంట తినాలన్న ఉత్సాహం మీద ఉండటంతో మా అత్తగారు లోపలకి వచ్చే ఛాన్సు లేకపోయింది.

ఆ పప్పు లో ఉప్పు మాత్రం కలిపి అలా పెట్టేసా భోజనాల దగ్గర. కూర చేసే టైం లేక కాదు,రాక అన్నమాట.

కనీసం అది ముద్ద పప్పు అయినా బాగుండేదేమో తినడానికి.జస్ట్ అందులో గోంగూర మాత్రం వేసి ఉడికించి ఉప్పేసా అంతే. ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇంతలో మా అత్తగారు అందరికీ చెప్పారు,అమ్మాయికి కాస్త నలతగా ఉంది ఈరోజు,పప్పొక్కటే చేసింది ఈరోజు సరిపెట్టుకోండి అని.

నేనేమయినా అనుకుంటానేమో అని అందరూ కాస్త కాస్త పప్పు వేసుకుని,ఆవకాయ మిగతా ఊరగాయలతో,మారు మాట్లాడకుండా
భోజనం అయ్యిందనిపించారు. ఒక్కటే చేసినా కనీసం రుచిగా చేసుంటే మా అత్తగారు నన్ను వెనకేసుకొచ్చినందుకు ఫలితం ఉండేదేమో.

నా గోంగొర పప్పు తో అందరికీ నా వంట పాటవం తెలిసొచింది.అంతే,అప్పటి నుండీ ఎప్పుడూ నన్ను వంట చెయ్యమని ఎవ్వరూ అడగలేదు.

అందరి భోజనాలయ్యాకా మా వారు వచ్చారు తీరికగా.గాట్ఠిగా ఏడ్చేసా ఆరోజు.

కానీ బాగా ఉక్రోషం వచ్చింది ఆరోజు మాత్రం.తరువాత "మాలతీ చందూర్" సహకారంతో నేర్చుకున్నా అనుకోండి, కానీ మా ఇంటికి భోజనానికి మాత్రం ఎవ్వరూ రాలేదు ఒక రెండు సంవత్సరాలు.

ఇప్పటికీ మా మామయ్యగారికి నా నీళ్ళ గోంగూర పప్పు గుర్తే.ఎలా మర్చిపోతారు?ఎప్పుడయినా మా అత్తగారు అమ్మాయి ఫలాన వంట బాగా చేస్తుంది అంటే ఏదీ,ఆ రోజు పప్పు లాగానా అంటారు నవ్వుతూ.

ఇప్పుడు కాస్త ఫరవాలేదు.ఓ రెండూ కూరలు,పచ్చడీ,సాంబారు చేసి ఓ పదిహేను మందికి వండగలను.ఇప్పుడు మా వారి ఫ్రెండ్స్ అందరూ నా వంట అదుర్స్ అంటారు. (వాళ్ళందరూ బ్యాచిలర్స్ కదా మరి).


పిండి వంటల సెక్షన్ మాత్రం మా ఆయనదే ఇంట్లొ.

"వంట నేను-పిండివంట వారు" ఇదీ మా ఇంటి పద్ధతి.పొరపాటూన కూడా ఎప్పుడూ మామూలు వంటలో ఆయన చెయ్యి పెట్టరు.

నా వంట తంటాలు

ఈ పోస్టు రాయడానికి కూర్చుని ఒకసారి అలా ఆగ్రిగేటర్ లో చూడగానే
కల్పన గారి
టపా కనపడింది. నా లాంటి వారు కూడా ఉంటారు లే, హమ్మయ్య అనుకుని ధైర్యం గా టపా మొదలెట్టాను.

నేను ఎనిమిదో తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడో ఓ సారి అనుకోకుండా అమ్మ ఊరెళ్ళాల్సివచ్చింది. అక్క కూడా లేదు ఊరిలో.నాన్నగారేమో నేను క్యారేజీ తెప్పిస్తానమ్మ అన్నారు. అక్కర్లేదు నాన్నగారూ,నేను చేస్తా అన్నాను.

పొద్దున్నే నేను ఇచ్చిన కాఫీ నీళ్ళు మాత్రం తాగి ఆఫీసుకి వెళ్ళారు.వెళ్ళాకా ఆలోచించడం మొదలెట్టా. ఏమి చెయ్యాలి అని.ఇంట్లో ఏమో బెండకాయలు,ఆకుకూర,క్యాబేజీ కనిపించాయి. అన్నింట్లోకీ వీజీ బెండకాయే అనిపించింది.

అంతకు ముందు రోజే అమ్మ ఆలూ ని కుక్కర్ లో ఉడికించడం చూసి,బెండకాయలు కూడా శుభ్రం గా కడిగి కట్ చేసి కుక్కర్ లో పెట్టా ఒక 3-4 విజిల్స్ వచ్చేవరకు.తక్కువ విజిల్స్ అయితే ఉడకదేమో అని భయం మరి.


కుక్కర్ తీసి చూద్దును కదా,స్కూలో ఝండాలంటించుకునే మైదా పిండి కి ప్రతిసౄష్టి కనపడింది. ఏమీ కాదు,నూనె లో వేయిస్తే ఈ తడి పోతుంది అనుకుని ,స్టవ్ మీద మూకుడూ పెట్టాను. నూనే ఎంత వెయ్యాలి అని డవుటు.

మరలా అమ్మ ఆలూ ఫ్రై కోసం పెట్టిన నూనె గుర్తుకు తెచ్చుకుని,ఎందుకయినా మంచిదని కొంచెం ఎక్కువ అనగా మూకుడి సగం వరకు నూనె పోసాను. నూనె కాగాకా, దానిలో పోపు వేసా.పోపు కూడా ఆషా మాషీ పోపు కాదండోయ్,అమ్మ దాచిపెట్టిన "వనిత" పుస్తకాలలో చదివిన వంటలలో అన్నీ సమ పాళ్ళలో వెయ్యమన్నది గుర్తొచ్చి ఆవాలు,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు,ఎందు మిర్చి,ఇంగువ వైగైరా పోపుల పెట్టె లో కనపడిన వన్నీ తలా ఒక స్పూను వేసా.

ఇప్పుడు నా ఝండా పిండి ని అలా దూరం గా నిలబడి దానిలోకి వేసాను.కాసేపయ్యాకా చూసినా కానీ అమ్మ చేసే బెండకాయ కూర రూపు కనపడలేదు. ఇంతలో నాన్నగారొచ్చారు లంచ్ కి.వంటింట్లోకొచ్చి చిల్లుల గరిటె తో ఆ పదార్ధ్హాన్ని నూనే లేకుండా ఒక గిన్నెలో తీసి జావ లాంటి అన్నంతో మారు మాట్లాడకుండా తినేసారు. ఎలా ఉంది నాన్నగారూ వంట,అని అడిగా. అమ్మ కంటే బాగా చేసావు నాన్న అన్న మాట విని,కూర ఖాళీ చేయబోయిన దాన్నల్లా ఆగి కొంచం అమ్మ కోసం ఉంచా.


సాయంత్రం అమ్మ రాగానే అమ్మ కి చూపించేసరికి......
బెండకాయలెందుకు ఉడకబెట్టావే అంది. నువ్వు అలూ పెడతావుగా అందుకే అన్నాను.నిన్ను ఫాలో అయ్యగా,ఇంకా తప్పేంటి అన్న ధీమాతో. వంటింట్లోకెళ్ళీ మరి ఈ నూనె ఏమిటి అని అడిగింది.నువ్వు ఆలూ వేయించేటప్పుడు వేసే అంతటి నూనే వేసాను అన్నాను.

అర్ధమయ్యిందనుకుంటా మీకు...అలూ ఉడక బెట్టినట్లు బెండకాయ కుక్కర్లో పెట్టాను,పోనీ ఉడికిస్తే ఉడికించా తక్కువ నూనె వెయ్య్ద్దూ పోపులో,ఆలూ ఫ్రై గుర్తు తెచ్చుకుని సగం నూనె పోసేసా అన్నమట. అదన్నమాట,ఆలూ ఇన్స్పిరేషన్ తో నా మొదటి కూర ఎక్స్పీరియన్స్.

మరలా ఎప్పుడూ మా అమ్మ నన్ను వదిలి ఊరెళ్ళకపోవడంతో,నాన్నగారికి మా అమ్మ కంటే మంచి వంట తినే భాగ్యం లేకపోయింది.

ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఎప్పుడూ వంట నేర్చుకున్న పాపాన పోలేదు. ఆ తరువాత హాస్టలు. హాస్టలు నుండి ఇంటికి వెళ్ళినప్పుడేమో మహరాణీ భోగం,హాయిగా అమ్మ చేస్తే తిని పెట్టడం. ఏరోజయినా కూర చెయ్యకుండా పప్పు,పచ్చడి తో సరిపెడితే రంకెలెయ్యడం. ఎప్పుడయినా వంటింట్లో కి వెళ్ళినా సగం సేపు నాకు వంటిల్లు సర్దటం తోనే సరిపోయేది. ఇదిగో ఈ పచ్చడి పాత పడింది,ఇంకా ఎందుకు ఉంచావు అని పాత ఉసిరికాయో చింతకాయో తీసి బయట పడెయ్యడ్డనికి రెడీ అవ్వడం, మా అమ్మ లోపలకి వచ్చి నీకు తెలీదు ఇవన్నీ పాడవ్వని పచ్చళ్ళు,ముందర నడూ బయటకి అని నన్ను బయటకి పంపేసేది.

మా అమ్మ చలవ,నా బద్ధకం వల్ల అసలు అన్నంలో ఎన్ని నీళ్ళు పొయ్యాలో కూడా తెలీని పసి వయసులో(వంట రానప్పుడు పసి వయసేగా)పెళ్ళయిపోయింది.

అత్తగారింట్లో మొదటి సారి వంట చెయ్యక్కర్లేకుండా గడచిపోయింది. రెండో సారి ఉగాది కి వెళ్ళాము. పొద్దున్నే లేచి తయారయ్యి వంటింట్లో కి వెళ్ళాను. అక్కడ అత్తగారు ములక్కాడలు,దోసకాయ ఇంకా ఏవో పెట్టుకుని వంటకి తయారవుతున్నారు.

నేను చేస్తానండీ అన్నా వినయంగా. వద్దమ్మ,టిఫిన్ తిను ముందు అన్నారు. చేస్తా అని అనేసా కానీ అసలు వాటితో ఏమి చెయ్యాలో కూడా తెలీదు. టిఫిన్ తిని మరలా పట్టుబట్టాను నేను వంట చేస్తా అని.నిజంగా చెయ్యి అని ఉండుంటే ....దేవుడా...నిన్ను నమ్మినందుకు కాపాడావు అనుకుంటా ఇప్పుడు అది గుర్తొచ్చిన్నప్పుడల్లా.

వంట వద్దు కానీ,కాస్త ఈ ములక్కాడలు తరిగివ్వు చాలు అన్నారు. సరే,అదెంతసేపు అని చాకు తీసుకుని కింద కూర్చున్నా. ములక్కాడలని తరిగి మధ్యలో వచ్చే ఈనెలు తియ్యాలి అని తెలీదు.నిజం. ఒక 2 ముక్కలు తరిగేసరికి నా ప్రావీణ్యం అర్ధమయ్యింది అత్తగారికి. మోటారు ఆఫ్ చెయ్యమ్మా అని ఓ పని అప్ప చెప్పి చక చకా తరిగి ఈనెలు తీయడం చూసి నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు.

ఆరోజు పెసర వడలు వేస్తున్నారు పొద్దున్నే టిఫిన్ కోసం. వాటిని అలా చేతి మీదో,పాల కవర్ మీదో సుతారం గా వెయ్యడం చూసి ఓస్,నేనూ చేసిపడెయ్యగలను అనుకున్నాను. దగ్గరకి వెళ్ళగానే,వద్దమ్మ,ఇదిగో ఈ కాఫీ మామయ్యగారికి ఇచ్చి రా అన్నారు.తడబడే అడుగులతో కాఫీ పట్టుకుని వెళ్ళాను.భయం తో కాదు అడుగులు తడబడింది,చీర కట్టుకున్నా కదా,దానితో ఇబ్బంది.


నాకేమీ రాదు,అయినా కొత్త కోడలికి వంట రాదనుకుంటారేమో అనుకుని మరలా వెళ్ళా వంటింట్లోకి. ఇక విసుగొచ్చిందో ఏమో ఆవిడ పాల కవర్ మీద గారే అద్ది(నా ప్రావీణ్యాన్ని ములక్కాడ తరిగినప్పుడే అంచనా వేసుంటారు) నాకిచ్చారు నూనెలో వెయ్యమని.

నిజం చెప్పొద్దూ,నాకు చచ్చే భయం నూనెలో కూర ముక్కలు వెయ్యాలన్నా కానీ.ఇక అంత సల సలా కాగే నూనె లో గారె వెయ్యడమంటే..హమ్మో.

పెళ్ళికి ముందు చదివిన షివ్ ఖేర పుస్తకం "యూ కెన్ విన్" ఓ సారి గుర్తు తెచ్చుకుని కాస్త వెనక్కి జరిగి పై నుండీ గారె వేసా నూనెలో. బుడుంగ్......అని నూనె చింది పక్కనున్న వస్తువుల మీద పడింది.

అత్తగారి వైపు చూసా భయం భయం గా. వాడు లేచుంటాడు చూడమ్మా అని మెత్తగా చెప్పారు నువ్వు ఇక దయ చేయి అని :).

ఇంతలో ఎవరో వచ్చారు ఇంటికి.అయిపోయాను,వీళ్ళకి వంట చెయ్యాలో ఏమో అనుకున్నా. ఇంతలో మా అత్తగారు లోపలకి పిలిచి ప్లేటు నిండా గారెలు సర్ది వాళ్ళకి ఇచ్చి రమ్మన్నారు. ఆవిడ వెనకాలే వచ్చి ఈరోజు అమ్మాయ్యే వంట చేసింది అని చెప్పేసరికి, నేను టైడ్ తెల్లదన్నాన్ని చూసినప్పటికంటే ఎక్కువ అవాక్కయ్యాను.


వచ్చినవారు మగవారు కాబట్టి సరిపోయింది. ఆడవాళ్ళు వచ్చుంటే తిన్నగా వంటింట్లో కి వచ్చేసి కూర్చుని,అక్కయ్యా రావే మాట్లాడూకుందాము అని మా అత్తగారిని పిలిచి కబుర్లాడటం మొదలుపెట్టి ఉంటే.....

అలా మొత్తానికి అత్తగారింట్లో గండం గడచిపోయింది. నాకు వంట రాదన్న సంగతి ఎక్కడా బయటకి రాకుండా పాపం అత్తయ్యగారు బాగా మేనేజ్ చేసారు. కానీ నిజం నిప్పులాంటిది,దాగదు కదా.

ఒక శుభ ముహుర్తాన బయటపడిపోయాను. మళ్ళీ చెప్తా ఆ విషయం.

Tuesday, September 14, 2010

టీవీ వంటలుఎప్పుడూ చేసే బెండకాయ,వంకాయ కూరలు,పోపేసిన శనగలు,బజ్జీల లాంటి స్నాక్స్ బోరు కొట్టి కొత్తగా ఏమి చేద్దామా అని ఆలోచించి ఎలాగూ వంటల కార్యక్రమాలు వస్తుంటాయి కదా అని ఇప్పుడే మన తెలుగు చానెల్ లో ఒక వంట కార్యక్రమం చూసాను. వంట ల సంగతి దేవుడెరుగు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద ఎందుకు ఇన్నిన్ని జోక్స్ పుట్టుకొస్తాయో అర్ధమయిపోయిందోచ్.


ఈరోజు ఒకావిడ అదేదో బిర్యాని,కార్న్ కబాబ్ చూపించారు.మన యాంకర్ ఆవిడని అడుగుతుంది ఈ కార్న్ కెబాబ్ ని నెయ్యి లేదా డాల్డా లో కూడా వేయించచ్చా అండీ అని. అసలే ఇలాంటి వంటకాలలో సగం పోషకాలు చచ్చి ఉంటాయి. ఇంకా వీటిని నెయ్యి డాల్డా లలో వేపి అనవసర కొవ్వు వంటికి పట్టించుకోవడం కాకపోతే మరేమిటి?

కెబాబ్స్ వేసి అవి వేగుతున్నప్పుడు యాంకరు "వీటిని ఒక వైపు వేపాకా మరోవైపు తిప్పాలాండీ" అని అడిగింది. అక్కడున్నావిడ సంగతేమో కానీ నాకయితే యాంకర్ ని గరిట తిప్పి ఒక్కటెయ్యాలనిపించింది.

మన సగం మంది యాంకర్లకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలాగూ లేదు.కనీసం రికార్డెడ్ ప్రోగ్రాంస్ లో అయినా ఇలాంటివి తొలగించచ్చు కదా.ఏమో లెండి ఇలాంటి పిచ్చి వాగుళ్ళు ఎన్ని ఫిల్టర్ చేసారో మన ముందుకి తెచ్చే ముందు :)


ఇంకో ప్రోగ్రాం లో ఒకావిడ కూరగాయల సిక్స్టీఫవో ఎయిటీఫయివో చూపించింది.

సగం కూరలని ముందు నూనె లో వేపి మరలా ఏదో పిండి పట్టించి మరలా నూనెలో నిండా ముంచి స్నానం చేయించి చివరాఖరికి గార్నిష్ అంటూ ప్లేటు చుట్టూ క్యారెట్టు,ఉల్లిపాయలు,ఎక్సెట్రా ఎక్సెట్రా. మాంచి బజ్జీలో,మంచూరియానో చేసి ప్లేటు లో పెట్టి చివరికి చుట్టూ గార్నిష్ అంటూ ఎన్ని పచ్చి ముక్కలు పెట్టినా చివరికి ప్లేటులో మిగిలేవి ఈ పచ్చి ముక్కలే.అంత మాత్రానికి ఆ హడావిడి ఎందుకో?
టీవీలలో వంటలు చేసే వాళ్లని చూస్తే హాచ్చర్యమేస్తుంది నాకు. ఎంత నీటుగా కనీసం నూనె చుక్క కింద పడకుండా ఎంత పెద్ద వంటైనా చేసెస్తారు.ముందర అదేదో చేసి చివరికి నూనెలో వేయించి తియ్యాలి అంటే ఎంత లేదన్నా నాకు ఓ రెండు మూకుళ్ళు,3-4 గరిటెలు,వంటింటి గట్టు మీద అక్కడక్కడా పిండి,నేల మీద ఒకటి రెండు కూరగాయ తొక్కులు కనీసం ఉంటాయి వంట పూర్తయ్యేసరికి.


హేమిటో,ఎప్పుడు నేర్చుకుంటానో అలాగ?

Friday, July 16, 2010

మా ప్రభు మామయ్య కబుర్లు

నా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ప్రభు అని మా నాన్నగారి కొలీగ్ ఉండేవాడు.అప్పటికి అతనికి పెళ్ళి కాలేదు ఇంకా.ఆఫీసు తరువాత వెళితే అప్పుడప్పుడు క్లబ్బు కి వెళ్ళి టెన్నిస్ ఆడి వచ్చేవాడు.లేకపోతే అదీ లేదు.అప్పుడు టీవీ లలో ఇన్ని ఛానెల్సు లేవు కాబట్టి బ్యాచిలర్ అయిన మా ప్రభు మామయ్య బోలెడు ఖాళీ గా ఉండేవాడు.మాకూ బోలెడు టైంపాస్ తనతో.అక్క కంటే ఎక్కువ నేను వెళ్ళి తనతో కబుర్లు చెప్పేదానిని.

ఒక సారి నేను మా ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినకుండా పేచీ పెడుతున్నాను.అమ్మ శతవిధాలా ప్రయత్నించింది నన్ను ఊరుకోబెట్టడానికి.ఊహూ,ఏడుపు ఆగదే,అమ్మ బ్రతిమాలే కొద్దీ స్వరం పెరుగుతోంది.ఎప్పటి నుండి మరి నా రాగాన్ని వింటున్నాడో సడెన్ గా ప్రభు మామయ్య వచ్చాడు,ఏమిటి వదినా చిన్నది ఎందుకు ఏడుస్తొంది అని.అమ్మ ఏదో చెప్పింది.

నాతో రా అని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి తాళం వేసేసాడు.మన రాజకీయ నాయకుల లాగ నేను దిగ్భ్రాంతి చెందానన్నమాట ఈ హఠాత్ పరిణామానికి.ఇంకా స్వరం పెంచా నా ఏడుపు లో.మా అమ్మ అయితే కరిగేది కానీ అక్కడ ఉన్నది ఎవరు,ప్రభు మామయ్య.అరిచావంటే తాళం వేసి నేను బయటకి వెళ్ళిపోతా అని బెదిరించేసరికి దెబ్బకి నా కచేరీ ఆపేసాను.

ఎంత భయపెట్టేవాడో అంత గా నాతో కలిసి ఆడేవాడు.ఒక సారి నేను వాళ్ళింట్లోకి వెళ్ళినప్పుడు ఏదో వండుతున్నాడు.అదేమిటి అని అదిగా.వెల్లుల్లిపాయలు అని చెప్పి రుచి చూస్తావా అని ఓ రెండిచ్చాడు.ఇంతకీ అవి రొయ్యలుట.నాకు తెలీదు.తిని ఇంటికి వెళ్ళి మా అమ్మ కి చెప్పాను అమ్మ, ఈరోజు ప్రభు మామయ్య వెల్లుల్లిపాయలు వేయించి నాకు పెట్టాడు అని.యధావిధి గా మా అమ్మ తనకి చివాట్లేసింది అనుకోండి.

ఓరోజు నాన్నగారు ఆఫీసు కి వెళ్ళాకా అమ్మ నాన్నగారి షేవింగు సెట్టు తీసి శుభ్రం చేస్తోంది.రేజర్ లో బ్లేడు అమ్మ వేలికి గుచ్చుకుని పాపం రక్తం కారుతోంది.కట్టు కట్టుకుంది అయినా ఆగట్లేదు.నన్ను పిలిచి ప్రభు మామయ్య ఉన్నడేమో చూడు,ఉంటే వెళ్ళి చెప్పు, వేలు తెగి రక్తం బాగా వస్తోందని అని చెప్పింది.


నేను వెళ్ళి చెప్పినప్పుడు ప్రభు మామయ్య నమ్మలేదు.నాన్న పులి కధ లాగ అప్పుడప్పుడూ నేను అబద్ధాలు చెప్పేదానిని లెండి.నిజం మామయ్య అని చెప్పినా నమ్మలేదు పైగా "మా బాగా అయ్యింది" అని చెప్పు అన్నాడు.నేను మా ఇంట్లోకి వచ్చి అమ్మ కి చెప్పాను,"అమ్మా,మామయ్య మా బాగా అయ్యిందన్నాడు" అని.అంతే,మా అమ్మ అరిచిన అరుపు కి తాళం వేసి ఆఫీసు కి బయలు దేరు తున్న మామయ్య మా ఇంట్లో కి వచ్చి అమ్మ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.

మా ఊరిలో అప్పలమ్మ అని ఒకావిడ సారా అమ్మేది.ఒక రోజు నేను స్కూలు నుండి వస్తోంటే ఒక తాగు బోతు నా పక్క నుండి వెళుతూ "అప్పలమ్మ సారాయి నిప్పు లాంటిది" అని పాడుకుంటూ వెళ్ళడం విన్నాను అంటే,అది నా హమ్మింగ్ సాంగ్ అయి కూర్చుంది.

మామయ్య వాళ్ళింటికి వెళ్ళి పాడేదానిని.ఆపు,ఆ పిచ్చి పాట అని మామయ్య అరిచిన కొద్దీ బయటకి పరుగెత్తి మరీ పాడేదానిని.కొట్టడానికి ఒకరోజు నా వెనక పడేసరికి గేటు దాటి బయటకి వచ్చి మరీ గాట్ఠిగా పాడాను.

ఇప్పుడు నవ్వొస్తుంది అవన్నీ తలచు కుంటే,అంత పిచ్చి పాట ని గొంతెత్తి మరీ రామదాసు కీర్తన లాగ ఎలా పాడానో కదా అని.అదేనేమో చిన్నతనమంటే,బెరుకు,భయం ఏమీ తెలీని వయసు.

మనము పెరిగి పెద్ద వాళ్ళయ్యే కొద్దీ బయటకి ప్రకటించే భయం తగ్గుతుందేమో కానీ మానసికం గా బెరుకు మాత్రం పెరుగుతుంది అనిపిస్తుంది నాకు.మంచి పాట అయినా కానీ ఇప్పుడు నేను నడుస్తూ కాస్త గట్టిగా పాడుకోలేను కదా.

ప్రభు మామయ్య పెళ్ళి కి వైజాగ్ వెళ్ళడం,తన పెళ్ళి ఇంకా గుర్తే నాకు.వాళ్ళావిడ(విజయత్తయ్య) ని మా ఊరు తీసుకొచ్చినప్పుడు బోలెడు స్వీట్లు గట్రా పట్టుకొచ్చింది.అప్పటికి నాకు లడ్డు,బాదుషా,మినప సున్ని,మైసూర్పాకు తప్ప వేరే స్వీటు తెలీదు.స్టీలు బిందెలో తను తెచ్చిన ఒక స్వీటు ని సగం నేనే ఖాళీ చేశానేమో.అప్పటికి ఇంకా కాజూ కత్లీ లు లేవు కదా,స్వీటు పేరు గుర్తు లేదు కానీ డైమండ్ షేపు లో పైన సిల్వర్ ఫాయిల్("ముచ్చి రేకు" అప్పటి నా భాష లో) అంటిచ్చిన స్వీటు తెగ నచ్చేసింది నాకు.

ఆ స్వీట్లన్నీ నా కోసం తెచ్చినట్లు దర్జాగా వాళ్ళింట్లొకి వెళ్ళిపోయి నాక్కావాల్సినవి తీసుకునే దానిని.కొత్త అమ్మాయి కదా,అలా వెళ్తే బాగోదని మా అమ్మ ఎంత కంట్రోల్ చేసినా నాకు అర్ధ మయ్యేది కాదు.ఇంతక ముందు ప్రభు మామయ్య ఇంటికి వెళ్తే ఏమీ అనని అమ్మ ఇప్పుడు ఇలా చేస్తోందేమిటా అని.

పాపం మా అత్తయ్య కూడా "ఫరవాలేదు లెంది అక్కయ్య గారు,తనని పంపండి" అనేది.తన గురించి అప్పటికి ఏమీ తెలియకపోయినా,స్వీట్స్ తెచ్చింది అని నాకు తెగ నచ్చేసింది మా అత్తయ్య.తను చేసే కొబ్బరన్నం నా ఫేవరెట్ డిష్.ఈ సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ చేయించు కోవాలి.

చెప్పాలంటే ప్రభు మామయ్య కీ మాకూ ఏ విధమయిన చుట్టరికమూ లేదు ఫ్రెండ్ షిప్ తప్ప.మా నాన్నగారి స్నేహం మామయ్యతో మొదలయ్యి దాదాపు 35 ఏళ్ళు కావస్తోంది,అది ఇప్పటికీ అలా సాగుతోంది.

Monday, May 24, 2010

గుర్తుకొస్తున్నాయి....
మా అక్క వాళ్ళ స్కూలు హెడ్మాస్టారు పోయినప్పుడు శెలవు ఇచ్చారు వాళ్ళకి.నేను అప్పుడు కొత్తగా పెట్టిన కాన్వెంటు లో ఉన్నాను. ఛీ!మా స్కూలు కి హెడ్మాస్టారు లేరె,ప్రిన్సిపాలే ఉన్నారు అని బాధ పడిపోయాను. స్కూల్లో ఎవరు టపా కట్టినా శెలవు అని తెలీదు.అలాంటి శెలవు మొదటి సారి చూడటం మరి.

తరువాత నేనూ మా అక్క స్కూలు కి వచ్చేసా.అప్పుడు స్కూల్లో పేద పిల్లలకి మధ్యాహ్నభోజనం పెట్టేవారు.నాకు ఆ భోజనం తినాలి తెగ కోరిక గా ఉండేది.ఆ సాంబారు చూస్తే నోరు ఊరిపోయేది. అమ్మ చేసిన చిక్కటి సాంబారు నచ్చేది కాదు ఆ నీళ్ళ సాంబారు మాత్రం నోరూరించేది.కొంత మంది పిల్లలు తమ కంచాలు తెచ్చుకుని స్కూల్లోనే భోజనం అదీ చేస్తోంటే నాకు ఇంటికి వెళ్ళి తినాలనిపించేది కాదు.కానీ,చెప్పా కదా,మా ఇల్లు స్కూలు కి బాగ దగ్గర.పైగా మా నాన్న అంటే టెర్రర్,దడా అన్నీ నాకు అప్పుడు.ఆయన ససేమిరా ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ భోజనం తినడానికి.

అక్కకి కూడా తినాలనిపించింది ఒకరోజు.హమ్మయ్య,అది అడుగుతుంది నాన్నగారిని,నేనూ తినచ్చు అనుకున్న.నాన్న మొదట ఒప్పుకోలేదు ఆ భోజనం తినడానికి,అది మనకి కాదు,పేద వాళ్ళకి.మనం అలా తినకూడదు అన్నారు,ఇంతలో అమ్మ అందుకుంది ఆ భోజనం శుభ్రం గా వండరు,ఒకసారి చూడు ఎలా వండుతున్నారో అంది.మళ్ళీ చూస్తా కానీ, తింటాను ప్లీజ్ అంది.మొత్తానికి ఒక 2 రోజులు ఆ భోజనం తినడానికి ఒప్పుకున్నారు.లోపల నుండి వింటున్న నా ఆనందం చూడాలి,ఎప్పుడు తెల్లవారుతుందా,ఎప్పుడు స్కూలు సంచీలో కంచం పెట్టుకుని స్కూలు కి వెళ్తానా అని ఉత్సాహం.పొద్దున్నే స్కూలు కి వెడుతూ అమ్మకి చెప్పా,నాకు మధ్యాహ్నానికి అన్నం వండకు,నేను స్కూల్లో తింటున్నా అని చెప్పి పరుగు లాంటి నడకతో స్కూలు చేరుకున్నా.ఎప్పుడు ఒంటి గంట అవుతుందా అన్న ఆనందం తో పాఠాలు ఏవీ చెవికి ఎక్కలేదు.మొత్తానికి భోజనం బెల్లు వినపడగానే కంచం తీసుకుని పరుగు పెట్టా.అలా స్కూలు లో అందరితో కలిసి తినడం,మొదటి సారి నా కంచం నేనే కడుగుకోవడం,థ్రిల్లింగ్ గా అనిపించాయి.మొత్తానికి ఆనందం గా ఇంటికి చేరా సాయంత్రం.


వస్తూనే సాయంత్రం అక్క తన కంచం తీసి అమ్మ కి ఇచ్చేసి,అమ్మ నేను రేపటి నుండి ఇంట్లొనే తింటాను అంది.ఏమయ్యింది అంది అమ్మ నవ్వుతూ.అమ్మా,ఈరోజు నేను భోజనం చేసి చెయ్యి కడుగుకుంటోంటే చూసాను,నేను చెయ్యి కడుక్కుంటున్నా,ఓ పక్క నుండి అక్కడే బియ్యం కడిగెస్తున్నారు.నా చెయ్యి కడిగిన నీళ్ళు దానిలో పడుతున్నా పట్టించుకోవట్లేదు వాళ్ళు.ఛా,అసహ్యం వేసింది అమ్మా,నిన్ననే రామూ మాస్టారు పరిసరాలు పరిశుభ్రత పాఠం లో కూడా చెప్పారు,అపరిశుభ్ర వాతావరణం లో వండిన ఆహారం తింటే రోగాలొస్తాయని అంది.

అక్క చెప్పింది కదా అక్కడ ఎలా వండుతున్నారో ,రేపటి నుండి నువ్వూ ఇంట్లొనే తిను చిన్నీ అని అమ్మ అనేసరికి కోపం ఆగలేదు నాకు.ప్చ్చ్..ఏమీ చెయ్యలేను.తప్పదు రేపటి నుండీ ఇంటికి రావాలి భోజనానికి అనుకున్నా.

మాకు చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ స్కూలు కి డబ్బులు ఇచ్చేవారు కాదు ఏమయినా కొనుక్కోవడానికి.ఏమి కావాలన్నా నాకు చెప్పు నేను తెస్తా బజార్ నుండి అనేవారు.మా స్కూల్లో ఏమో పిల్లలందరూ పాపమ్మ తెచ్చే జీళ్ళు,మామిడీ తాండ్ర కొనుక్కునే వారు. 5 పైసల కి ఒక తాండ్ర,స్క్వేర్ షేప్ లో ఉన్నది ఇచ్చేది పాపమ్మ.జీడి మాత్రం 10 పైసలు.నాకు నోరూరిపోయేది అవి చూస్తోంటే.నా స్నేహితురాలు ఏమో చక్కగా అన్నీ కొనుక్కునేది.నాకు ఏమో నాన్న ని డబ్బులు అడగాలంటే భయం.పోనీ నాన్న కి తెలీకుండా అమ్మ కూడా ఇచ్చేది కాదు.ఒక ఉపాయం కనిపెట్టా ఒకరోజు.మా ఇంట్లో రక రకాల గులాబీ మొక్కలు ఉండేవి.

ఆరెంజ్ కలర్ గులాబి నేను నా స్నేహితురాలికి ఇచ్చేటట్లు,తను నాకు ఒక జీడి,ఒక తాండ్ర ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాము.ఆహా,పాపమ్మ జీడి తిన్న రోజు నా ఆనందం చూడాలి.కానీ ఈ వ్యవహారం ఎక్కువ రోజులు జరగదు అని నాకు తెలుసు.ఇంట్లో నుండి రోజూ పువ్వు మాయం అయితే దొరికిపోతా కదా,అందుకే.

ఓ 2-3 సార్లు ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చానేమో నా స్నేహితురాలికి అంతే.మొత్తానికి ఆ స్కూలు లో పాపమ్మ జీడి ఎక్కువ సార్లు రుచి చూసే భాగ్యం మాత్రం నాకు కలగలేదు.దసరా అప్పుడు భలేగా ఉండేది మా స్కూల్లో.ఏదో పాట పాడుతూ ఊరంతా తిరిగి చివరికి పప్పు బెల్లం పెట్టేవారు.తెలిసున్న వాళ్ల ఇంటికి వెళ్తే అలా పాట పాడుతూ ఆ ఫీలింగే వేరు.ఆగస్టు పదిహేను వస్తే ఎప్పుడు జెండా వందనం అవుతుందా ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉండే న్యూట్రీన్ చాక్లెట్టులో,ఆరెంజ్ కలర్ లో ఉండే చాక్లెట్టులో తింటామా అని కుతూహలం.అలా చాక్లెట్టు ల కోసం వేచి చూసిన రోజులు గుర్తొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.

నాకు చిన్నప్పుడు నాపేరు అసలు నచ్చేది కాదు.ఏమి పేరు మార్చుకోవాలా అని చూసేదానిని.నాకు మొట్ట మొదట నచ్చిన పేరు "వెంకట లక్ష్మి".మా ఊరిలో అప్పట్లో "గన్ మ్యాన్" ఒకాయన ఉండేవారు.
ఆయన కూతురే ఈ వెంకట లక్ష్మి. ఆయన అడవికి వెళ్ళి పులులని వేటాడతారు అనుకునేదానిని.కానీ ఆయన సెక్యూరిటీ గార్డు అందుకే గన్ను చేతిలో అని తెలీదు అప్పట్లో.మా ఇంటి పక్క ఉండే అప్పల నాయుడు గారికి గేదెలు ఉండేవి.మేము అడవి ప్రాంతం లో ఉండటం వల్ల రాత్రిళ్ళు అడవి జంతువుల సంచారం బాగానే ఉండేది అక్కడ.పైగా మా ఇంటి ఎదురుగుండా పేద్ద అడవి.

అప్పుడప్పుడు చిరుత పులి వచ్చి మా పక్కింటి వాళ్ళ గేదే లని లాక్కు పోయేది అని చెప్పుకునేవారు.ఒక ఉగాది రోజు అమ్మ నాకూ అక్కకీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తను పని చేసుకుంటోంది.ఇంతలో పక్కనే ఉన్న నాయుడు గారి ఇంట్లో హడావిడి.రాత్రి చిరుత వచ్చి గేదె ని లాక్కుపోయిందిట.ఆనవాళ్ళు పట్టుకుని అలా ఇంటి ఎదురు అడవి లోకి కాస్త దూరం వెళ్ళగానే అక్కడ పడి ఉన్న గేదె కనపడింది.

నేనూ అక్కా ఇంటికి వచ్చేసరికి అమ్మ భద్ర కాళీ అవతారం ఎత్తింది.చక్కగా స్నానం చేయిస్తే వెళ్ళి అవన్నీ చూసొస్తారా అని.

మా స్కూల్లో ఒకమ్మాయి ఉండేది,పేరు గుర్తు లేదు కానీ ఎప్పుడూ ఆ అమ్మాయి పాట పాడమంటే చాలు "రాణీ రాణమ్మా" అని అందుకునేది. ఆ అమ్మాయి కి ఇద్దరు తమ్ముళ్ళుండేవారు.ఒకసారి ఆ అమ్మాయిక్లాసు కి వచ్చి మా తమ్ముడు ఇప్పుడే చచ్చిపోయి మళ్ళీ లేచాడు తెలుసా అని చెప్పింది.వాళ్ళ తమ్ముడు చచ్చి పోయి బతికాడుట అని ఒకటే హడావిడి క్లాసు అంతా. ఎలా అయ్యింది అని అడిగారెవరో.స్కూలు కి వస్తోంటే మా తమ్ముడు అలా సడెన్ గా కింద పడి చచ్చిపోయాడు(కళ్ళు తిరిగి పడిపోయాడన్నమాట).మళ్ళీ కాసేపటీకి తనంతట తానే లేచాడు అని చెప్పింది.ఈ వింత ని అమ్మ కి చెప్పాలి అని ఆ రోజు భోజనాల దగ్గర అమ్మ కి చెప్పా.ఇంతలో నాన్నగారు,అలా పడిపోవడాన్ని కళ్ళు తిరగడం అంటారు అన్నారు.నాన్న భోం చేసి లేవగానే మళ్ళీ అమ్మ కి చెప్పా,నిజమమ్మా చచ్చిపోయి బతికాడుట అని.అవతల నుండి నాన్న,చచ్చిపోవడం కాదని చెప్పానా అని ఒక్క కేక వేసారంతే.చుప్ చాప్ గా అన్నం తినేసి బయటపడ్డాను.ఏమిటో వీళ్ళు నమ్మరు అని ఓ నిట్టూర్పు కూడా విడిచానండోయ్.
నెక్స్ట్ టప్పా లో మా ఇంటి పక్కన ఉన్న ప్రభూ మామయ్య తో నా ఎక్స్ పీరియన్స్ గురించి రాస్తాను.

Sunday, May 23, 2010

గుర్తుకొస్తున్నాయి....
మా అక్క వాళ్ళ స్కూలు హెడ్మాస్టారు పోయినప్పుడు శెలవు ఇచ్చారు వాళ్ళకి.నేను అప్పుడు కొత్తగా పెట్టిన కాన్వెంటు లో ఉన్నాను. ఛీ!మా స్కూలు కి హెడ్మాస్టారు లేరె,ప్రిన్సిపాలే ఉన్నారు అని బాధ పడిపోయాను. స్కూల్లో ఎవరు టపా కట్టినా శెలవు అని తెలీదు.అలాంటి శెలవు మొదటి సారి చూడటం మరి.

తరువాత నేనూ మా అక్క స్కూలు కి వచ్చేసా.అప్పుడు స్కూల్లో పేద పిల్లలకి మధ్యాహ్నభోజనం పెట్టేవారు.నాకు ఆ భోజనం తినాలి తెగ కోరిక గా ఉండేది.ఆ సాంబారు చూస్తే నోరు ఊరిపోయేది. అమ్మ చేసిన చిక్కటి సాంబారు నచ్చేది కాదు ఆ నీళ్ళ సాంబారు మాత్రం నోరూరించేది.కొంత మంది పిల్లలు తమ కంచాలు తెచ్చుకుని స్కూల్లోనే భోజనం అదీ చేస్తోంటే నాకు ఇంటికి వెళ్ళి తినాలనిపించేది కాదు.కానీ,చెప్పా కదా,మా ఇల్లు స్కూలు కి బాగ దగ్గర.పైగా మా నాన్న అంటే టెర్రర్,దడా అన్నీ నాకు అప్పుడు.ఆయన ససేమిరా ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ భోజనం తినడానికి.

అక్కకి కూడా తినాలనిపించింది ఒకరోజు.హమ్మయ్య,అది అడుగుతుంది నాన్నగారిని,నేనూ తినచ్చు అనుకున్న.నాన్న మొదట ఒప్పుకోలేదు ఆ భోజనం తినడానికి,అది మనకి కాదు,పేద వాళ్ళకి.మనం అలా తినకూడదు అన్నారు,ఇంతలో అమ్మ అందుకుంది ఆ భోజనం శుభ్రం గా వండరు,ఒకసారి చూడు ఎలా వండుతున్నారో అంది.మళ్ళీ చూస్తా కానీ, తింటాను ప్లీజ్ అంది.మొత్తానికి ఒక 2 రోజులు ఆ భోజనం తినడానికి ఒప్పుకున్నారు.లోపల నుండి వింటున్న నా ఆనందం చూడాలి,ఎప్పుడు తెల్లవారుతుందా,ఎప్పుడు స్కూలు సంచీలో కంచం పెట్టుకుని స్కూలు కి వెళ్తానా అని ఉత్సాహం.పొద్దున్నే స్కూలు కి వెడుతూ అమ్మకి చెప్పా,నాకు మధ్యాహ్నానికి అన్నం వండకు,నేను స్కూల్లో తింటున్నా అని చెప్పి పరుగు లాంటి నడకతో స్కూలు చేరుకున్నా.ఎప్పుడు ఒంటి గంట అవుతుందా అన్న ఆనందం తో పాఠాలు ఏవీ చెవికి ఎక్కలేదు.మొత్తానికి భోజనం బెల్లు వినపడగానే కంచం తీసుకుని పరుగు పెట్టా.అలా స్కూలు లో అందరితో కలిసి తినడం,మొదటి సారి నా కంచం నేనే కడుగుకోవడం,థ్రిల్లింగ్ గా అనిపించాయి.మొత్తానికి ఆనందం గా ఇంటికి చేరా సాయంత్రం.


వస్తూనే సాయంత్రం అక్క తన కంచం తీసి అమ్మ కి ఇచ్చేసి,అమ్మ నేను రేపటి నుండి ఇంట్లొనే తింటాను అంది.ఏమయ్యింది అంది అమ్మ నవ్వుతూ.అమ్మా,ఈరోజు నేను భోజనం చేసి చెయ్యి కడుగుకుంటోంటే చూసాను,నేను చెయ్యి కడుక్కుంటున్నా,ఓ పక్క నుండి అక్కడే బియ్యం కడిగెస్తున్నారు.నా చెయ్యి కడిగిన నీళ్ళు దానిలో పడుతున్నా పట్టించుకోవట్లేదు వాళ్ళు.ఛా,అసహ్యం వేసింది అమ్మా,నిన్ననే రామూ మాస్టారు పరిసరాలు పరిశుభ్రత పాఠం లో కూడా చెప్పారు,అపరిశుభ్ర వాతావరణం లో వండిన ఆహారం తింటే రోగాలొస్తాయని అంది.

అక్క చెప్పింది కదా అక్కడ ఎలా వండుతున్నారో ,రేపటి నుండి నువ్వూ ఇంట్లొనే తిను చిన్నీ అని అమ్మ అనేసరికి కోపం ఆగలేదు నాకు.ప్చ్చ్..ఏమీ చెయ్యలేను.తప్పదు రేపటి నుండీ ఇంటికి రావాలి భోజనానికి అనుకున్నా.

మాకు చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ స్కూలు కి డబ్బులు ఇచ్చేవారు కాదు ఏమయినా కొనుక్కోవడానికి.ఏమి కావాలన్నా నాకు చెప్పు నేను తెస్తా బజార్ నుండి అనేవారు.మా స్కూల్లో ఏమో పిల్లలందరూ పాపమ్మ తెచ్చే జీళ్ళు,మామిడీ తాండ్ర కొనుక్కునే వారు. 5 పైసల కి ఒక తాండ్ర,స్క్వేర్ షేప్ లో ఉన్నది ఇచ్చేది పాపమ్మ.జీడి మాత్రం 10 పైసలు.నాకు నోరూరిపోయేది అవి చూస్తోంటే.నా స్నేహితురాలు ఏమో చక్కగా అన్నీ కొనుక్కునేది.నాకు ఏమో నాన్న ని డబ్బులు అడగాలంటే భయం.పోనీ నాన్న కి తెలీకుండా అమ్మ కూడా ఇచ్చేది కాదు.ఒక ఉపాయం కనిపెట్టా ఒకరోజు.మా ఇంట్లో రక రకాల గులాబీ మొక్కలు ఉండేవి.

ఆరెంజ్ కలర్ గులాబి నేను నా స్నేహితురాలికి ఇచ్చేటట్లు,తను నాకు ఒక జీడి,ఒక తాండ్ర ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాము.ఆహా,పాపమ్మ జీడి తిన్న రోజు నా ఆనందం చూడాలి.కానీ ఈ వ్యవహారం ఎక్కువ రోజులు జరగదు అని నాకు తెలుసు.ఇంట్లో నుండి రోజూ పువ్వు మాయం అయితే దొరికిపోతా కదా,అందుకే.

ఓ 2-3 సార్లు ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చానేమో నా స్నేహితురాలికి అంతే.మొత్తానికి ఆ స్కూలు లో పాపమ్మ జీడి ఎక్కువ సార్లు రుచి చూసే భాగ్యం మాత్రం నాకు కలగలేదు.దసరా అప్పుడు భలేగా ఉండేది మా స్కూల్లో.ఏదో పాట పాడుతూ ఊరంతా తిరిగి చివరికి పప్పు బెల్లం పెట్టేవారు.తెలిసున్న వాళ్ల ఇంటికి వెళ్తే అలా పాట పాడుతూ ఆ ఫీలింగే వేరు.ఆగస్టు పదిహేను వస్తే ఎప్పుడు జెండా వందనం అవుతుందా ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉండే న్యూట్రీన్ చాక్లెట్టులో,ఆరెంజ్ కలర్ లో ఉండే చాక్లెట్టులో తింటామా అని కుతూహలం.అలా చాక్లెట్టు ల కోసం వేచి చూసిన రోజులు గుర్తొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.

నాకు చిన్నప్పుడు నాపేరు అసలు నచ్చేది కాదు.ఏమి పేరు మార్చుకోవాలా అని చూసేదానిని.నాకు మొట్ట మొదట నచ్చిన పేరు "వెంకట లక్ష్మి".మా ఊరిలో అప్పట్లో "గన్ మ్యాన్" ఒకాయన ఉండేవారు.
ఆయన కూతురే ఈ వెంకట లక్ష్మి. ఆయన అడవికి వెళ్ళి పులులని వేటాడతారు అనుకునేదానిని.కానీ ఆయన సెక్యూరిటీ గార్డు అందుకే గన్ను చేతిలో అని తెలీదు అప్పట్లో.మా ఇంటి పక్క ఉండే అప్పల నాయుడు గారికి గేదెలు ఉండేవి.మేము అడవి ప్రాంతం లో ఉండటం వల్ల రాత్రిళ్ళు అడవి జంతువుల సంచారం బాగానే ఉండేది అక్కడ.పైగా మా ఇంటి ఎదురుగుండా పేద్ద అడవి.

అప్పుడప్పుడు చిరుత పులి వచ్చి మా పక్కింటి వాళ్ళ గేదే లని లాక్కు పోయేది అని చెప్పుకునేవారు.ఒక ఉగాది రోజు అమ్మ నాకూ అక్కకీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తను పని చేసుకుంటోంది.ఇంతలో పక్కనే ఉన్న నాయుడు గారి ఇంట్లో హడావిడి.రాత్రి చిరుత వచ్చి గేదె ని లాక్కుపోయిందిట.ఆనవాళ్ళు పట్టుకుని అలా ఇంటి ఎదురు అడవి లోకి కాస్త దూరం వెళ్ళగానే అక్కడ పడి ఉన్న గేదె కనపడింది.

నేనూ అక్కా ఇంటికి వచ్చేసరికి అమ్మ భద్ర కాళీ అవతారం ఎత్తింది.చక్కగా స్నానం చేయిస్తే వెళ్ళి అవన్నీ చూసొస్తారా అని.

మా స్కూల్లో ఒకమ్మాయి ఉండేది,పేరు గుర్తు లేదు కానీ ఎప్పుడూ ఆ అమ్మాయి పాట పాడమంటే చాలు "రాణీ రాణమ్మా" అని అందుకునేది. ఆ అమ్మాయి కి ఇద్దరు తమ్ముళ్ళుండేవారు.ఒకసారి ఆ అమ్మాయిక్లాసు కి వచ్చి మా తమ్ముడు ఇప్పుడే చచ్చిపోయి మళ్ళీ లేచాడు తెలుసా అని చెప్పింది.వాళ్ళ తమ్ముడు చచ్చి పోయి బతికాడుట అని ఒకటే హడావిడి క్లాసు అంతా. ఎలా అయ్యింది అని అడిగారెవరో.స్కూలు కి వస్తోంటే మా తమ్ముడు అలా సడెన్ గా కింద పడి చచ్చిపోయాడు(కళ్ళు తిరిగి పడిపోయాడన్నమాట).మళ్ళీ కాసేపటీకి తనంతట తానే లేచాడు అని చెప్పింది.ఈ వింత ని అమ్మ కి చెప్పాలి అని ఆ రోజు భోజనాల దగ్గర అమ్మ కి చెప్పా.ఇంతలో నాన్నగారు,అలా పడిపోవడాన్ని కళ్ళు తిరగడం అంటారు అన్నారు.నాన్న భోం చేసి లేవగానే మళ్ళీ అమ్మ కి చెప్పా,నిజమమ్మా చచ్చిపోయి బతికాడుట అని.అవతల నుండి నాన్న,చచ్చిపోవడం కాదని చెప్పానా అని ఒక్క కేక వేసారంతే.చుప్ చాప్ గా అన్నం తినేసి బయటపడ్డాను.ఏమిటో వీళ్ళు నమ్మరు అని ఓ నిట్టూర్పు కూడా విడిచానండోయ్.
నెక్స్ట్ టప్పా లో మా ఇంటి పక్కన ఉన్న ప్రభూ మామయ్య తో నా ఎక్స్ పీరియన్స్ గురించి రాస్తాను.

Wednesday, May 19, 2010

...అందుకే అలా చేసా మరి
నాన్నగారి ఆఫీసు దగ్గరే అవడం వల్ల మధ్యాహ్నం భోజనం చేసి అలా ఒకసారి కునుకు తీసి వెళ్ళేవారు.ఒక రోజు నాన్నగారు పడుకున్నాకా నేను అక్క మా ఇంటి పెరడులో ఉన్న ఏదో పాదు కింద కూర్చుని మట్టి తో ఏవో చేసుకుంటున్నాము. తెలుసా, మేము హాయిగా మట్టిలో ఆడుకునేవాళ్ళము చిన్నప్పుడు.లైఫ్ బాయ్ 100% ప్రొటెక్ట్ లు కానీ సానిటైజర్ లు కానీ వాడకుండానే చేతులు కడుకున్న రోజులు గుర్తొస్తే ఒక నిట్టూర్పు విడుస్తా ఇప్పుడు.

ఓకే, మళ్ళీ మా మట్టి ముద్దల దగ్గరకి వస్తే,మా అక్క నా కంటే పెద్దది అవడం వల్ల చకచకా గిన్నెలు చేసెస్తోంది మట్టితో.నాకూ చేసిపెట్టు అన్నా.పాపం ముద్దుల చెల్లి ని కదా,చేసిచ్చింది.సరిపోలేదు నాకు,ఇంకా చెయ్యి అన్నాను,ఆగు అని తనకి చేసుకోవడం మొదలెట్టింది.నాకు చిర్రెత్తుకొచ్చి కసుక్కున కాలు మీద కొరికేసా :) :)

పాపం బాధ తట్టుకోలేక రాగం అందుకోగానే నాకు భయం వేసింది,అంతే దాని నోరు గట్టిగా నొక్కేసా అరవకు అని.పాపం,పిచ్చి మొద్దు కనీసం ఫైట్ చెయ్యకుండా నొప్పి అలా భరించింది.ఇంతలో నాన్న నిద్ర లేచారు.నాకు ఇక టెన్షన్ మొదలు.ఎక్కడ చెప్పెస్తుందో అని ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా.పాపం నాన్నగారికి చెప్పలేదు.నాన్న వెళ్ళాకా అమ్మ చూసీంది అక్క కాలు మీద కమిలిపోయిన నల్లటి మచ్చ.ఏమయింది అని అడిగింది.మొదట అసలు విషయం చెప్పలేదు. కాస్త కోపం గా అడిగేసరికి చెప్పింది మెల్లిగా.ఇక చూసుకోండి అమ్మ లాంగ్ స్కేలు ఒకటి చేత పుచ్చుకుని నా వెనక పడింది.నేను దొరుకుతానా,ఇంటి పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు చుట్టూ పరుగులు.అమ్మ కి విసుగొచ్చి స్కేలు విసిరేసి అక్కని డాక్టర్ బాబూ రావు గారి దగ్గరకి తీసుకెళ్ళింది.

ఆ గాటూ చూస్తూనే ఆయన ఏ జంతువో కరిచుంటుంది అనుకుని ఏమి కరిచింది అని అడిగారు.

అమ్మ నసుగుతూ మా చిన్నది కొరికిందండీ అని చెప్పింది.దానిని ఒకసారి సాయంత్రం మా ఇంటికి పంపండి అని చెప్పి అక్కకి మందులిచ్చి పంపేసారు.

అమ్మ ఇంటికొచ్చి విషయం చెప్పగానే ఇక నాకు దడ మొదలు డాక్టర్ గారు తిడతారని.పోనీ వెళ్లకుండా ఉందామ అంటే,డాక్టర్ గారు చెప్పాకా వెళ్ళకపోతే ఎలాగ అనే భయం.మొత్తనికి సాయంత్రం వాళ్ళింటి దగ్గర షటిల్ కోర్టు కి వెళ్ళా.

డాక్టర్ గారిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి.అమ్మ నన్ను బాగా కొట్టమని ఈయనకి చెప్పి ఉంటుంది అని మనసులో కాసేపు అమ్మ ని తిట్టుకున్నా.అమ్మో ఈయన నన్ను కోడితే,తిడితే ఇలా ఎన్ని ఆలోచనలో.వేరే వాళ్ళు తమ పిల్లల్ని కొడితే అమ్మ నాన్న చూస్తూ ఊరుకోరు అన్న ఙానం లేదు కదా అప్పట్లో.

మొత్తానికి డాక్టర్ గారు నాలుగు చివాట్లు పెట్టి,మానవ దంత గాయం ఎంత విషమో అనే పాఠం చెప్పేసారు.ఈ పాఠానికి ఆకర్షితులయిన అక్కడ ఆడుకునే పిల్లలు కూడా చుట్టూ చేరడం వల్ల అందరికీ మా అక్క ని కొరికినది(కరిచింది) ఎవరో తెలిసిపోయింది.నాన్నగారు తన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి ఆ రాత్రి నాకు,అది వేరే విషయం.

సో మా అక్కని "అది" కరిచిందన్నమాట.

Wednesday, May 12, 2010

వాటర్ ఫాల్స్ పిక్నిక్కు & మా అక్కని ఏం కరిచిందంటే
సరదాగా నా చిన్నతనం లోకి ఒకసారి వెళ్ళాలనిపించింది ఈ రోజు. నిజం గా నా బాల్యం ఎంత అందం గా ఉందో కదా అనిపిస్తుంది నాకు.ఊరంతటికీ కలిపి ఒక హైస్కూలు,అప్పుడే పెట్టిన ఆంగ్లో ఇండియన్ స్కూలు,ఒక పెద్ద(అప్పట్లో చాల పెద్దది అనిపించేది లెండి) గవర్నమెంటు హాస్పిటల్,దానిలో ఏకైక డాక్టర్,అందులో వైద్యుడయిన డా.బాబురావు గారు,ఇప్పటి లాగ ఎక్కడ పడితే అక్కడ షాపులు లేకుండా ఒక రోడ్డులొనే "గనీ" టీ కొట్టు,సరికొత్త ఫ్యాషన్ ని అనుసరిస్తూ శెట్టి గారి బట్టల కొట్టుకి భిన్నం గా ఉండే "అప్సరా" బట్టల షాపు,గోల్డ్ స్పాట్ దొరికే ఏకైక షాపు "ప్రభాకర్" పాన్ షాపు,ఒక సినిమా హాలు,పేద్ద రామాలయం ఇదీ మా ఊరు క్లుప్తం గా.

మొదట నేను గవర్నమంటు స్కూలు కే వెళ్ళాను,తరువాత ఒక 2 సంవత్సరాలు ఆంగ్లో ఇండియన్ స్కూలు మళ్ళీ గవర్నమెంటు స్కూలు.నిజం గా ఆ ప్రైవేటు స్కూళ్ళో టీచర్లు ఆంగ్లో ఇండియన్సే.తెలుగు వారికి అంతంత మాత్రమే వచ్చు. మాతో కూడా ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడేవారు.ఏదో అలా అర్ధం చేసుకుని బండి నెట్టేసాను.
గవర్నమెంటు స్కూలు కి మారాకా,ఎంచక్కా ఫస్టు బెల్లు కొట్టాకా స్కూలు కి బయలుదేరే వాళ్ళము.అంత దగ్గర అన్నమాట స్కూలు.స్కూలు నుండీ రాగానే,హోంవర్కు పెద్దగా ఎప్పుడూ చేసినట్లు మాత్రం గుర్తు లేదు.పెద్దగా ఇచ్చేవారు కూడా కాదనుకుంటా.హాయిగా రాగానే,అమ్మ చేసినది తిని,ఆడుకునే వాళ్ళము.
డాక్టర్ గారి ఇంటి ముందు షటిల్ కోర్టు ఉండేది.చిన్న పిల్లని అని నన్ను రానిచ్చేవారు కాదు.ఎంత కుళ్ళుకునే దానినో అలాంటప్పుడు.మా అక్కకి మాత్రమే ప్రవేశం దానిలో.మా అక్క నా కన్న జస్ట్ నాలుగేళ్ళు పెద్దది అంతే.అప్పుడు వాళ్ళు ఆడుతోంటే,పెద్ద పిల్లలు ఆడుతున్నారు అనుకునేదానిని.ఇప్పుడూ నవ్వు వస్తుంది,10-11 ఏళ్ళ పిల్లలు పెద్దవాళ్ళా అని. నాన్నగారి ఆఫీసు కూడా ఆ కోర్టు కి ఎదురుగా ఉండేది.నన్ను వీళ్ళు షటిల్ ఆడించుకోకపోవడంతో,ఏమి చెయ్యాలో తోచేది కాదు.కోర్టు పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లో ఒక రేగి చెట్టు,దాని కింద పెద్ద పుట్టా ఉండేవి.రేగిపళ్ళు నోరూరిస్తూ ఉండేవి.కాని కోసుకోవాలంటే భయం.పుట్ట భయం కన్నా,నాన్న గారు చూస్తారేమో అనే భయం ఎక్కువ.ఒకరోజు ధైర్యం చేసి ఆ చెట్టు కిందక్కి వెళ్ళి పళ్ళు కోస్తున్నాను.నా టైం బాగాలేక ఆరోజు నాన్న,త్వరగ ఇంటికి వస్తూ నన్ను చూసారు.ఇంక,నా టెన్షన్ చూడాలి.ఒకసారి అలా ఆగి ఇంటికి వెళ్ళిపోయారు.హమ్మయ్య,గండం గడచింది అనుకున్న.ఇంటికి వెళ్ళాకా తెలిసింది...దువ్వెన తీసుకుని చేతి మీద కొట్టారు నాన్న.అంతే,మళ్ళీ ఆ చెట్టు జోలికి వెళ్ళలేదు.

మా ఊరి దగ్గరే ఒక వాటర్ ఫాల్ కూడా ఉండేదండోయ్.ఎంత అందం గా ఉంటుంది అనుకున్నారు.హోరున పారే జలపాతం,ఆ వైపు నుండి ఈ వైపు కి వెళ్ళడానికి వీలుగా అన్నట్లు ఏదో చెట్టు ఊడలు.మధ్యలో ఒక 4-5 గురు కూర్చోవటానికి వీలుగా బండరాళ్ళు. కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు ఇటు నుండి అటు ఆ ఊడలు పట్టుకుని వెళ్ళేవారు.నెలకో రెండు నెల్లకో ఒకసారి ఒక 20 మంది ఆడవాళ్ళు,పిల్లలని తీసుకుని అక్కడకి పిక్నిక్ కి వెళ్ళేవారు. "సులేమాన్" వ్యాన్ లోనో,ఇంజనీరు గారి భార్య ఆర్డరేసి ఇప్పించిన లారీలోనో ఆడవాళ్ళు అందరూ వంట సామానులు తీసుకుని పిల్ల జల్లతో బయలు దేరేవాళ్ళు.అక్కడకి వెళ్ళాకా మా అమ్మ వాళ్ళు వంట చేస్తోంటే మేము ఆటల్లో మునిగేవాళ్ళము.భోజనాలు అయ్యాకా,అమ్మ వాళ్ళు కూడా ఏవో ఆటలు ఆడుకునేవారు.సాయంత్రం పేకప్.ఇలా ఉండేది మా పిక్నిక్.ఒకసారి ఇలా వెళ్ళినప్పుడే కొంతమంది ఔత్సాహిక పిల్లలకి ఆ జలపాతం ఎక్కడ మొదలవుతోందో చూడాలనే కోరిక పుట్టింది.

అమ్మ వాళ్ళు వంటల బిజీ లో ఉండగానే,చక్కగా కొండ పైకంటా ఎక్కేసారు.(నేను ఎక్కలేదు లెండి.కాస్త శ్రమతో కూడుకున్నవాటికి నేను దూరం).మెల్లిగా అమ్మ వాళ్ళు చూసేలోపు కిందకి కూడా దిగేసారు.కాని ఇది జరిగిన ఒక 3-4 రోజులలోనే మా పిల్ల గ్యాంగు పెద్ద "దినేష్ అన్నయ్య" కాలం చేసాడు.ఆయాసం వచ్చి పోయాడుట అని అనుకున్నామే గాని,అది ఆరోజు అమ్మ వాళ్ళకి తెలీకుండా కొండ ఎక్కడం వల్ల తనకి ఎప్పటినుండో ఉన్న "ఆస్త్మా" ఎక్కువ అయ్యింది అన్న ఙానం లేదు అప్పట్లో.కాని ఈ సంఘటన మా పిల్లలందరికీ మాత్రం షాక్.చాలారోజులు పట్టింది కోలుకోవడానికి.

ఒకరోజు మా అమ్మ,అక్కని తీసుకుని హాస్పటల్ కి పరుగెత్తింది.డా.బాబూరావు గారు అక్క కాలు చూస్తూనే షాక్ తిని "ఏమి కరిచింది" అని అడిగారు.

మా అక్క కాలుకి ఏమయ్యిందో తెలుసా?.......వూహూ..ఇప్పుడు చెప్పనుగా.

Friday, May 7, 2010

వన్ ఫైన్ మార్నింగ్


మొత్తనికి ఆ ఒక రోజు రానె వచ్చింది. నేను పీజీ కాన్వకేషన్ సర్టిఫీకెట్ తీసుకోలెదు,ఆ ఊరు వెళ్ళి తీసుకుందాము అని నిర్ణయించుకున్నము నేను మా వారు.ఇంతలో మా వారి ఫ్రెండ్ ఫోను చేసి వాళ్ళ చెల్లి ది ఏదో పీజీ డిప్లోమా
సర్టిఫీకెట్ కూడ ఉంది తీసుకురమ్మన్నాడు.అదేమిటీ అలా ఎలా ఇస్తారు,మనిషి లేకుండా అన్నాను సీరియస్సు గా.అదేమీ పీహెచ్ డీ సర్టిఫీకెట్ కాదు కదా,తేవచ్చులే కాస్త మేనేజ్ చేస్తే అని నా నోరు నొక్కేసారు.మొత్తానికి ఆ అమ్మాయి పేరు,డేటాఫ్ బర్త్,కాలేజీ పేరు నాతో బట్టీ పట్టించారు.

యూనివర్శిటీ కి వెళ్ళి నా సర్టిఫీకెట్ తీసుకున్నాకా ఆ అమ్మాయి సర్టిఫీకెట్ కోసం వెరే డిపార్ట్ మెంట్ కి వెళ్ళాము.వెళ్ళేముందు మా వారు చిన్నపటి నుండీ తిన్న నా చ్యవనప్రాశ్ శక్తి కి ఒకసారి పరీక్ష పెట్టి పాస్ అనుకున్న తరువాత క్లర్క్ దగ్గరకి పంపారు.

అక్కడకి వెళ్ళి నేను ఫలానా సర్టిఫీకెట్ కావాలని అడిగాను.ఒకసారి అలా మొహం లోకి చూసి ఆ ఫైల్ తీసాడు క్లర్కు.ఆ ఒక్కసారి చూసిన చూపుకే వణికిపోయాను పట్టేసాడా ఏమిటి అని.దూరం గా ఉన్న మా వారి మొహం చూసా ఒకసారి.ఏమీ కాదు అని విష్ణు మూర్తి లాగ కళ్ళ తోనే అభయం ఇచ్చేసరికి ధైర్యం వచ్చేసింది నాకు.

ఇంతలో ఆ క్లర్కు సెర్టిఫీకెట్ ఇచ్చి సంతకం పెట్టమని రిజిస్టర్ ఇచ్చ్హాడు.సడెన్ గా వచ్చే టీవి యాడ్ లాగ ఇంకొకతను టీ తాగుతూ చిద్విలాసం గా వచ్చి ఎంటి కబుర్లు అంటూ ఈ గుమాస్తా తో కబుర్లు మొదలెట్టాడు.ఆగు ఈ సర్టిఫీకెట్ ఇచ్చి మాట్లాడతా అన్నాడు.వెంటనే రెండో శాల్తీ,ఏమి సర్టిఫీకెట్టు,అలా ఎలా ఇచ్చెస్తావు,కనీసం ఐడీ కూడా లేకుండా అనేసరికి నా గుండెలు జారిపోయాయి.

హా,అవును కదూ,అమ్మాయ్ నీ ఐడీ కార్డు చూపించు అన్నాడు.తెలంగాణా ఇదిగో అని అరచేతిలో చూపించి చటుక్కున వెనక్కి తగ్గితే కేసీఆర్ ఫేసు ఎలా ఉంటుందో అలా అయ్యింది నాది కూడా.

ఐడీ..అదండీ..తేలేదు..ఊరినుండి వచ్చే హడావిడిలో మర్చిపోయాను అని అలా కోక్ నమిలా(నీళ్ళు బదులు కోక్ నమిలా అన్నమాట..అర్ధం చేసుకోరు).ఇంతలో మా వారు దగ్గరకి వచ్చి నిలబడ్డారు.ఐడీ మర్చిపోయాం సార్,మాకు మళ్ళీ వచ్చే టైం కూడా లేదు అని శాంతి స్వరూప్ ని మించి ఎంతో దీనంగా చెప్పేసరికి క్లర్కు కాస్త మెత్తబడి,సరే కాని కనీసం నీ డేటాఫ్బర్త్ చెప్పు అన్నాడు.

ఓయెస్,అనుకుంటూ తడబడకుండా చెప్పేసా,తడబడితే అనుమానిస్తాడని."మీ ఇంటి పేరు?" అంటూ మరో మిసయిల్ దూసుకొచ్చింది.అదీ చెప్పాను(మా వారి ఫ్రెండు ఇంటి పేరు తెలుసు నాకు) మా వారు ఇచ్చిన కోచింగు లో ఇది లేకపోయినా సర. వెంటనే మా వారి వైపు విజయగర్వతో ఒక చూపు కూడా విసిరా,చూడండి అన్నట్లు.మీ నాన్నగారి పేరు?...ఈ ప్రశ్న వినగానే నా గుండెలు జారిపోయాయి,ఓరి నాయనో,10 th క్లాస్ పరీక్ష లో పీజీ కొచ్చన్ వచ్చినంత గా ఫీల్ అయిపోయాను.

వెంటనే మా వారు నోటికి వచ్చిన పేరు చెప్పారు.మీరు చెప్తారేమిటి ఈ అమ్మాయిని అడుగుతోంటే..కస్సుమన్నాడు క్లర్కు.మా మామగారి పేరే కదండీ అని చెప్పి మా వారు మనోహరం గా నవ్వేసరికి క్లర్కు అమాంతం ఐసయిపోయి రిజిస్టర్ ఇచ్చేసాడు సంతకం పెట్టడానికి(ఇంతకీ మా వారు ఆయన పేరు కరక్ట్ గానే గెస్సారు..అదేనండీ గెస్ చేసారు.).నాకయితే ఎగిరి గంతులెయ్యాలి అన్నంత సంతోషం వేసింది.మా వారు నా మీద నమ్మకం ఉంచకపోయినా కాని ఇలాంటి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు.వెంఠనే రిజిస్టర్ అందుకుని గబ గబా నా ఆటోగ్రాఫ్ పడేసా..అంతే క్లర్కు గయ్యిన లేచాడు.హీహీహీ..లేవడా మరి...ఆ అమ్మాయి పేరు బదులు నా పేరుతో సంతకం పెడితే..

ఏవూరు నీది అడిగాడు సీరియస్ గా...మా వారి ఊరి పేరు చెప్పాను...ఇక చూసుకోండి..ఎలా తిట్టాడు అంటే...బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మీరు పెట్టుకున్న సరే,నన్ను పెట్టమన్న సరే,వెస్ట్రన్,ఫోక్ ఏదయినా ఓకే...పిచ్చి పిచ్చిపిచ్చి పిచ్చి గా తిట్టేసాడు ఆ ఊరి ప్రజలని,ఆ జిల్లా ప్రజలని.
.ఈయన గారికి సహోద్యోగుల గొంతులు కూడా కోరస్ కలిసాయి.ఇంకెముంది....జజ్జినకడి జనారే,జనకు జనా జనారే అన్నమాట.

ఆనాడు ఆ క్లర్కు గారి నోటి నుండి జాలువారిన మధుర భాషణములు మచ్చుకు కొన్ని..

దొంగ సంతకాలు చెయ్యడం,అవీ ఇవీ తీసుకుపోవడం,తరువాత మా పీకకి చుట్టుకోవడం అవన్నీ..ఆ అమ్మాయి ని అని ఏమి ప్రయోజనం..నీ కయినా బుద్ధి ఉండక్కర్లా...మీ జిల్ల ప్రజలంతా ఇంతే అనుకుంటా,దొంగ సంతకాలు,దొంగ బుద్ధులు....ఇంకా చాల తిట్టాడు లెండి.

ఆఖరుకి మా వారు సారీ చెప్పి కాస్త జేబు చమురు వదిలించుకుని ఆ సర్టిఫీకెట్ తీసుకుని బయట పడ్డాము.

ఆరోజు అలా మా వారి ఊరిని,వారి జిల్లా ప్రజలని ఇలా హోలు మొత్తం గా ఒకేసారి కడీగి పారేయిస్తానని ముందు తెలీదు కదా,తెలిసుంటే ఆరోజు పొద్దున లేవగానే తప్పక పాడుకునే దానిని...ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని.ఛా..బంగారం లాంటి చాన్సు మిస్సు.


Wednesday, April 28, 2010

మొదటి టపా


ఏమిటో,అప్పుడెప్పుడో ఒక తెలుగు హీరో ఏక కాలం లో 18 సినిమాలు సైన్ చేసాడు కదా, ఆ ఖ్యాతి విని ఆయన గారి మొదటి సినిమా కి వెళ్ళినంత ఉత్సాహం గా ఇక్కడకి రావడం అయితే వచ్చేసా...కానీ ఏమి రాయాలో తెలియట్లేదు..వా..........నన్ను ఎందుకు అలా భయపెడుతున్నారు..మా నాన్నగారికి చెప్తా మీ అందరి పని

అయినా సరే,సంకట మోచన హనుమాన్ ని,విఘ్నాధిపతి వినాయకుడిని తలచుని మొదలెట్టెస్తున్నాను మరి.

మేము చిన్నప్పటినుండీ నాన్నగారి ఉద్యోగ రీత్యా రాష్ట్రం లో వివిధ ప్రాంతాలు తిరిగాము.నాన్నగారి సొంతూరు అనబడే ఊళ్ళో కూడా లంకంత మండువా ఇల్లు ఉంది కానీ దాంట్లో ఎవరూ ఉండరు.ఈ అలుసుతో మా శ్రీవారు నన్ను మీకు ఒక ఊరు అంటూ లేదు అంటూ ఏడిపించేవారు.పళ్ళు నూరుకున్నా కాని ఏమీ చేయలేక ఊరుకునే దానిని,అమాయకురాలిని కదా.

కానీ ఎప్పటికయినా మా ఆయన ఊరుని తిట్టాలి అనే కసి మాత్రం అలా సచిన్ రికార్డుల లాగ పెరుగుతోందే తప్ప తరగట్లేదు.కాని కొన్ని రోజులకి వెతకబోయే తీగ కాలికి దొరికిందన్నమాట.లేదా కాగల కార్యం...ఈ సామెత అయినా ఓకే.కరక్ట్ ది వాడేసుకోండే,చూసి.నేను ఎంత మంచి దాన్నో చూసారా,మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చాను సామెతలలో ఏది కావాలంటే అది వాడుకోవడానికి.ఈ మంచితనాన్నే మా వారు అలుసు గా తీసుకున్నారండీ.ఇంతకీ విషయం లోకి వస్తే,ఒక దివ్యమయిన ముహుర్తాన నేను నా అమోఘ తెలివితేటలతో మా వారితో పాటు వారి జిల్ల ప్రజలందరినీ తిట్టించాను.అదేలాగో తెలుసుకోవాలనుందా...అయితే నా బ్లాగు చూస్తూనే ఉండండి మరి.